పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చోటుచేసుకున్న పరిణామాలను నిశితంగా కాకపోయినా మోస్తరు పరిశీలించినా చిన్నప్పుడు బడిలో చదువుకున్న స్వయం పోషకాలకు, పరపోషకాలకు మధ్య ఉండే తేడా గుర్తుకొచ్చింది. ఆత్మగౌరవం, అస్తిత్వం, రాజకీయార్థకోణంలో చూసినప్పుడు ఈ తేడా మరింత స్పష్టమైంది. అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో జరిగిన చర్చ అనేకానేక ఆసక్తికరమైన అంశాలను మళీ ్లమళ్లీ తెరముందుకు తెచ్చేందుకు పార్లమెంట్ సభ్యులు, కేంద్రమంత్రులు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ర్టాల ప్రజల ఆకాంక్షల ప్రతినిధులుగా ప్రతినిధులుగా వ్యవహరించిన తీరుకు ముచ్చటేసింది. అదే తెలంగాణ నుంచి లోక్‌సభలో ప్రతినిధులుగా ఉన్న మననాయకుల తీరును చూసినపుడు ఒళ్లంతా అగ్నిగోళమైంది.
పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంపై అక్కసు వెళ్లగక్కినప్పుడు..అధికార అహంకారంతో విర్రవీగుతూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని కించపరుస్తున్నప్పుడు ఒళ్లు రోమాంచితమైంది. ఆరు దశాబ్దాల అవిరామ ఆకాంక్షను లెక్కలేకుండా ఎగతాళి చేస్తున్నప్పుడు.. వందల మంది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలు, తెలంగాణ సమాజ వీరోచిత పోరాటాలను నెమరువేసుకుంటూ 13 ఏండ్లుగా స్వరాష్ట్రంలో భానూదయాన్ని స్వాగతిస్తున్న ఈ గడ్డపై పార్లమెంట్ సాక్షిగా ‘సూర్య’గ్రహణం పట్టినందుకు మనుసు కలికలి అయింది. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం ‘దేశ విభజనను చేసినట్టే… ఇండియా-పాకిస్థాన్‌ను విడగొట్టినట్టే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలను విడగొట్టింది’ అనే పోలికతో విషం చిమ్ముతున్నప్పుడు గురజాడ గిరీశం గుర్తుకొచ్చిండు. అవును. నిజం. గిరీశం పాత్రధారి ‘మనవాళ్లు ఉత్త……!’ అన్నట్టే అనిపించింది. తెలంగాణపై అంతలేసి మాటలు అంటున్నా సభలో ఉండి కూడా ఉత్సవ విగ్రహాల కన్నా హీనంగా ప్రాణంలేని బొమ్మలుగా పడిఉన్న తీరును చూస్తే జాలికలిగింది. అయితే, అన్నింట్లో అదే ఉత్సవ విగ్రహ పాత్ర పోషిస్తున్నారా? అంటే అలా పోషించటంలేదు. తెలంగాణ నుంచి గెలిచినవాళ్లకు సొంత రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ఎక్కువ అని తమ నాయకుడిని పల్లెత్తు మాటంటే ఊరుకునేది లేదు అన్నట్టు వ్యవహరించిన తీరుకు ఒళ్లంతా జ్వాలాతీతమైంది.
తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కటానికి కొద్ది నిమిషాల ముందే అదే బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తమిళులు ‘భాషావేర్పాటువాదులు’ అని వ్యాఖ్యానించారు. అంతే, సభ ఒక్కసారిగా వేడెక్కింది. డీఎంకే, కాంగ్రెస్, వీసీకే ఇలా పార్టీలకు అతీతంగా తమిళ ఎంపీలంతా లేచి అభ్యంతర పెట్టారు. తక్షణమే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సిద్ధాంతాలు, వైఖరులు ఏ పార్టీవి వారివే అయినా తాము తమిళగడ్డ బిడ్డలమని, తమ ప్రజల ఆకాంక్షలకు ఎవరు విఘాతం కలిగించినా సహించమని చెప్పిన తీరుకు సెల్యూట్ చెప్పాలని అనిపించింది. డీఎంకే ఎంపీలు రాజా, కనిమొళి, జమ్ము కశ్మీర్ ఎంపీ అల్తాఫ్ అహ్మద్ నియోజకవర్గాల పునర్విభజన కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను, వారి ఆత్మను ఎట్లా విచ్ఛిన్నం చేసిందీ కండ్లకు కట్టినప్పుడు, పంజాబ్ ఎంపీ ప్రొఫెసర్ హర్సిమ్రత్ కౌర్ బాదల్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కోల్‌కతా కాళీమాతగా ఎట్లా బెంగాల్‌ను కాపాడుతుంది? అని వివరిస్తూ తమతమ ప్రాంతాల ప్రతిష్టను పార్టీలకు అతీతంగా ఆకాశానికి ఎత్తిన వైనానికి, తెలంగాణ చెట్టు పేరు చెప్పుకొని గెలిచి ఆ చెట్టుకొమ్మనే కాదు ఆ చెట్టు వేర్లనే తెగనరికేందుకు సాహసిస్తుంటే మన పుణ్యాత్ములు చేవహీనమై, అచేతన జీవుల్లా పడి ఉన్నారేంది? అనే వేదన వెంటాడింది.
తెలంగాణ ఆత్మ నిండినవాళ్లు, తెలంగాణ ఉద్యమంలో మమేకమైనవాళ్లు.. తెలంగాణ సాంస్కృతిక వారధులుగా ఉన్నవాళ్లు సభలో లేకపోవటం తెలంగాణకు జరిగిన తీరని అన్యాయమే. అదే సమయంలో సభానాయకుడిపై విపక్ష సభ్యుడు ఒక్క మాటంటే మాత్రం ఉన్నపళంగా లేచి ఆక్షేపించటం, ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు ఏకంగా క్షమాపణ చెప్పాల్సిందేనని తెలంగాణ ఓట్లతో గెలిచిన కేంద్రమంత్రి పట్టుబట్టారు. అంటే ఆ నాయకుడికి నాయకుడే ప్రధానం కానీ, తెలంగాణ అప్రధానం. ఈ క్రమంలోనే తెలంగాణ ఆత్మగౌరవ, అస్తిత్వ అంశతోనే కాదు రాజకీయార్థిక కోణంలోనూ స్వయంపోషకులే కావాలి. అంతేకాదు పరపోషక.. పరకీర్తి పరులు ఎందరున్నా తెలంగాణకు అపకీర్తే.
-నూర శ్రీనివాస్