దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు శాసన నిర్మాణంలో అతి తక్కువ స్థానం ఇవ్వడం సమంజసం కాదు. తక్కువ సంఖ్యలో ఉన్నవారు అధికారాన్ని చెలాయిస్తూ అధిక సంఖ్యాకులైన మహిళలు, వెనుకబడినవర్గాల వారు రాజ్యాధికారానికి దూరంగా ఉండటం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. ప్రధాని మోదీ పదేపదే చెప్తున్న ‘బేటీ పడావో.. బేటీ బచావో’ అనే నినాదం బీజేపీ ఊకదంపుడు ఉపన్యాసాలకు మాత్రమే పరిమితమైంది.
భారత పార్లమెంట్లో తొలి సారి 1996 లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. 27 ఏండ్లు గడిచినా ఈ బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. 2008లో రాజ్యసభలో చివరిసారి మరో బిల్లును ప్రవేశపెట్టారు. ఇది 2010లో ఎగువసభ ఆమోదం పొందింది. కానీ, దీన్ని లోక్‌సభ సుమారు నాలుగేళ్లు పక్కన పెట్టింది. 15వ లోక్‌సభ ముగింపుతో ఈ బిల్లు సైతం వీగిపోయింది. రాష్ర్టాల అసెంబ్లీలలో మహిళల ప్రాతినిధ్యం 15 శాతం కంటే తక్కువగా ఉన్నది. ప్రస్తుతం దేశంలోని పశ్చిమబెంగాల్‌కు మాత్రమే ఒక మహిళ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాలు, చట్టసభల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఉద్దేశించిన బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందడంలో విఫలమవుతున్నాయి. ప్రస్తుత లోక్‌సభలో మహిళా ఎంపీల ప్రాతినిధ్యం గతంలో కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, రాజకీయ పరంపరలో మహిళలు ఇప్పటికీ అట్టడుగున కొనసాగుతున్నారు.
1998, 1999లో కూడా రాజ్యాంగ సవరణ ద్వారా మహిళల కు లోక్‌సభలో మూడింట ఒక వంతు సీట్ల మేర రిజర్వేషన్‌ను కల్పించడానికి ఉద్దేశించిన బిల్లులను ప్రవేశపెట్టారు. అయితే వీటి విషయంలో రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఎప్పుడూ కుదరలేదు. 2008లో అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు కొంతమంది సభ్యులు మంత్రి చేతిలో నుంచి బిల్లు ప్రతులను లాక్కోవడానికి ప్రయత్నించి వికృతంగా ప్రవర్తించారు. అంటే ఈ బిల్లుపై ఎంపీలకు ఎంత చిత్తశుద్ధి ఉన్నదో అర్థమవుతున్నది. 2019 లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ, కాంగ్రెస్ ఈ అంశాన్ని చేర్చాయి. మహిళల కు లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో 33 శాతం సీట్ల రిజర్వేషన్ కల్పిస్తామని ఈ పార్టీలు పేర్కొన్నాయి. అయితే పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టడం కోసం కేంద్రం తీసుకున్న చర్యలపై 2019 డిసెంబర్లో అప్పటి న్యాయ శాఖామంత్రి, బీజేపీకి చెందిన రవిశంకర్ ప్రసాద్ రాజ్యాంగ సవరణ కోసం ఒక బిల్లును పార్ల మెంటులో ప్రవేశపెట్టడానికి ముందు అన్ని రాజకీయపార్టీల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావాల్సిన అవసరం ఉన్నదన్నారు.
ఛాందసవాద సిద్ధాంతాలను అనుసరించే దేశాల్లో కూడా చట్టసభల్లో మహిళల శాతం మన దేశంలో కన్నా మెరుగ్గా ఉన్నది. బంగ్లాదేశ్, నేపాల్ లాంటి చిన్న దేశాలు స్త్రీ, పురుష సమానత్వం లో మనకంటే ముందున్నాయి. 2002లో పాక్ సైతం జాతీయ అసెంబ్లీలో 17 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేసింది. భారత్ లో మహిళా ఎంపీల వాటా లోక్‌సభలో 14.4 శాతం, రాజ్యసభ లో 11.2 శాతంగా ఉన్నది. ఫ్రాన్స్, దక్షిణకొరియా, నేపాల్ వంటి దేశాలు.. అన్ని రాజకీయ పార్టీలు మహిళలకు 50 శాతం టికెట్లను రిజర్వ్ చేయాలని చట్టాలు చేశాయి. అయితే దక్షిణాఫ్రికాలోని రాజకీయపార్టీలు స్వచ్ఛందంగా మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఇలాంటి నిర్ణయం తీసుకో వడం ద్వారానే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. ఆఫ్రికా ప్రాంతాల్లో జాతీయ పార్లమెంట్లో ప్రపంచ సగటు 26.2 శాతం కన్నా ఎక్కువే మహిళలు ఎంపీలుగా ఉన్నారు. నేపాల్‌లో 34, బంగ్లాదేశ్ 21, పాకిస్థాన్ 20, భూటాన్ 17 శాతంతో మన దేశం కన్నా మెరుగ్గా ఉన్నాయి. ఆసియా దేశాల్లో 19.2 శాతం, అరబ్ దేశాల్లో 18.4 శాతం, పసిఫిక్ దేశాల్లో 13.5 శాతంగా ఉన్నది. మన దేశంలో 10 నుంచి 15 శాతం లోపు మహిళా ఎంపీలు న్నారు. ప్రపంచం మొత్తమ్మీద రెండు దేశాల్లో మాత్రమే పార్లమెం ట్లో 50 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు ప్రాతినిధ్యం కలిగి ఉన్నారు. 2016 జూన్ గణాంకాల ప్రకారం రువాండా దేశంలో 63.8 శాతం, బోలివియాలో 53.1 శాతం ఉండగా, 30 శాతం కంటే ఎక్కువ మహిళా ప్రాతినిధ్యం గల దేశాల సంఖ్య పెరిగింది.
2008లో లోక్‌సభలో మహిళా రిజర్వే షన్ల కోసం ప్రవేశపెట్టిన సవరణ బిల్లును వ్యతిరేకించిన వారు దీనినే ప్రధాన అంశంగా తీసుకొచ్చారు. రిజర్వేషన్‌తో మహిళల పరిస్థితి మారదని పేర్కొన్నారు. అయితే, ఈ వాదనను వ్యతిరేకించిన వారు రిజర్వేషన్లో రొటేషన్ విధానాన్ని అనుసరిస్తే.. ఇప్పటికే ఎంపికైన పురుష ఎంపీలు తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేరు కాబట్టి నియోజకవర్గాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టే అవకాశాలు తగ్గుతాయని, తద్వారా మహిళలు స్వశక్తితో ఎదుగుతారని పేర్కొన్నారు.
అయితే ‘తెలంగాణ జాగృతి సంస్థ’ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల విశిష్టతను ఖండాంతరాలకు వ్యాప్తిచెందేలా కృషిచేశారు. బతుకమ్మ పండగను అధికారికంగా నిర్వహించేస్థాయికి తీసుకొచ్చారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిష్టించే దాకా అలుపెరుగని పోరాటం చేసి విజయం సాధించారు. రేపు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దేశవ్యాప్తంగా మహిళలను ఐక్యం చేసి ఢిల్లీ వేదికగా జంతర్‌మంతర్‌లో ధర్నా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కవిత దీక్షకు భయపడిన బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తమ జేబు సంస్థ అయిన ఈడీని ఉసిగొల్పి ‘జంతర్ మంతర్’ దీక్షకు ముందుగానే ఢిల్లీకి రావాలని పిలిపించింది. దీనిద్వారా కవిత దీక్షను భగ్నం చేయాలనే బీజేపీ కుట్ర బహిర్గతమవుతున్నది.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు)
-కాసర్ల నాగేందర్‌రెడ్డి
+61 478 311 563