మేడిగడ్డ బరాజ్‌లోని 89 పియర్స్‌లో కేవలం 2 పియర్స్ కుంగిన సంగతి అందరికీ తెలిసిందే. భారీ నిర్మాణాల్లో ఇలాంటివి జరగడం అత్యంత సహజమని ప్రపంచ బ్యారేజీల, ఆనకట్టల, ఇతర కాంక్రీట్ నిర్మాణాల చరిత్ర చెప్తున్నది. ఇంత సహజమైన విషయాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. మరో మూడు వారాల్లో రాష్ట్ర శాసనసభకు పోలింగ్ జరుగబోతున్నందున కాళేశ్వరం ఘటనను ప్రధానాస్త్రంగా మలచాలనే నీచ రాజకీయానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దిగజారుతున్నాయి. కల్లోల జలాల్లో చేపలు పట్టాలనే దుర్మార్గులకు ఉద్యమ నేపథ్యం ఉండి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విషాన్ని నింపుకొన్న మరికొందరు తోడవుతున్నారు.
కాళేశ్వరమనే 28 ప్యాకేజీలతో కూడిన ఒక మహా ప్రాజెక్టులోని వందలాది పియర్స్‌లో కేవలం రెండు పియర్స్ కొద్దిగా భూమి లోపలికి కుంగినందువల్ల మొత్తం కాళేశ్వరమే ‘ఖతమైంద’ని విషప్రచారం చేస్తున్నారు. నీటి పారుదల అంశమే జటిలమైనది- అందులో భూ భౌతిక సంబంధ టెక్నికల్ అంశాలు మరింత సంక్లిష్టమైనవి. వీటిగురించి ఏ మాత్రం అవగాహన లేని వివిధ పార్టీల నేతలు, వారికి వంత పాడుతున్న కొందరు ‘విద్యావంతులు’, ఈ అంశాల పట్ల స్పష్టత లేని ఒక్కరిద్దరు రిటైర్డ్ ఇంజినీర్లు వాస్తవాలను అధ్యయనం చేయకుండా, తమ మిడిమిడి జ్ఞానంతో దురుద్దేశపూరితంగా కుట్రకు పాల్పడుతున్నారు. ఈ అంశాలపై ముఖ్యంగా కాళేశ్వరం భవిష్యత్తుపై ప్రజలకు విషయాలు తెలియాలి.
దేశంలోని నదులన్నింట్లో అత్యంత వేగంగా (ఫ్లాష్ ఫ్లడ్స్) ప్రవహించే నది గోదావరి. గోదావరి నదీజలాల్లో తెలంగాణ వినియోగించాల్సిన నీరు సుమారు 966 టీఎంసీలు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వాటా జలాలను వినియోగించడానికి అవసరమైన ప్రాజెక్టుల, బ్యారేజీల నిర్మాణం జరగలేదు.
‘తెలంగాణ ఎగువన ఉన్నది, నీరు దిగువన ఉన్నది-మీకు నీరు రాద’ని ఆంధ్రా పాలకులు అప్పటి తెలంగాణ నాయకుల నోర్లు మూయించారు. నిజానికి గోదావరి నదిపై యాభై ఏడేండ్ల సమైక్య రాష్ట్రంలో ఒక్క బ్యారేజీని కూడా నిర్మించలేదు. దేవాదుల వద్ద నీటి లభ్యత కోసం తప్పనిసరిగా బ్యారేజీ నిర్మించాల్సి ఉన్నా ఉద్దేశపూర్వకంగానే ఎలాంటి బ్యారేజీ నిర్మించలేదు. దీనికి కారణాలు; రాజమండ్రి వద్ద గల ధవళేశ్వరం బ్యారేజీకి నీటిని నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడం, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ బ్యారేజీ కాల్వల ద్వారా సుమారు 10 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టుకు నీరు గోదావరి నిరంతర ప్రవాహం నుంచే అందుబాటులో ఉండటం. ఒకవేళ గోదావరిపై తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ బ్యారేజీ (ఆనకట్ట) నిర్మించినా ఈ ప్రాంత వాగుల నుంచి నదిలోకి వచ్చే నీరు తిరిగి తెలంగాణ ప్రాంతంలోనే వినియోగిస్తారు తప్ప ధవళేశ్వరం దాకా పోదు. ధవళేశ్వరం వద్ద నీటికొరత ఏర్పడిన ప్రతీసారి శ్రీరాంసాగర్, కడెం, కిన్నెరసాని, తాలిపేరు వంటి తెలంగాణ ప్రాజెక్టుల గేట్లు తెరిచి నదిలోకి నీటిని మళ్లించిన ఉదాహరణలెన్నో. జూన్, జూలైలలో గోదావరిలో నీటి ప్రవాహం తక్కువగా ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాలోని లక్షలాది ఎకరాల ఆయకట్టులో మొదటిపంటకు సాగునీటి అవసరాల కోసం తెలంగాణలో తెగే చెరువుల నీరే దిక్కు. మన ప్రాంతంలోని చెరువులను నిర్లక్ష్యం చేయడం వల్ల ఒక్క భారీ వర్షానికే గొలుసులోని చెరువులన్నీ ధ్వంసమయ్యేవి. ఉద్దేశపూర్వకంగానే ఈ విధ్వంసం జరిగింది. ఒకవేళ, తెలంగాణలోని గోదావరిపై ఎక్కడ బ్యారేజీ నిర్మించినా డెల్టాలో నీటి సమస్య ఏర్పడుతుంది. అందుకే గోదావరిపై బ్యారేజీల నిర్మాణం సమైక్య రాష్ట్రంలో జరగలేదు.
‘తలాపున పారుతుంది గోదారి- నీ చేను, నీ చెల్క ఎడారి’ పాటలు తెలంగాణ ఉద్యమంలో విన్నాం. ఈ కుట్రల వల్లనే తెలంగాణలో చివరి రెండు దశాబ్దాల్లో సుమారు 35 వేల మంది రైతులు నీటి గోసతో ఆత్మహత్య చేసుకున్నారు. ఉపాధి లేక లక్షలాది మంది దూర ప్రాంతాలకు వలసపోయారు. వేలాది మంది నక్సలైట్ల ఉద్యమంలో చేరారు.
కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి కాగానే రైతుల సాగునీటి గోస తీర్చడానికి ‘ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు’పై దృష్టిపెట్టారు. చేవెళ్ల దగ్గర కాల్వలు తవ్వినా ప్రాణహితపై బ్యారేజీ నిర్మాణానికి అప్పటిదాకా కనీస అనుమతులు కూడా తీసుకోలేదని, మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర జలసంఘం అనుమతులు పొందే అవకాశం కూడా లేదని అర్థం చేసుకొని కేసీఆర్ ఈ ప్రాజెక్టు రీ-డిజైన్‌కు ప్రయత్నించారు. దీనిలోభాగమే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల పంప్‌హౌజ్‌ల నిర్మాణం. ఆంధ్ర నేతల మాటల్లో చెప్పాలంటే ‘దిగువన ఉన్న గోదావరి జలాలు ఎగువన ఉన్న తెలంగాణ’లో పారాలంటే ఎత్తిపోతలే దిక్కు. ఎప్పుడైతే ఈ బ్యారేజీల నిర్మాణానికి కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారో ఆరోజు నుంచే కాళేశ్వర ప్రాజెక్టుపై విషం చిమ్మడం మొదలుపెట్టారు ఆంధ్రా నేతలు. వీరితో గొంతు కలిపారు తెలంగాణలోని కేసీఆర్ వ్యతిరేకులు, ప్రతిపక్షాలు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని అతిపెద్ద బ్యారేజీ మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ. ఈ బ్యారేజీ పొడవు సుమారు 1600 మీటర్లు. దీనిలో 8 బ్లాకులుండగా ఒక్కో బ్లాకులో సుమారు 10-12 పియర్స్, రేడియల్ గేట్ల (మొత్తం 86) నిర్మాణం జరిగింది. ఈ బ్యారేజీని నిర్మించింది ప్రపంచ ఖ్యాతిగాంచిన, దేశానికే గర్వకారణమైన ఎల్ అండ్ టీ సంస్థ.
మేడిగడ్డ బ్యారేజీతోపాటు 7 లింకులలో 28 ప్యాకేజీలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నాయి. 203 కిలోమీటర్ల టన్నెల్స్ (సొరంగాలు), 1,531 కిలోమీటర్ల పొడవైన ప్రవాహ కాల్వలు, 22 లిఫ్టులు, 141 టీఎంసీ నీటిని నిల్వజేసే 17 రిజర్వాయర్లు, నీటిని ఎత్తిపోసే 91 పంపులు… ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం. ఇంత పెద్ద వ్యవస్థలోని రెండు మూడు పియర్స్ కుంగితే మొత్తం కాళేశ్వరమే ‘ఖతమై’నట్టా? ప్రాజెక్టుపై చేసిన వ్యయం సుమారు లక్షా పది వేల కోట్లు మొత్తం వృథాయేనా? ఎంత ఎన్నికల సమయమైనా ఇంత దిగజారి నీచరాజకీయాలకు పాల్పడితే ప్రజలు వీరిని క్షమిస్తారా?
మేడిగడ్డ లక్ష్మీబరాజ్ 7వ బ్లాకులోని 19, 20వ పియర్స్ కొద్దిగా కుంగడాన్ని అక్టోబర్ 21న ఇరిగేషన్ అధికారులు మొదటిసారి గమనించారు. మరునాడే కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి ఈ అంశంపై లేఖరాస్తూ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులతో విచారణ జరిపించాలనీ కోరారు. మరుసటి రోజే 23వ తేదీన డ్యాం సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగి 24న మేడిగడ్డ బ్యారేజీ పైన రెండు గంటలు ఇంజినీర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకొని 25వ తేదీన జలసాధన రాష్ట్ర ఇరిగేషన్ కార్యాలయంలో అధికారులతో చర్చించారు. 20 అంశాలపై ఎన్డీఎస్ఏ అధికారులు వివరాలు కోరగా అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లు ఇచ్చి మిగిలినవాటికి సమయం కావాలని అడిగారు. వెంటనే వివరాలు ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేశారు. నవంబర్ 1న రాష్ట్ర ప్రభుత్వం వివరాలు ఎన్డీఎస్ఏ అధికారులకు పంపించింది. ఈ వివరాలు వచ్చేదాకా ఓపిక పట్టకుండా, బ్యారేజీ వద్ద ఎలాంటి పరిశీలన జరపకుండా కిషన్‌రెడ్డి రాసిన లేఖలో ప్రస్తావించిన వాటినే పరిగణనలోకి తీసుకొని తమ నివేదికను ఎన్డీఎస్ఏ నేరుగా పత్రికలకు విడుదల చేసింది. దీనిపై రాష్ట్ర జల వనరుల కార్యదర్శి, స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్ తీవ్రంగా ప్రతిస్పందించిన విషయం తెలిసిందే. బాధ్యత గల ప్రతిష్ఠాత్మక సంస్థ ఎన్డీఎస్ఏను కూడా బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐల వలె తమ జేబు సంస్థగా మార్చిందని వీరి నివేదికను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది.
మేడిగడ్డ బ్యారేజీ పియర్స్ ఎందుకు కుంగినవో కారణాలు తెలుసుకోవాలంటే నదీగర్భంలోని నీటినంతా ఖాళీజేసి సుమారు 13 మీటర్ల లోతుకు వెళ్లి పియర్స్ కింది 4 మీటర్ల ఎత్తుగల రాఫ్ట్ అడుగు భాగాన్ని పరిశీలించాలి. అప్పటిదాకా వేచి చూడకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టే లక్ష్యంతో హడావుడిగా ఎన్డీఎస్ఏ తమ నివేదికను రూపొందించి విడుదల చేసింది. ఈ నివేదికలో కిషన్‌రెడ్డి తన లేఖలో వెలిబుచ్చిన అనుమానాలనే ఎన్డీఎస్ఏ వ్యక్తం చేయడం ఆ సంస్థ బాధ్యతారాహిత్యమే. ఈ తప్పుల తడక నివేదికను అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలు, కరడుగట్టి న కేసీఆర్ వ్యతిరేకులు కొందరు ఈ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి రాకుండా నివారించాలనే దుష్టబుద్ధితో అసత్యాలను, అవాస్తవాలను అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలు వీటిని ఏ మాత్రం నమ్మకూడదు.
మేడిగడ్డ వద్ద జరిగింది ప్రమాదమే తప్ప ఎలాంటి డిజైన్ లోపం లేదని ప్రాథమిక అంచనాకు నిపుణులు వచ్చారు. ప్రపంచంలో గానీ, మన దేశంలో గానీ నిర్మించిన వేలాది డ్యాంలు, బరాజ్‌లతో ప్రారంభంలో ఇలాంటి బాలారిష్టాలు సంభవించినట్టు చరిత్ర చెప్తున్నది.
ఒక్క ఇరిగేషన్‌లోనే కాకుండా భవనాలు, బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్ల నిర్మాణాల్లో కూడా తరచుగా ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తొలినాళ్లలోనే కాంగ్రెస్ పాలనలో కడెం డ్యాం వరదకు కొట్టుకుపోతే తిరిగి నిర్మించారు. 44 ఏండ్ల కింద గుజరాత్లో ‘మచ్చు’ డ్యాం తెగి ‘ఊళ్లకు’ ఊళ్లు కొట్టుకుపోయి సుమారు 25 వేల మంది మరణించారు. నాటినుంచి నేటివరకు వందలాది డ్యాంలు, బ్యారేజీలతో జరిగిన ప్రమాదాలను మనం చూశాం. నిన్న, మొన్న గుజరాత్లో కూలిన కేబుల్ బ్రిడ్జి, సిక్కింలో వరద ధాటికి కొట్టుకుపోయిన చుంగ్ తంగ్ డ్యాంలను మనమింకా మరిచిపోలేదు. ఈ డ్యాం ప్రమాదంలో 175 మంది మరణించినా ఇప్పటిదాకా నివేదిక ఇవ్వని ఎన్డీఎస్ఏ మేడిగడ్డ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాలు పరిశీలించకుండానే, ప్రమాదం జరిగిన స్థలంలో ఎలాంటి శాస్త్రీయ పరిశోధన, విచారణ జరపకుండానే బీజేపీ నేతల పర్యవేక్షణలో ఢిల్లీలో కూర్చొని అసత్యాల నివేదికను రూపొందించింది. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి ఎన్డీఎస్ఏ నివేదికకు ఏ విలువా లేదు. దీన్ని ప్రామాణికంగా తీసుకొని సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేయాలని ప్రయత్నిస్తున్నవారు ఎలాంటి వారైనా వారిని తెలంగాణ ద్రోహులుగానే ప్రజలు భావించాలి.
మేడిగడ్డలో కుంగిన పియర్స్‌ను తన డబ్బుతో ఎల్ అండ్ టీ సంస్థ జూన్‌లో పునర్నిర్మిస్తుంది. ప్రజలపై ఎలాంటి భారం పడదు. రైతాంగానికి ఎలాంటి భారం పడదు. రైతాంగానికి ఎలాంటి నష్టం ఉండబోదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చిన ప్రమాదమేమీ లేదు. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 40 లక్షల ఎకరాల్లో పంటలు పండుతాయి. ఓట్ల కోసం నీచ రాజకీయాలకు పాల్పడుతున్న పార్టీలను, వ్యక్తులను, సంస్థలను ప్రజలు తిరస్కరిస్తూ తమ నిరసన తెలుపాలి. వీరి కుట్రలను ఛేదించాలి.
మేడిగడ్డలో కుంగిన పియర్స్‌ను తన డబ్బుతో ఎల్ అండ్ టీ సంస్థ జూన్‌లో పునర్నిర్మిస్తుంది. ప్రజలపై ఎలాంటి భారం పడదు. రైతాంగానికి ఎలాంటి భారం పడదు. రైతాంగానికి ఎలాంటి నష్టం ఉండబోదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చిన ప్రమాదమేమీ లేదు. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 40 లక్షల ఎకరాల్లో పంటలు పండుతాయి. ఓట్ల కోసం నీచ రాజకీయాలకు పాల్పడుతున్న పార్టీలను, వ్యక్తులను, సంస్థలను ప్రజలు తిరస్కరిస్తూ తమ నిరసన తెలుపాలి. వీరి కుట్రలను ఛేదించాలి.
(వ్యాసకర్త: తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్)
– వి.ప్రకాశ్ 90009 50400