కార్పొరేట్లు, పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ సర్కారు 2019-20 మధ్యకాలంలో 29 కార్మిక చట్టాలను రద్దుచేసింది. వాటి స్థానంలో కార్పొరేట్లకు కొమ్ముకాసే నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చింది. దేశంలోని కార్మిక వర్గాన్ని ఆధునిక బానిసలుగా చేసేందుకే తీసుకువచ్చిన ఈ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం చేసిన భారత్ బంద్ విజయవంతమైంది.
నాలుగు లేబర్ కోడ్లలో ఒకటైన వేతనాల కోడ్‌ను 2019లో అమోదించింది. మిగతా మూడు కోడ్లు పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రత కోడ్, విధి నిర్వహణలో భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్లను 2020లో ఎటువంటి చర్చకు అవకాశం ఇవ్వకుండా, సభలో ప్రతిపక్ష సభ్యులు లేని సమయంలో ఏకపక్షంగా, నిరంకుశం గా బీజేపీ సర్కార్ అమోదింపజేసుకున్నది. కాబట్టి ప్రజలు కార్పొరేట్, పెట్టుబడిదారులు లేబర్ కోడ్ల రూపంలో కార్మికవర్గంపై చేస్తున్న దాడిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. అందుకు ముందుగా ప్రతి ఒక్క రూ ఈ లేబర్ కోడ్ల గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవశ్యం ఉన్నది.
పారిశ్రామిక సంబంధాల కోడ్ : ఈ కోడ్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్‌ను చట్టబద్ధం చేసింది. దీంతో శాశ్వత ఉద్యోగాల వ్యవస్థ స్థానంలో తాత్కాలిక ఉద్యోగాల వ్యవస్థను తీసుకురావడానికి మార్గం సుగమమైంది. తద్వా రా రెగ్యులర్ ఉద్యోగ భద్రతకు ముప్పు వచ్చింది. ఈ విధానంలో ఒప్పందం ముగిశాక ముందస్తు నోటీసు లేకుండానే కార్మికులను తొలగించే అధికారం యాజమాన్యానికి ఉంటుంది. అంతేకాదు, ఈ కోడ్ ప్రకారం.. సూపర్వైజర్గా నియమితులై నెలకు రూ.18,000 వేతనం పొందుతున్నవారు కార్మిక క్యాటగిరీలోకి రారు. అంటే వీరికి కార్మిక హక్కులు ఉండవన్న మాట. 300, అంతకన్నా తక్కువ మంది కార్మికులున్న సంస్థలు ప్రభు త్వ అనుమతి లేకుండా కార్మికులను తొలగించవచ్చని ఈ కోడ్‌లో ఉన్నది. పాత చట్టం ప్రకారం కార్మికులు నోటీసు ఇచ్చిన 14 రోజుల్లోపు సమ్మె చేయకూడదు. కానీ, ఈ కోడ్‌తో ఆ గడువు 60 రోజులు పెరిగింది. ఇలాంటి నిబంధనలు కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి ఉన్న శక్తివంతమైన సాధనాన్ని బలహీనపరుస్తాయి.
సామాజిక భద్రత కోడ్ : ఈ కోడ్ వల్ల ఎంతోమంది కార్మికులు పింఛన్, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి ప్రయోజనాలను కోల్పోతారు. అసంఘటిత కార్మికుల సంక్షేమం గురించి నిర్దిష్టమైన కాని, అందుకు తగిన నిధుల గురించి గాని కోడ్‌లో పేర్కొనకపోవడం దారుణం. అంతేకాదు, 20 లేదా అంతకుమించి కార్మికులున్న సంస్థలకే ఈపీఎఫ్ వర్తింపజేస్తారు. అంటే, చిన్న చిన్న సంస్థల్లో పనిచేసే కార్మికులు ఈపీఎఫ్ పరిధిలోకి రారు.
వేతనాల కోడ్ : కనీస వేతనం నిర్ణయించడానికి ఒక ప్రాతిపదిక అనేది ఈ కోడ్‌లో లేదు. కార్మికుడికి కనీస వేతనం రోజుకు రూ.178, నెలకు రూ.4,628 మాత్రమేనని కేంద్రం నియమించిన ఓ కమిటీ 2019, జూలైలో సిఫారసు చేసింది. ఈ వేతనంతో కుటుం బం ఎలా జీవిస్తుందో ఏలికలకే తెలియాలి. పాత చట్టం ప్రకారం కార్మికుడు రోజుకు 8 గంటలు పని చేయాల్సి ఉండగా, ఈ కోడ్ ప్రకారం రోజు 9 గంటలు కచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది.
వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ : ఎక్కువమంది కార్మికుల వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులకు సంబంధించిన రక్షణల నుంచి యాజమాన్యాలు తప్పుకోవడానికి ఈ కోడ్‌ను తీసుకువచ్చారు. ఈ కోడ్ ప్రకారం 50 మంది లోపు కార్మికులున్న కాంట్రాక్టర్ లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లైసెన్స్ లేని చట్టం ప్రకా రం హక్కులను అమలుచేయాలని డిమాండ్ చేయలేం. ఇప్పుడున్న కాంట్రాక్టు లేబర్ చట్టం ప్రకారం రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా కాంట్రాక్టు కార్మికులకు సమాన వేతనం ఇవ్వాలి. కానీ, ఆ ప్రస్తావనే ఈ కోడ్‌లో లేనే లేదు. అంతేకాకుండా మహిళా కార్మికుల సంక్షేమం, రక్షణ గురించి సరైన విధానాన్ని రూపొందించలేదు. ఈ నేపథ్యంలో కార్మికుల పట్ల గొడ్డలిపెట్టులా మారిన ఈ నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. బుధవారం చేపట్టిన భారత్ బంద్ విజయవంతమైంది అంటేనే యావత్ దేశం కార్మికులకు ఎంత మద్దతుగా నిలుస్తున్నదో అర్థం చేసుకోవాలి.