రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ వెనుకబడిన తరగతులకు స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీలు, గ్రేటర్ మున్సిపాలిటీల్లో 42 శాతం రిజర్వేషన్లను ఐదు గ్రూపులుగా వర్గీకరించి అమలుచేస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో, ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. రాజ్యాంగంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అధికరణల్లోని లోపాల ఆధారంగా వెలువడుతున్న సుప్రీంకోర్టు తీర్పులు బీసీ కులాలకు శాపంగా మారాయి.
ప్రజాస్వామ్యం ముసుగులో నడుస్తున్న నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో, వెనుకబడిన కులాలను కాస్త వెనుకబడిన తరగతులుగా/ వెనుకబడిన పౌరులుగా రాజ్యాంగంలో చిత్రీకరించిన పరిస్థితి. ఇప్పటికిప్పుడు బీసీ కోటా 42 శాతం అమలుచేయలేమనేది. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తెలియని అంశం కాదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లను స్థానిక ఎన్నికల్లో అమలుచేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు బీసీ నాయకులు ఆమరణ నిరాహార దీక్షలకు సైతం పూనుకున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇటీవల బీసీ గణాంకాలు, స్థానిక సంస్థల్లో బీసీ కోటా అమలు కోసం చైర్మన్, ముగ్గురు సభ్యులతో కూడిన డెడికేటెడ్ బీసీ కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది.
భారత రాజ్యాంగ రచనలో, తదనంతరం బీసీ రిజర్వేషన్లపై జరిగిన సవరణల్లో తీరని అన్యాయం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 1992లో 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా రాజ్యాంగంలో 243 (డీ) 243 (టీ) అధికరణలను చేర్చి ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా పద్ధతిలో, మహిళలకు 33.33 శాతంగా, బీసీలకు స్పష్టమైన కోటా శాతాన్ని తెలుపకుండా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని తెలిపింది. అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994 నుంచి వెనుకబడిన తరగతులకు 34 శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో కల్పిస్తున్నారు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2019 నుంచి సుప్రీంకోర్టు తీర్పులను సాకుగా చూపిస్తూ, మొత్తం నిలువు రిజర్వేషన్లు 50 శాతం మించవద్దనే నిబంధనతో 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించి బీసీ కోటా అమలుచేస్తున్నారు. ఫలితంగా గత పంచాయతీ ఎన్నికల్లో సుమారు వెయ్యికిపైగా సర్పంచ్ స్థానాలను బీసీలు కోల్పోయారు. మున్సిపాలిటీలు, గ్రేటర్ మున్సిపాలిటీల్లో మాత్రం బీసీ కోటా 34 శాతంగా అమలు జరుగుతుంది. అందుకు కారణం ఎస్సీ, ఎస్టీల జనాభా తక్కువగా ఉండి మొత్తం నిలువు రిజర్వేషన్లు 50 శాతానికి మించడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 1994 నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీ రిజర్వేషన్ల వర్గీకరణ ద్వారా అమలు చేయాలని అత్యంత వెనుకబడిన కులాలు డిమాండ్ చేస్తున్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల కంటే ముందు బీసీ కోటా 42 శాతానికి పెంచి వర్గీకరణ ద్వారా అమలు చేస్తామని బీసీ ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు న్యాయపరంగా, సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా చూసినట్టయితే అసలు బీసీ గణాంకాలు లేనట్టయితే 42 శాతం దేవుడెరుగు ప్రస్తుతం అమలుచేస్తున్న 23 శాతం రిజర్వేషన్లు కూడా అమలుచేసే పరిస్థితి లేదని తెలిసింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక డెడికేటెడ్ బీసీ కమీషన్‌ను నియమించింది.
దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను పరిశీలించినట్టయితే, సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం 2010లో కే.కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన కేసు తీర్పులో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల అమలుపై ప్రత్యేకమైన మూడు నిబంధనలను పెట్టింది. వాటిలో మొదటిది వెనుకబడిన తరగతుల పౌరుల వెనుకబాటుకు సంబంధించి ప్రత్యేక బీసీ కమిషన్ ద్వారా ఆమోదయోగ్యమైన లెక్కలు తీయాలి. రెండవది అట్టి లెక్కల ద్వారా బీసీ కోటాను నిర్ధారించాలి. మూడవది ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లతో కలిపి 50 శాతం నిలువు రిజర్వేషన్లు దాటకూడదని తెలిపింది. ఇదే తీర్పులో అసలు సామాజికంగా వెనుకబడిన తరగతుల జాబితా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుకు, స్థానిక సంస్థల్లో వెనుకబడిన పౌరుల జాబితా వేరుగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుపట్టింది. ఎందుకంటే భారత రాజ్యాంగం ఆర్టికల్ 15(4), 15(5),16(4) ప్రకారం బీసీ కులాలను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులుగా గుర్తించారు. అదే స్థానిక సంస్థల్లో ఆర్టికల్ 243 ప్రకారం బీసీ కులాలను వెనుకబడిన పౌరులుగా గుర్తించారు. భారత రాజ్యాంగంలో బీసీ కులాలను గుర్తించేవిధంగా అధికరణలు లేకపోవడం నేడు బీసీ కులాల పాలిట శాపంగా మారింది. ఈ సమస్యలన్నీ పాలకులకు తెలియనివి కావు. సుప్రీంకోర్టు 2021లో మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వికాస్ కిషన్‌రావు గవలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు తీర్పులో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలంటే ట్రిపుల్ టెస్ట్ ద్వారా మాత్రమే అమలుచేయాలని, లేనట్లయితే బీసీ రిజర్వేషన్లు లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సురేష్ మహాజన వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసు తీర్పులో మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ట్రిపుల్ టెస్ట్ ద్వారా మాత్రమే స్థానిక సంస్థల్లో బీసీ కోటా అమలుచేయాలని, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని, బీసీ గణాంకాలు లేకపోతే బీసీ రిజర్వేషన్లు అమలుచేయవలసిన అవసరం లేదని, ప్రతి ఐదేండ్లకు రాజ్యాంగ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో సహా దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రపాలిత ప్రాంతాలను 2022లో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. అంటే 2022 నుంచి దేశంలో నిర్వహిస్తున్న స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీ కోటా అమలుచేయాలంటే బీసీ గణాంకాలు తప్పనిసరి, అదేవిధంగా మొత్తం నిలువు రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ కోటాతో కలిపి 50 శాతానికి మించి అమలు చేసే అవకాశం లేదు.
కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను వర్గీకరణ ద్వారా అమలు చేయవలసిన అవసరం ఉన్నది. అందుకోసం సుప్రీంకోర్టు 1992లో 9 మంది జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన మండల్ కమిషన్ తీర్పులోప్రధానంగా నిలువు రిజర్వేషన్లు 50 శాతం మించరాదని నిబంధన విధిస్తూ, ఒకవేళ బీసీ గణాంకాలు ఆమోదయోగ్యంగా ఉండి ప్రత్యేక పరిస్థితులు, బీసీల ప్రాతినిధ్యం లేనట్లయితే 50 శాతానికి మించి కూడా రిజర్వేషన్లు అమలుచేసుకోవచ్చని అదే తీర్పులో తెలిపింది.
2010 నుంచి 2023 వరకు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అమలుపై మండల కమిషన్ తీర్పును ఆధారంగా చేసుకొనే సుప్రీంకోర్టు తీర్పులు వెలువరిస్తున్నది. అంటే బీసీ కులాల లెక్కలు శాస్త్రీయబద్ధంగా లెక్కించి కోర్టులు ఆమోదించినట్టయితే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను జనాభా దామాషా పద్ధతిలో అమలుచేయడం అసాధ్యం కాదు. అంటే, రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో సాధారణ పరిపాలన విభాగం, ప్లానింగ్ విభాగం ప్రత్యేక చట్టం ద్వారా రాష్ట్రంలో జనాభా లెక్కలు చేసి డెడికేటెడ్ బీసీ కమిషన్ భాగస్వామ్యంతో కార్యాన్ని పూర్తిచేసి బీసీ కోటాను 42 శాతంగా వర్గీకరణ ద్వారా అమలుచేయవచ్చు.
కానీ, ఇంతటి కార్యాన్ని పూర్తిచేయాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి అవసరం. ఇదంతా కూడా పూర్తిచేసినా రేపు హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిన జనాభా లెక్కలను అందులో బీసీ గణాంకాలను శాస్త్రీయబద్ధంగా చూపిస్తూ, స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యం లేదు కాబట్టి 42 శాతం రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలుచేయాలని రుజువు చేయవలసిన అవసరం ఉన్నది.
బీసీ రిజర్వేషన్లపై న్యాయ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చొరవ తీసుకొని భారత రాజ్యాంగాన్ని సవరించవలసిన అవసరం ఉన్నది. రాజ్యాంగంలో విద్య, ఉద్యోగ ఇతర అంశాలకు సంబంధించిన అధికరణల్లో బీసీ తరగతులను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలుగా గుర్తించాలి. అదేవిధంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అధికరణలో కుడా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలుగా గుర్తించాలి. లేనట్టయితే దేశంలో బీసీ రిజర్వేషన్ల అమలు సమస్య, సమస్యగానే మిగిలిపోతుంది.