ప్రధానిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టాక ఈ దేశంలోని బీసీ వర్గాలు ఎంతో సంతోషించాయి. అయితే మోదీ పాలనలో ఈ వర్గాల ప్రగతికి గడిచిన ఎనిమిదిన్నరేండ్లలో ఏమీ చర్యలు తీసుకోకపోవడం విస్మయాన్ని కలిగిస్తున్నది. సామాజిక, ఆర్థిక కులగణన-2011లోని తెలంగాణ రాష్ర్టానికి చెందిన బీసీల వివరాలను అందజేయాలని ప్రజలు కోరుతున్నారు. కేంద్రం అధికారికంగా అందజేస్తే అభివృద్ధి, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను కచ్చితంగా నిర్ణయించు కోవడానికి ఎంతగానో ఉపయోగడుతాయి.
కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రస్తుతం ఉన్న సామాజిక, ఆర్థిక కులగణన – 2011 వివరాల్లో తప్పులు దొర్లి ఉంటే, ఆధునిక సాంకేతిక టూల్స్ సహకారంతో లోపాలను సరిదిద్దాలి. ప్రజాస్వామ్య పాలకులు మెజారిటీ ప్రజలైన బీసీలను, వారి అభివృద్ధిని, సంక్షేమాన్ని నిర్మాణాత్మకంగా ఆకాంక్షించాలి. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నది. కేంద్రం అనుసరిస్తున్న విధానాల్లో బీసీ వ్యతిరేక వైఖరి స్పష్టంగా కనిపిస్తున్నది. ఒక్క మహారాష్ట్ర కులగణనలో తప్పులు ఎక్కువగా దొర్లాయని కేంద్రం గతంలో స్పష్టం చేసింది. మిగతా ఏయే రాష్ర్టాల్లో తప్పులున్నాయో స్పష్టం చేయలేదు. కేంద్రం గతంలో కొన్ని వివరాలు కోరుతూ రాష్ర్టాలను అడిగినప్పుడు ఆయా రాష్ర్టాలు కేంద్రానికి నివేదించింది. తెలంగాణ విషయంలో ఎలాంటి తప్పులు దొర్లినట్టు కేంద్రం ధృవీకరించలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ కులగణన వివరాలను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
కేంద్రం తిరిగి కులగణన చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. అలాంటప్పుడు రాష్ర్టాలకు గణనను నిర్వహించుకునే అధికారాన్ని బదలాయించాల్సి ఉంటుంది. కానీ ఆ ఉద్దేశం లేదని మోదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి ప్రస్తుతం కేంద్రం వద్ద ఉన్న తెలంగాణ రాష్ట్ర వివరాలను అధికారికంగా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు పరిమాణాత్మక సమాచారంతో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని స్థిరీకరించుకొని స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లో రాష్ట్ర బీసీ కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్‌కే ‘డెడికేటెడ్ కమిషన్’గా గుర్తింపునిచ్చింది. ఇందుకు అనుగుణంగా ‘టర్మ్స్ ఆఫ్ రెఫెరెన్స్’ను అందజేసింది. కాగా అప్పటినుంచి రాష్ట్ర కమిషన్ పూర్తిస్థాయిలో ప్రణాళికాబద్ధంగా తన కార్యాచరణను కొనసాగిస్తున్నది. కానీ, 2011 కులగణన మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టింది కాదు. మోదీ ప్రధాని అయ్యేనాటికే కులగణన వివరాలు అందుబాటులో ఉన్నాయి. ప్రకటించడమే తరువాయి. అయినా ఏవో కారణాలను అన్వేషిస్తున్నట్టు సాకులు చెప్పి కాలయాపన చేస్తున్నది. బహిర్గతం చేయలేమని తేల్చిచెప్తున్నది.
సామాజిక, ఆర్థిక కులగణన-2011, కొన్ని వాస్తవాలు: దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలిసారిగా 2011లో కులగణనను చేపట్టింది. నాలుగేండ్లకు పైగా ఈ గణన నిమిత్తం దేశవ్యాప్తంగా లెక్కలు తీశారు. 2015లో ఈ గణన వివరాలను పూర్తిస్థాయిలో బహిర్గతం చేయకుండా దేశంలో 52 శాతం బీసీలున్నారిని మాత్రమే వెలువరించింది కేంద్రం. ఇంతమాత్రానికే కేంద్ర ప్రభుత్వం రూ.4,894 కోట్లు ఖర్చుచేసింది.
నాటి 119 కోట్ల జనాభాను కులాలవారీగా పూర్తి సామాజిక, ఆర్థిక తదితర అంశాలను శాస్త్రీయ పద్ధతిలో సేకరించారు. ఇందులో దాదాపు కోటి 35 లక్షల జనాభాకు సంబంధించి పలు తప్పులు దొర్లాయని, ఇందులో ఇంటిపేర్లు, గోత్రాలు, ఉపనామాలు వంటి వాటిలో ఏకాభిప్రాయం రాలేదని, వాటిని సవరించడానికి ‘నీతి ఆయోగ్’ ఉపాధ్యక్షుడు అరవింద్ కుమార్ పనగారియా అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీకి కేంద్రం ‘టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్’ను ఇవ్వలేదు. సభ్యులను నియమించలేదు. ఆ కమిటీ ఇప్పటివరకు తన నివేదికను సమర్పించలేదు. ఈ నిర్లక్ష్య వైఖరితోనే కేంద్రప్రభుత్వం బీసీలను నిరాదరణకు గురిచేస్తున్నదని ప్రజలు భావిస్తున్నారు. అందులో తప్పేం లేదు.
2015-16 గ్రామీణాభివృద్ధి పార్లమెంటరీ స్థాయి సంఘం సామాజిక ఆర్ధిక కులగణన-2011 విషయంలో ఏర్పడిన సందేహాల నివృత్తికి రిజిస్ట్రార్ జనరల్ కమిషనర్, జనాభా గణన నుంచి వివరణ కోరింది. ఇందుకు అనుగుణంగా ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కులగణన 98.87 శాతం సరైనవని స్పష్టంగా సమాధానం ఇచ్చారు. ఇందులో 1,34,77,030 వివరాల్లో తప్పులు దొర్లాయని వీటిని సరిదిద్దుకుంటే సరిపోతుందని సూచించింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే దాదాపు 119 కోట్ల జనాభా కులగణనలో తప్పులు దొర్లింది 1.13 శాతమే. ఈ తప్పులను సరిదిద్దడం అంత పెద్ద పనికాదు.
2018లో కేంద్ర హోంశాఖా మంత్రిగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్.. 2021లో జనాభా గణనలో కులగణన’ చేస్తామని ప్రకటించారు. 2021లో ఇప్పటి హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తమ ప్రభుత్వానికి కులగణన చేసే ఉద్దేశం లేదని ప్రకటించారు. అంతేకాకుండా కులగణన కేంద్రం పరిధిలోనిది కాబట్టి, ఈ గణన రాష్ర్టాలకూ చేసుకునే అధికారాన్ని కల్పిస్తూ, గణనను ఉమ్మడి జాబితాలోకి మార్చే యోచన కేంద్రం వద్ద లేదని ప్రకటించడం గమనార్హం.
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్)
డాక్టర్ వకుళాభరణం
కృష్ణమోహన్‌రావు 98499 12948