దేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ముసుగులో విద్రోహ పాలన కొనసాగుతున్నది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా, నేటికీ బలహీనవర్గాలకు, అత్యంత వెనుకబడిన సంచార జాతుల ప్రజలకు రాజ్యాధికారం దక్కడం లేదు. ఇప్పటికీ ఆధిపత్య వర్గాల చేతుల్లో బీసీలు నయవంచనకు గురవుతూనే ఉన్నారు. తెలంగాణలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు వర్గీకరణతో కూడిన 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి మోసం చేయడమే అందుకు తాజా ఉదాహరణ. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన రెండు బిల్లులను ప్రతిపక్షాల సంపూర్ణ మద్దతుతో చట్టసభల్లో ఆమోదించి, కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించిన రాష్ట్ర పాలకులు ఒక పద్ధతి ప్రకారం రిజర్వేషన్లు అమల్లోకి రాకుండా కుట్ర చేస్తున్నారు. ఇది తమను మభ్యపెట్టే ప్రయత్నమని బీసీ సంఘాలు, బీసీ మేధావులు, బీసీ సమాజం పసిగట్టకపోవడం బాధాకరం.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 (4), 15 (5), 16 (4) ప్రకారం.. బీసీ కులాలను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులుగా గుర్తించారు. అదే విధంగా స్థానిక సంస్థల్లో ఆర్టికల్ 243 ప్రకారం బీసీ కులాలను వెనుకబడిన పౌరులుగా గుర్తించారు. భారత రాజ్యాంగంలో సరైన విధంగా గుర్తించకపోవడం బీసీ కులాలకు శాపంగా మారింది. రాజ్యాంగంలో బీసీలకు సంబంధించిన ఆర్టికల్స్లోని లోపాల ఆధారంగా వెలువడుతున్న సుప్రీంకోర్టు తీర్పులు కూడా బలహీనవర్గాలకు నష్టం చేకూరుస్తున్నాయి. రాజ్యాంగంలో వెనుకబడిన కులాలను వెనుకబడిన తరగతులుగా (Backward Classes), వెనుకబడిన పౌరులుగా (Backward Citizens) గుర్తించినందున రాజ్యాంగ సవరణ చేయకుండా, ఇప్పటికిప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించలేమని కాంగ్రెస్ పాలకులకు తెలుసు. అయినా, కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ కోటాను 42 శాతానికి పెంచి, వర్గీకరణ ద్వారా రిజర్వేషన్లు అమలుచేస్తామని హామీ ఇచ్చింది.
బీసీ వర్గాల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులపై రిజర్వేషన్లు కల్పించే బాధ్యత ఉన్నది. కాబట్టి, గతంలో కోర్టులు వెలువరించిన తీర్పుల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయవచ్చని బీసీ సామాజిక ఉద్యమకారులు, న్యాయ నిపుణులు కాంగ్రెస్ పాలకులకు సూచిస్తున్నారు. ఆ తీర్పులను ఒక్కసారి పరిశీలిద్దాం. 1992లో 9 మంది జడ్జిలతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన మండల్ కమిషన్ తీర్పును వెలువరించింది. ఇందులో ప్రధానంగా మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించరాదని నిబంధనను విధిస్తూనే.. ఒకవేళ బీసీ గణాంకాలు ఆమోదయోగ్యంగా ఉండి, ప్రత్యేక పరిస్థితుల్లో బీసీల ప్రాతినిధ్యం లేనట్టయితే 50 శాతానికి మించి కూడా రిజర్వేషన్లను అమలు చేసుకోవచ్చని అదే తీర్పులో తెలిపింది. ఈ తీర్పు ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయవచ్చు కదా?
2022లో బీఆర్ఎస్ సర్కార్ ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంతో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 54 శాతానికి చేరుకున్నాయి. 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి రిజర్వేషన్లు 64 శాతానికి చేరుకున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే రాష్ట్ర పాలకులు భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను నిర్ధారించి అమలుచేయాలి. అంతేగానీ, ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదనే విషయాన్ని గమనించాలి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు బీసీ బిల్లులను అమలుచేసి బీసీ కులాలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను వర్గీకరణ ద్వారా వెంటనే అమలు చేయాలి.
ఎందుకంటే అధికార పక్షంతో పాటు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు శాసనసభలో ఈ బిల్లులకు మద్దతు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో రిజర్వేషన్లను అమలు చేస్తే అన్ని రాజకీయ పక్షాలు అండగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. ఒకవేళ ఈ విషయంలో ఎవరైనా పార్టీపరంగా గాని, సంస్థలపరంగా గాని, వ్యక్తుల పరంగా గాని హైకోర్టు, లేక సుప్రీంకోర్టులో కేసులు వేసినట్టయితే, రాష్ట్ర బీసీ జాబితాలో అత్యంత వెనుకబడిన సంచార జాతుల కులాలు ఇప్పటి వరకు ఎలాంటి రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు పొందలేదని, వారికి పదవులు దక్కలేదని కోర్టులకు తెలపాలి. అలాగే సామాజికపరమైన రిజర్వేషన్ ఫలితాలు వీరి దాకా చేరనేలేదనే విషయాన్ని తెలియజేయాలి.
బుడబుక్కల, దాసరి, దొమ్మర తదితర కులాలవారు రాష్ట్ర ప్రభుత్వ గెజిట్లో ఉన్నాయని ఇప్పటి వరకు పాలకులకు, 99 శాతం మంది అధికారులకు తెలియదు. ఈ కులాల అభ్యున్నతికి ఇకనైనా పాటుపడకపోతే ఎలా? విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో ఈ కులాల ప్రాతినిధ్యాల లెక్కలను కోర్టుల ముందుపెట్టి రిజర్వేషన్లను సాధించాలి.
మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా వర్గీకరణతో కూడిన రిజర్వేషన్లు కల్పించాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీని బీసీ వర్గాలు మరోసారి నమ్మవు. అదేవిధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చొరవ తీసుకొని బీసీ రిజర్వేషన్లపై న్యాయ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలి. అందుకోసం రాజ్యాంగాన్ని సవరించాలి. తద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బీసీల సమస్యను శాశ్వతంగా తీర్చాలి. రాజ్యాంగంలో విద్య, ఉద్యోగ ఇతర అంశాలకు సంబంధించిన అధికరణల్లో బీసీ తరగతులను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలుగా గుర్తించాలి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అధికరణల్లో కూడా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలుగా గుర్తించాలి. ఐక్యకార్యాచరణతో రాజకీయ చైతన్య యుద్ధానికి బీసీలు సిద్ధం కావాలి. సాధించే వరకు పోరాటం
– వ్యాసకర్త: రాష్ట్ర అధ్యక్షులు, సంచార జాతుల సంఘం)
డాక్టర్ శ్రీనివాస్ తిపిరిశెట్టి 99494 26536