పేద, బడుగు బలహీనవర్గాల కోసం ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి కొత్తదారిని చూపారు. కులవృత్తులను ప్రోత్సహించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నది. ఇందులో భాగంగానే చేతి వృత్తులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తుండటం అభినందనీయం.
క్షౌరవృత్తి నిర్వహించేవారు తరతరాలుగా క్షౌరవృత్తితోపాటు, వైద్యం, వాయిద్యం, సౌందర్య పోషణల ద్వారా సమాజ సేవ చేస్తున్నారు. ఆధునికత చొరబడనంత వరకు వృత్తిదారుల జీవికకు ఢోకా లేకుండా పోయింది. పెట్టుబడిదారీ వ్యవస్థ వైపు శరవేగంగా పరుగులు తీస్తున్న భారత్ లో గడచిన నాలుగు దశాబ్దాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఎన్నో వృత్తులు కాలగర్భంలో కలిసిపోతూ జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నాయి. అలాంటి వృత్తు ల్లో క్షౌరవృత్తి ఒకటి. నాయీబ్రాహ్మణ సమాజాన్ని ఈ కార్పొరేట్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బకొట్టింది. యువత ఈ రంగంవైపు వచ్చేందుకు నిరాసక్తి చూపుతున్నారు. ఉపాధి కరువై అనేకమంది వృత్తిదారులు జీవితాలను భారంగా గడుపుతున్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏ రాజకీయ పార్టీ చేపట్టని విధంగా, కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సబ్బండ వర్ణాలకు దన్నుగా నిలుస్తున్నది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, గురుకుల విద్యాలయాలు, గొర్లు, చేపల పంపిణీ, రైతు బంధు, రైతుబీమా.. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు అందుకు ఉదాహరణలు. ఆయా పథకాల ద్వారా ఎక్కువగా లబ్ధి పొందుతున్నది బడుగు బలహీన వర్గాలే.
సీఎం కేసీఆర్ పాలనలో నాయీబ్రాహ్మణులు గతంలో ఎన్నడూ లేనివిధంగా అనేక అభివృద్ధి ఫలాలను అందుకుంటున్నారు. సంప్రదాయ పద్ధతిలోనే కులవృత్తిని కొనసాగిస్తున్న నాయీ బ్రాహ్మణులను ఆధునికత వైపు తీసుకువెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నాయీ ఫెడరేషన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. నాయీ బ్రాహ్మణ యువతకు బ్యూటిషియన్ తదితర కోర్సుల్లో వృత్తి నైపుణ్య శిక్షణను అం దిస్తున్నది. సెలూన్ షాపులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నది.
తద్వారా రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల నాయీబ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరుతున్నది. నాయీబ్రాహ్మణ ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో 2 ఎకరాల స్థలాన్ని కేటాయించి, రూ.2 కోట్ల నిధులనూ మంజూరు చేసి రాష్ట్ర ప్రభుత్వం తన ఉదారతను చాటుకున్నది. అంతేకాకుండా ఇటీవల శ్రీకారం చుట్టిన రూ.లక్ష ఆర్థికసాయం నాయీబ్రాహ్మణులకు కొండంత అండగా నిలువనున్నది. ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన సీఎం కేసీఆర్‌కు నాయీబ్రాహ్మణ సమాజం తరపున నా ప్రత్యేక కృతజ్ఞతలు.
(వ్యాసకర్త: నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు)
రాచమల్ల బాలకృష్ణ
90006 72657