స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా లంబాడీ (బంజారా) సమాజం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా నిర్లక్ష్యానికి గురవుతున్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో లంబాడీ సమాజానికి జరిగిన అభివృద్ధిని పరిశీలిస్తే, అది కేవలం కొన్ని సంక్షేమ పథకాల అమలు మాత్రమే కాదు, ఒక సమాజానికి ఆత్మగౌరవాన్ని తిరిగి ఇచ్చిన సామాజిక పునరుజ్జీవన ఉద్యమంగా కనిపిస్తుంది.
తండా అనేది కేవలం కొన్ని ఇండ్ల సముదాయం కాదు. అది లంబాడీ సమాజ సంస్కృతి, సంప్రదాయం, జీవన విధానం, చరిత్రకు ప్రతీక. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న అత్యంత చారిత్రాత్మక నిర్ణయం 3,146 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం. ఇది కేవలం ఒక ప్రభుత్వ ఉత్తర్వు కాదు; తరతరాలుగా లంబాడీ సమాజం కలలుగన్న ఆత్మగౌరవ స్వప్నానికి రూపం ఇచ్చిన నిర్ణయం. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేని పనిని కేసీఆర్ చేసి చూపించారు. ఈ నిర్ణయం వల్ల తండాలకు నేరుగా నిధులు చేరాయి, స్థానిక నాయకత్వం పెరిగింది, రోడ్లు, విద్యుత్తు, తాగునీరు, కమ్యూనిటీ భవనాలు, డ్రైనేజీలు వంటి మౌలిక వసతులు అభివృద్ధి చెందాయి.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలోగానీ, ఇపుడు అదే పార్టీ హయాంలో గానీ లంబాడీలకు సరైన గుర్తింపు లభించలేదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించడం ద్వారా లంబాడీ సమాజానికి అపూర్వమైన గౌరవాన్ని తీసుకువచ్చింది. ఒక గిరిజన మహనీయుడి జయంతిని ప్రభుత్వ స్థాయిలో నిర్వహించడం అంటే అది కేవలం ఒక కార్యక్రమం కాదు; ఒక సమాజ అస్తిత్వాన్ని అధికారికంగా గౌరవించడం. బంజారా భవనాలు, ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించడం ద్వారా లంబాడీ సమాజానికి శాశ్వత గుర్తింపు కల్పించింది. హైదరాబాద్ నుంచి జిల్లా స్థాయిల వరకు బంజారా భవనాల నిర్మాణం ఆ సమాజ గౌరవాన్ని మరింత పెంచింది. గిరిజనుల విద్య, ఉద్యోగ అవకాశాల విస్తరణ కోసం కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా చారిత్రాత్మకమైనవే. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం దశాబ్దాల డిమాండ్‌కు స్పందించిన చర్యగా నిలిచింది.
లంబాడీ యువతకు పారిశ్రామిక అవకాశాలు; కేసీఆర్ హయాంలో సీఎం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ (సీఎంఈఐ) పథకం ద్వారా లంబాడీ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంపికైన యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, బెంగళూరులోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో శిక్షణ పొందే అవకాశం కల్పించారు. యువతలో వ్యాపార నైపుణ్యాలను పెంపొందించి, స్వ యం ఉపాధి అవకాశాలను విస్తరించే దిశగా చర్యలు తీసుకున్నారు.
గిరిజన విద్యార్థుల కోసం 90కి పైగా గురుకుల విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. 22 గిరిజన డిగ్రీ కళాశాలలను స్థాపించారు. దేశంలోనే తొలిసారిగా సంగారెడ్డిలో గిరిజన లా కళాశాలను ఏర్పాటు చేశారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే గిరిజన విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ను అందుబాటులోకి తెచ్చారు. ఇది కేవలం విద్యా సంస్కరణ కాదు; తరాల భవిష్యత్తును మార్చే సామాజిక మార్పు. రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో కూడా కేసీఆర్ సర్కార్ లంబాడీ సమాజానికి తగిన గౌరవం ఇచ్చింది. మంత్రివర్గంలో, కార్పొరేషన్లలో, వివిధ ప్రభుత్వ పదవుల్లో లంబాడీ నాయకులకు అవకాశాలు కల్పించి పాలనలో భాగస్వాములను చేసింది. గిరిజనులు కేవలం ఓటర్లు కాదని, పాలనలో భాగస్వాములు కావాలని విశ్వసించిన దృక్పథం అందులో కనిపించింది.
కాంగ్రెస్ పాలనలో ఇపుడు పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తున్నది. ఎన్నికల ముందు చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరుతో గిరిజనులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నది. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, అంబేద్కర్ అభయహస్తం కింద రూ.12 లక్షల ఆర్థిక సహాయం, విద్యాజ్యోతి పథకం, ప్రతి తండాకూ రూ.25 లక్షల నిధులు, కొత్త ఐటీడీఏలు, ప్రత్యేక కార్పొరేషన్లు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వంటి అనేక హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. లంబాడీలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా చూడగా, బీఆర్ఎస్ తెలంగాణ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేసింది. కాంగ్రెస్ హామీలు ఇచ్చింది. కేసీఆర్ హక్కులు కల్పించారు. లంబాడీ సమాజ చరిత్రలో కేసీఆర్ పేరు కేవలం ఒక రాజకీయ నాయకుడిగా కాదు, ఒక సమాజానికి ఆత్మగౌరవాన్ని తిరిగి ఇచ్చిన నాయకుడిగా, ఒక యుగ మార్పునకు ప్రతీకగా చిరస్థాయిగా నిలిచిపోతుంది.
(వ్యాసకర్త: ఓయూ పరిశోధక విద్యార్థి)
-రాజేశ్ నాయక్
9603579115