బహుముఖ ప్రజ్ఞాశాలి బాబాసాహెబ్ అంబేద్కర్. చరిత్ర, అర్థశాస్త్రం, ఆంథ్రపాలజీ, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, తత్వశాస్త్రం, న్యాయశాస్త్రం ఆయన అధ్యయన అంశాలు. వీటికి తోడు ఆయన ప్రపంచ మతాలను కూడా లోతుగా చదివారు. చదువులో భాగంగానూ, దేశ అవసరాలు, మానవ అవసరాలను గ్రహించి అనేక గ్రంథాలు రచించారు. అధ్యయనం, అధ్యాపనం, వ్యాసంగం, ప్రసంగాలను జీవితంలో విడదీయరాని బంధాలుగా మార్చుకున్న విద్వత్ సంపన్నుడు బాబాసాహెబ్.
ఆయనది చెక్కు చెదరని మనవతావా దం. ఆయన వెతికింది బౌద్ధ జీవనం. కోరింది సంఘ జీవనం. బతికింది సద్దమ్మ జీవనం. చేసింది నిష్కళంక దేశ సేవ. చెప్పింది భారత జాతీయవాదం. అందుకే ఆయన అందరికీ ఆదర్శం. దీనికి గుర్తింపే హైదరాబాద్‌లో కేసీఆర్ ఆవిష్కరిస్తున్న 125 అడుగుల ఎత్తయిన మహా విగ్రహం. అలాగే అంబేద్కర్ పేరుతో నూతన తెలంగాణ సచివాలయ నామకరణం.
అంబేద్కర్ పేరు చివర ఆయన చదివిన డిగ్రీ లు ఉంటాయి. ఆయన ప్రజ్ఞను గుర్తించి కొలంబియా, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు ఇచ్చిన వాటితో కలిపి నాలుగు పీహెచ్‌డీలు ఆయన సొంతం. కానీ అంబేద్కర్ విజ్ఞానం ఈ డిగ్రీల కంటే అతీతమైనది. అందుకే ఆయన ఆలోచనా విధానం తరతరాలకూ శిరోధార్యమైంది. ఆయన ఆధునిక ప్రపంచ శాంతిదూత. అత్యాధునిక భారత ప్రజాస్వామ్య నిర్మాత. భారత సమాఖ్య రాజ్యంలో అనేక చిన్న రాష్ర్టాలతో పాటు నవ, నూతన తెలంగాణ ప్రదాతగాఆయన మన్ననలు అందుకుంటున్నారు.
కులం పుట్టు పూర్వోత్తరాలను, అంటరానితనం ఆనవాళ్లను, హిందూ మహిళల అణచివేతకు కారణాలనూ విశ్లేషించి నివారించటంలో నూ, ప్రాచీన కాలంలో ప్రపంచ గురువుగా వర్ధిల్లిన భారతదేశం మధ్యయుగాల్లో ముస్లింల దం డయాత్రలకు లొంగిపోవడానికీ, ఆధునిక కాలం లో బ్రిటిషు వలస రాజ్యంగా మారడానికి గల కారణాలను అంబేద్కర్ వెతికినంత లోతుగా, చెప్పినంత స్పష్టంగా మరే ప్రపంచ మేధావీ వెతకలేదు, చెప్పలేదు. అంబేద్కర్‌లోని గొప్పతనం సమస్యలను మూలాల నుంచే వెతకడంలోనే కాక, వాటికి శాశ్వత పరిష్కారాలను సూచించడంలో కనిపిస్తుంది. ఈ పరిష్కార మార్గాలను వెతకడానికే ఆయన పరిశోధనలన్నీ జరిగాయి.
అంబేద్కర్ ప్రత్యేకించి రెండు అంశాల్లో ప్రపంచాన్ని తలదన్నే మేధావి. ఒకటి న్యాయశాస్త్రం, రెండు అర్థశాస్త్రం. అంబేద్కర్ బహుముఖ ప్రజ్ఞ వల్ల ఆయన న్యాయశాస్త్ర పరిజ్ఞానం భారతదేశ రాజ్యాంగ నిర్మాణానికి ఒక సంపూర్ణతను, పరిపూర్ణతను సమకూర్చింది. 1927లో బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి మొదలైన అంబేద్కర్ శాసన నిర్మాణ దేశ సేవలు 1955 వరకూ కొనసాగాయి. ఆయన న్యాయశాస్త్ర విజ్ఞానం రౌండ్ టేబుల్ సమావేశాలు, 1935 భారత ప్రభుత్వ చట్టం, 1934 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1948 కంపెనీ యాక్ట్‌తో పాటు అనేక కార్మిక సంక్షేమ, భద్రతా చట్టాలు, సామాజిక భద్రతా చట్టాలలో వ్యక్తమవుతుంది. ఆయన ప్రతిపాదించిన హిందూ కోడ్ బిల్లు భారత వివాహ చట్టం, విడాకుల చట్టం, వారసత్వ చట్టం, గార్డియన్షిప్ చట్టాల నిర్మాణానికి దోహదపడింది. ప్రధానంగా రాజ్యాంగ నిర్మాణ సభలో రాజ్యాంగంలోని అనేక భావనాత్మక అంశాలపైన అంబేద్కర్ చేసిన భాష్యం నేటికీ భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఒక న్యాయ నిర్ణయ మార్గదర్శకంగా ఉండటం ఆయన మానసిక పరిణతికి ఒక నిదర్శనం.
ఆర్థికశాస్త్రంలో అంబేద్కర్ చేసిన అధ్యయనాలు అనేకం. వాటిలో కొన్నింటిని ఆయన గ్రంథస్తం చేశారు. ‘ప్రాచీన భారత వాణిజ్యం’ వాటిలో ఒకటి. సింధూ లోయ నాగరికత నుంచి క్రీ.శ.1600 వరకూ ప్రపంచంతో భారతదేశ వాణిజ్య సంబంధాల గురించి అది వివరిస్తుంది. ‘ద అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ అఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ’ రెండవది. 1772 నుంచి 1857 వరకు కంపెనీ పాలనా, ఆర్థిక విధానాల గురించి అది వివరిస్తుంది. ‘నేషనల్ డివిడెండ్ ఆఫ్ ఇండియా: ఎ హిస్టారికల్ అండ్ ఎనలిటికల్ స్టడీ’ అన్నది మూడవ గ్రంథం. ఇది పబ్లిక్ ఫైనాన్స్ (ప్రజాధనం) అనే అంశానికి సంబంధించినది. ఇది 1858 నుంచి 1919 వరకూ బ్రిటిష్ ప్రభుత్వ ఆర్థిక విధానాల గురించి, ఆ విధానాలు భారతదేశాన్ని ఆర్థిక దోపిడీకి ఎలా గురి చేశాయో గణాంకాలతో సహా వివరిస్తుంది.
ఇది బ్రిటిష్ వారి పన్నుల విధానం, ప్రజా పనుల విధానం ఏ విధంగా దేశ ఆర్థిక వినాశనానికి దారి తీశాయో వివరిస్తుంది. ‘ది ప్రాబ్లమ్ ఆఫ్ రుపీ; ఇట్స్ ఆరిజిన్ అండ్ సొల్యూషన్’ అనే గ్రంథం మోనిటరీ ఎకనామిక్స్‌కు సంబంధించింది. ఇందులో రూపాయి విలువను, రూపాయి మారక విలువను నిర్ణయించటంలో బ్రిటిష్ వారు అనుసరించిన విధానాలు దేశ ఆర్థిక దోపిడీకి ఎలా కారణమయ్యాయో వివరిస్తుంది. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను ఎలా స్థిరీకరించాలి, దేశ ఆర్థిక అభివృద్ధికి పనికొచ్చేలా దానిని ఎలా మలచాలి అనే అంశాలను తెలుపుతుంది. అంబేద్కర్ రాసిన మరో గ్రంథం ‘స్మాల్ హోల్డింగ్స్ ఇన్ ఇండియా: దెయిర్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్’. ఇది అంబేద్కర్ భూమి సిద్ధాంతానికి సంబంధించినది. వ్యవసాయాధార దేశంలో కార్మికశక్తిని ఆర్థిక దోపిడీ నుంచి ఎలా విముక్తులను చేయవచ్చనే అంశానికి ఇది సమాధానం.
ఇలా ఆర్థికశాస్త్రంలో అనేక అధ్యయనాల పర్యవసానంగా అంబేద్కర్ భారత రాజ్యాంగంలో స్టేట్ సోషలిజం అనే సిద్ధాంతాన్ని ఆదేశిక సూత్రాల రూపంలో పొందుపరచారు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించ వీలులేనివని అంబేద్కర్ వివరించారు. రాజ్యాంగం రాజకీయ ప్రజాస్వామ్యం, ఆర్థిక ప్రజాస్వామ్యం లక్ష్యాలుగా రాయబడిందని, అమలు చేయదగ్గదని, అయితే ఈ లక్ష్యాల సాధనలో పాలకుల పాత్ర కీలకమని ఆయన తేల్చి చెప్పారు.
ఈ ఆదేశాలలో భాగమే వృద్ధాప్య పింఛన్లు, నిరుద్యోగ భృతులు, బలహీన వర్గాల విద్య వికాసాలు, రైతులకు తగిన సహకారాలు, వ్యవసాయాభివృద్ధికి నీటి వనరులు, పారిశ్రామికాభివృద్ధికి తగిన మౌలిక సదుపాయాలు, వ్యవసాయ ఉత్పాదకతకు భూమి వినియోగం వంటి అంశాలు. ఇవన్నీ రాజ్యాంగ నిర్దేశాలు. ఇవన్నీ ఆర్థిక అసమానతలు, పేదరిక నిర్మూలనకూ మార్గాలు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత మిగిలిన ఎన్నో రాష్ర్టాల కంటే భిన్నంగా ఆదేశిక సూత్రాల అమలుకు, బలహీన వర్గాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పలు విధానపరమైన నిర్ణయాలు చేసింది. దళితులకు మూడెకరాల భూమి, దళితబంధు, గురుకుల పాఠశాలలు, దళిత అనుకూల పారిశ్రామిక విధానం, స్థానిక సంస్థల్లో మహిళలు, బలహీన వర్గాల ప్రాతినిధ్యం మొదలైనవి. దేశవ్యాప్తంగా వీటిని అమలు చేయటంలో ఇంకా ఎంతో దూరం ప్రయాణం మిగిలి ఉందని గుర్తించాలి. అంబేద్కర్ సేవలకు గుర్తింపుగా ఈ రోజు జరుగుతున్న మహా విగ్రహావిష్కరణ ఎంత అవసరమో, ఆయన ఆలోచనా విధానాన్ని అమలు చేయటంలో ప్రభుత్వాల చిత్తశుద్ధి కూడా అంతే అవసరం. ఏదేమైనా ఈ సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభినందించి తీరాలి.
(వ్యాసకర్త: అంబేద్కర్ అధ్యయనశీలి)
పీఎస్ఎన్ మూర్తి, IDAS , 89789 67806