e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home ఎడిట్‌ పేజీ అల్లోపతి వర్సెస్‌ ఆయుర్వేదం!

అల్లోపతి వర్సెస్‌ ఆయుర్వేదం!

అల్లోపతి వర్సెస్‌ ఆయుర్వేదం!

‘ఆక్సిజన్‌ అంటే సిలిండర్‌ నుంచి వచ్చే గాలి మాత్రమే. అదే శాస్త్రీయమైనది. చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్‌కు శాస్త్రీయత లేదు. దీన్ని నాటు గాలి అంటారు. తొందరపడి పీల్చకండి.’

ఆంధ్రప్రదేశ్‌లోని కష్ణపట్నంలో కొవిడ్‌కు మూలికలతో వైద్యం చేస్తూ ప్రపంచం దృష్టిని ఆకట్టుకున్న ఆనందయ్య గారి విధానాన్ని అశాస్త్రీయమని ఎగతాళి చేసేవారిని ఉద్దేశించి ఆయన అనుకూలురు వదిలిన వ్యంగ్యాస్త్రం ఇది.
‘గాలి ఆడక ఆగమాగం అవుతున్న రోగిని ముక్కుకు చింతచెట్టు కట్టుకోమనే బ్యాచ్‌ ఇది. లేదా హాస్పిటల్‌ బెడ్‌కు ఆక్సిజన్‌ కోసం ఆవును కట్టేయమనే టైపులు వీళ్ళు. స్మార్ట్‌ బుర్ర లేని వాళ్లకు స్మార్ట్‌ ఫోన్‌ ఇవ్వడం తప్పనేది అందుకే..’
-ఆనందయ్య ఇచ్చేది మందు కాదు, చట్నీ అని గట్టిగా వాదిస్తున్న ప్రముఖ హేతువాది గోగినేని బాబు చేసిన ప్రతిదాడి ఇది.
‘అగ్రికల్చర్‌ బీఎస్సీ సర్టిఫికెట్‌ లేని రైతులు పండించిన పంట తింటున్నాను. పర్లేదంటారా?’
-ఆనందయ్య అనుకూలురు వండివార్చిన సృజనాత్మక ప్రశ్న ఇదీ.
ఇలాంటివారికి జనవిజ్ఞాన వేదిక వంటి సంస్థలు, ఆధునిక వైద్యులు, విద్యావంతులు వివిధ వేదికల మీద గట్టిగానే కర్రుకాల్చి వాతలు పెడుతున్నారు.

పరిసరాల్లో దొరికే కొన్ని మూలికలతో ఆనందయ్య తయారుచేసి ఉచితంగా పంచుతున్న లేహ్యం లాం టి పదార్థం సృష్టిస్తున్న దుమారం అంతా ఇంతా కాదు. ఆయుర్వేద వైద్యుడిగా స్థానికుల మన్ననలు చూరగొన్న ఆనందయ్య కొవిడ్‌ రెండో తరంగం వల్ల రోగుల్లో అమాంతంగా పడిపోతున్న ఆక్సిజన్‌ స్థాయిని రెండు కంటి చుక్కలతో పెంచడం, అదంతా సామాజిక మాధ్యమాల్లో తెగ ప్ర చారం కావడంతో సర్వత్రా దీనిపైనే చర్చ జరుగుతున్నది.

2019 డిసెంబర్‌ నుంచి ప్రపంచ దేశాలను దారుణంగా వణికిస్తూ, లక్షలమందిని పొట్టన పెట్టుకుని, కోట్లమందిని కుంగదీసిన కొవిడ్‌కు నికార్సయిన మందులు కనుక్కోవడానికి తలపండిన శాస్త్రవేత్తలు తన్నుకులాడుతుంటే, పరిశోధక సంస్థలు వేల కోట్ల రూపాయలు కుమ్మరించి టీకాలు మీద టీకాలు కనుక్కునే పనిలో తలమునకలై ఉంటే.. ఆంధ్రా సముద్ర తీరాన, పెద్దగా చదువు గానీ, శాస్త్ర జ్ఞానం గానీ లేని ఒక సామాన్యుడు ‘ఇదిగో మందు’ అని వేలమందికి ఉచితంగా ఊరటనివ్వడం నిజంగా వింతే. ఆక్సిజన్‌ సిలిండర్ల సాయంతో కృష్ణపట్నం దాకా వెళితే చాలు.. ఆనందయ్య చుక్కలతో కోలుకోవచ్చు.. అన్న ప్రబల నమ్మకం జనాల్లో దృఢపడటానికి కారణాలు స్పష్టంగా ఉన్నా.. ఆనందయ్య గారి మందు ఇంగ్లిష్‌ వైద్యంగా పిలిచే అల్లోపతికి, మొక్కల ఆధారంగా అమల్లో ఉన్న ఆయుర్వేదానికి పెద్ద పోటీ పెట్టింది. అనుకూలురు, ప్రతికూలురు.. దేనికదే నిజమైన అద్భుత సత్యం అనిపించేలా వాద ప్రతివాదాలు చేయడంతో అసలే కొవిడ్‌ మూలంగా నిలువెల్లా భయం ఆవహించి బిక్కుబిక్కున బతుకుతున్న ప్రజలను ఇరకాటంలో పడేసింది.

ఆనందయ్య గారిని ఆయన పని అయన చేసుకోనిస్తే ఈ గొడవ వచ్చేది కాదు. నిజానికి ప్రతిచోటా ఇలాంటి వైద్యులు ఉన్నారు. నమ్మకం కుదిరిన వాళ్ళు వారిని సంప్రదించి మందులు తెచ్చుకోవడం, అల్లోపతిలో చికిత్స పొందుతున్నా.. ఇదీ చూద్దాం అని అనుకోవడం సాధారణమే. ఉబ్బసంతో ఇబ్బంది పడుతూ అల్లోపతితో ఊరటదొరకని వాళ్ళు బత్తిన సోదరుల వార్షిక చేప మందు (ప్రసాదం అనాలి) కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూడటం, కామెర్లు అనగానే తమకు తెలిసిన పసరు వైద్యుడి గురించి చెప్పడం, పక్షవాతం కోసం కర్ణాటక పోవాలని సూచించడం సర్వసాధారణం. అలాంటి వైద్యులు ‘వేస్ట్‌ ఫెలోస్‌’ అని గానీ, వారిని సంప్రదించే వారు ‘ఫూల్స్‌’ అనడం గానీ సరికాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే.. ఇలాంటి వైద్యుల దగ్గరకు వెళ్లి నయమైనదని చెప్పే వాళ్ళూ కనిపిస్తారు. ఇలాంటి విషయాల్లో రోగి నమ్మకం అనే అంశం మందుకన్నా బలంగా పనిచేస్తుంది. ఈ నమ్మకం ఎంత ముఖ్యమైందంటే.. ఒళ్ళంతా ఒక్కసారిగా భారంగా అనిపించి ఆవలింతలు వస్తున్నప్పుడు.. ఇళ్లలో దిష్టి తీయించుకోవడం చూసే ఉంటాం. అమ్మ ఉప్పుతిప్పి పడేశాక.. చెంబుడు నీళ్లు తాగి కూర్చుంటే శరీరం కుదురుకున్నట్లు అనిపించిన వాళ్ళు బోలెడుమంది ఉంటారు.
ఇది అశాస్త్రీయం.. ఆ వ్యక్తి నిస్సత్తువ ఏ గుండె జబ్బుకో కారణమై ఉండవచ్చు.. దిష్టి గిష్టి-ఉప్పు నిప్పు అని ఇంట్లో కూర్చుంటే చచ్చి ఊరుకుంటాడు.. అని వాదించేవారు కూడా ఉంటారు. అది కూడా తోసిపుచ్చలేని వాదనే. దిష్టి తీశాక కూడా పరిస్థితి అట్లానే ఉంటే కచ్చితంగా వైద్యుడిని సంప్రదిస్తారు. ఆవలింతలు రాగానే ఆధునిక వైద్యుడి దగ్గరకు వెళితే.. రకరకాల టెస్టులు రాస్తాడన్న అనుమానం, గుండెకి చిల్లు పడింది.. రాత్రికి ఆపరేషన్‌ చేయాలి.. అడ్మిట్‌ కావాలని అంటారేమోనన్న ఆందోళన, దానికయ్యే ఖర్చు మనం భరించగలమా, భరించి బట్టకట్టగలమా? అన్న భయం. ఇవన్నీ అనవసరమైన అనుమానాలు, అర్థంలేని ఆందోళనలు, పనికిమాలిన భయం అనేట్లు ప్రస్తుత కాలమాన పరిస్థితులు లేవు.

కొవిడ్‌ విషయమే తీసుకోండి. ఈ వైరస్‌ ఒక ఏడాదిన్నరకు పైగా అల్లకల్లోలం సృష్టిస్తున్నది. భూమండలంలో దాదాపు 17 కోట్ల మందికి ఇది సోకగా, 36 లక్షల మంది ప్రాణాలు ఇప్పటికే గాల్లో కలిసిపోయాయి. అగ్రరాజ్యం అమెరికాలోనే దాదాపు ఆరు లక్షల మంది, భారత్‌లో 3.23 లక్షల మంది చనిపోయారని ఈ రోజు వరకూ అధికారికంగా తేల్చారు గానీ ఆ సంఖ్య ఇంకా పెద్దదేనని అంటున్నారు. అయినా.. ఈ రోజు వరకూ నికార్సైన, నమ్మదగిన కొవిడ్‌ మందు రాలేదని నిపుణులే చెబుతున్నారు. ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌ (ఒక మందు పనిచేయకపోతే వేరొక మందు) ప్రాతిపదికన వైద్యం జరుగుతున్నది. దీనికి అల్లోపతి వైద్య విధానాన్ని తప్పుపట్టడం మూర్ఖత్వం. ప్రసారంలో, ఉత్పరివర్తనాల్లో తీవ్రమైన అనిశ్చితి సృష్టించి ఒక పట్టాన అంతుపట్టని వైరస్‌ ఇది. అయినా.. శాస్త్రవేత్తలు యుద్ధ ప్రాతిపదికన టీకాలు కనుగొన్నారు. ఇది మానవాళి ఘన విజయం. టీకాలు మన దగ్గర ఉత్పత్తి కావడం ఆనందించదగిన విషయమే అయినా.. మన వాళ్లందరికీ అందుబాటులోకి రాకపోవడం పట్ల ఆందోళన కనిపిస్తున్నది వేరే విషయం.

కుక్క పని కుక్క, గాడిద పని గాడిద చేయాలి. శాస్త్రవేత్తలను తోసిరాజని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి, అప్పటి అమెరికా అధ్యక్షుడు వైరస్‌ గురించి, ప్రొటోకాల్స్‌ గురించి బహిరంగ ప్రకటనలు చేసి జనాల దృష్టిలో అనుమానాలు పెంచారు. పాలకులు, రాజకీయ నాయకులు కూడా గందరగోళం సృష్టించడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ రోజు దివ్య ఔషధం రేపటికి నిషిద్ధమై పోతున్నది. దీనికి తోడు ఇదిగో పులి అంటే.. అదిగో తోక అంటూ ఆన్‌లైన్‌ ఆకతాయిలు, సోషల్‌ మీడియా అజ్ఞానులు ‘ఇన్ఫోడమిక్‌’ అనే కొత్త జబ్బును పనికిరాని సమాచారం రూపంలో స్మార్ట్‌ ఫోన్ల ద్వారా పుట్టించి, పెంచి, పోషించి నానా గబ్బు లేపారు. ఇది కూడా అనుమానాలు, ఆందోళనలు, భయాలకు కారణమై అల్లోపతి మీద అపనమ్మకం పెంచింది. ఈ లోపు.. ఆసుపత్రి పాలైనవారికి, స్టెరాయిడ్స్‌ ఎక్కువ వాడినవారికి బ్లాక్‌ ఫంగస్‌ అనే వ్యాధి సోకుతున్నదన్న వార్త దావానలంలా వ్యాపించింది. ‘సైడ్‌ ఎఫెక్ట్‌’ అనే భయం కొవిడ్‌ భయాన్ని మించిపోయిందీ మధ్యన.

ఇదే సమయంలో, సరిపడ వసతులు లేని ప్రభుత్వ ఆసుపత్రులు, ఇదే అదనుగా దోపిడీ పర్వానికి తెరలేపిన ప్రైవేట్‌-కార్పొరేట్‌ ఆసుపత్రులు కూడా పరిస్థితిని కలుషితం చేశాయి. ఒక పక్క మందుల్లేని రోగానికి ఏవేవో పేర్లు చెప్పి లక్షల రూపాయల బిల్లులు వేస్తుంటే ప్రజలు ముందుగా మదుపు చేసుకున్న డబ్బును తీశారు. అదీ చాలకపోతే ఆస్తులు అమ్ముకున్నారు, బికార్లయ్యారు తమ వారిని కాపాడుకునే పిచ్చి ప్రయత్నంలో. పేద, మధ్యతరగతి ప్రజలు పది జన్మలెత్తినా ఆ బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు కొరడా ఝళిపించడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కారణం: ప్రభుత్వ వ్యవస్థపై, అద్భుతమైన అల్లోపతిపై ప్రజల విశ్వాసం ఇంకా సన్నగిల్లకుండా ఉండడానికి ఇలాంటి చర్యలు ఉపకరిస్తాయి.

ఈ విషమ, విషాద పరిస్థితుల నడుమనే.. పేద, మధ్య తరగతి ప్రజలకే కాకుండా ధనికులకూ కృష్ణపట్నం ఆనందయ్య గారు కారుచీకటిలో కాంతి రేఖగా కనిపిస్తున్నారు. వరదలో కొట్టుకుపోతున్నవారికి పూచికపుల్ల దొరికినట్లయింది. ప్రజలకు అల్లోపతి మీద నమ్మకం పోయి ఆయుర్వేదం వెంట వేలంవెర్రిగా పరిగెడుతున్నారని ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు. విధిలేని అసహాయ పరిస్థితుల్లో, ఆధునిక వ్యవస్థ నుంచి ముప్పేట దాడి (మందుల లేమి, కార్పొరేట్‌ దోపిడీ, కొత్త వ్యాధులు) ఎదురుకావడంతో ఆనందయ్యా.. రక్షమాం.. అంటున్నారని గ్రహించాలి. ఇప్పటికీ ఆధునిక వైద్యులను సంప్రదిస్తూనే, ఎందుకైనా మంచిదని ప్రాణం మీద తీపితో కృష్ణపట్నం వైపు ప్రజలు పరుగులు పెడుతున్నారు. దీన్ని మూర్ఖత్వంగా భావించనవసరం లేదు. ప్రపంచ మానవాళి పెను విషాద వలయంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న ఒక విచిత్ర అనిశ్చిత సందర్భంలో సగటు మనిషి నిస్సహాయ ప్రతిస్పందనగా దీన్ని చూడాలి. ఈ విధివంచిత బాధాసర్పద్రష్టులు రాందేవ్‌బాబా లాగా అల్లోపతిపై తీవ్రమైన పదజాలం వాడి, అదొక పనికిరాని చెత్త అంటారని నేను అనుకోను. తెచ్చుకుంటే పోలా.. అనుకునే వారే పెద్దసంఖ్యలో ఉన్నారు.
ఒకపక్కన ప్రజలు పిట్టల్లా రాలిపోతూ విలవిల్లాడుతుంటే… ఆధిపత్య ధోరణి, వితండ వాదనలు, పోటీతత్త్వం మంచిది కాదు. పెను సంక్షోభంలో ఉన్న ప్రజలకు తేలికైన, శ్రమలేని, ఖర్చు తక్కువ వైద్యం అందించే దిశగా అడుగువేయడం మనిషన్న ప్రతివాడూ చేయాల్సిన పని.

ఆనందయ్య గారి మందు ఇంగ్లిష్‌ వైద్యంగా పిలిచే అల్లోపతికి, మొక్కల ఆధారంగా అమల్లో ఉన్న ఆయుర్వేదానికి పెద్ద పోటీ పెట్టింది. అనుకూలురు, ప్రతికూలురు.. దేనికదే నిజమైన అద్భుత సత్యం అనిపించేలా వాద ప్రతివాదాలు చేయడంతో అసలే కొవిడ్‌ మూలంగా నిలువెల్లా భయం ఆవహించి బిక్కుబిక్కున బతుకుతున్న ప్రజలను ఇరకాటంలో పడేసింది.

ఈ నేపథ్యంలో ఆనందయ్య గారిపై కోటి ఆశలతో ఉన్న ప్రజలకు ఊరట కలిగించేలా ఈ కింది చర్యలకు ఉపక్రమించడం తక్షణావసరం.
1) శాస్త్రీయత, ప్రామాణికత, సత్య సంధత ఆధారంగా ఈ పూర్తి అంశాన్ని డీల్‌ చేయాలన్న చిత్తశుద్ధి ముందుగా ఉండాలి. ఇతరేతర కారణాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరిస్తే పెద్ద సంఖ్యలో ప్రాణాలు పోయే లేదా ఆరోగ్యాలు దెబ్బతినే పెనుప్రమాదం ఉంది.
2) కృష్ణపట్నంలో ఆనందయ్య గారు మందుగా ఇచ్చిన దానివల్ల కొవిడ్‌ కేసులు, మరణాలు లేవన్న వాదనలో నిజానిజాలు వెంటనే ప్రకటించాలి. జనం అటువైపు పరుగులు పెట్టడానికి ఇదే కారణం కాబట్టి.. స్థానిక అధికారుల నుంచి సమాచారం సేకరించి ఒక ప్రకటన విడుదల చేయాలి.
3) ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ జోక్యాన్ని వెంటనే తగ్గించాలి. కొవిడ్‌ అనగానే ఉరికురికి ముందు లైన్లో నిల్చుంటున్న రాజకీయులను కట్టడి చేయాలి.
4) అల్లోపతి-ఆయుర్వేదం మధ్య సమన్వయం సాధించేలా చర్యలు తీసుకోవాలి. పరీక్షలు, మందులు, శస్త్ర, చికిత్స, అవయవ మార్పిడి, టీకాలు వంటి వాటి ద్వారా మనిషికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించడంలో అల్లోపతి అద్భుత పాత్ర ఎంత ఉందో, అంతే మిక్కిలిగా ప్రాచీన వైద్య శాస్త్రమైన ఆయుర్వేదం పాత్ర కూడా ఉందని ఉభయ పక్షాలూ గుర్తెరిగేలా చేయాలి.
5) ఆనందయ్య ప్రసాదం విషయంలో జన విజ్ఞాన వేదిక వంటి సంస్థలకు ఉన్న అనుమానాలు వెంటనే నివృత్తి చేయాలి. స్వయంగా వీరు ఆ ప్రాంతంలో పర్యటించి నిజనిర్ధారణ చేసే వెసులుబాటు కల్పించాలి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా మేలు జరుగుతుంటే ఆపేటంత మూర్ఖులు ఎవరూ ఉండరు.
6) నిజంగానే ఆనందయ్య గారి లేహ్యం లేదా చట్నీ కొవిడ్‌కు విరుగుడుగా పనిచేస్తున్నదని నిరూపితమైతే.. ఉభయ రాష్ట్రాల ప్రజలతోపాటు దేశంలో మరణాల అంచున ఉన్నవారికి వాయువేగంతో అందించే ఏర్పాటు చేయాలి.
7) ఆనందయ్య గారిది ఒకవేళ కొవిడ్‌కు అద్భుతమైన మందు అని శాస్త్రీయంగా నిరూపితమైనా.. అల్లోపతిని ఈ వండర్‌ డ్రగ్‌ నేలమట్టం చేసిందని, ఆధునిక ఆసుపత్రుల పని దీంతో ఖతమయ్యిందని ప్రచారం చేసేవారిని కట్టడి చేయాలి.

అల్లోపతి వర్సెస్‌ ఆయుర్వేదం!డాక్టర్‌ ఎస్‌ రాము (వ్యాసకర్త: రచయిత సీనియర్‌ జర్నలిస్టు,
జర్నలిజం బోధకుడు, కమ్యూనికేషన్‌ కన్సల్టెంట్‌)

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అల్లోపతి వర్సెస్‌ ఆయుర్వేదం!

ట్రెండింగ్‌

Advertisement