2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన వెయ్యి అబద్ధాల కంటే ప్రభావవంతంగా పనిచేసిన నినాదం ‘మార్పు’. దీని ప్రభావం నగరాల్లో పని చేయలేదు, ఎందుకంటే విద్యావంతులైన ఓటర్లు ఆ మార్పును వర్తమాన, గత ప్రభుత్వాల తీరుతెన్నులు పక్కపక్కనే పెట్టి చూడగలిగారు. అమాయకులైన పల్లె ప్రజలు మార్పు అంటే తమకు ఇప్పటికంటే ఎక్కువ లాభం జరుగుతుందని భ్రమపడి కాంగ్రెస్‌ను గెలిపించారు.
వారి ఆలోచనలో కేసీఆర్ ఇస్తున్న సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ పథకాలు జత కలుస్తాయని అనుకున్నారు. ఇంగ్లిష్ భాషలో ‘మార్పు’ వంటి తటస్థ పదాలకు ఒక విశేషణం తగిలిస్తారు. అర్థం సరిగా ఉండటానికి ‘ఛేంజ్ ఫర్ గుడ్’ లేదా ‘ఛేంజ్ ఫర్ బ్యాడ్’ అని అంటారు. కానీ, ఉత్తగా మార్పు అంటే అదేమైనా కావచ్చు. కాంగ్రెస్ పాలన మొదలై మొదటి మాసికం మరో రెండు రోజుల్లో పూర్తవుతుంది కాబట్టి, ఈ మార్పులు ఎక్కడెక్కడ వచ్చాయో చూద్దాం!
Congress | అసలు రెండు పార్టీల ఎన్నికల ప్రసంగాల్లోనే మార్పు చాలా కనిపించింది. బీఆర్ఎస్ పార్టీ తమ పార్టీ అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించింది. తమ మ్యానిఫెస్టోలో లేనివి కూడా ఎలా అమలు చేశారో చెప్పింది. సంక్షేమం, అభివృద్ధి రెండూ ఎలా సాధించారో వివరించింది. ప్రజలకు సమకూర్చిన వసతులు, వారి చేయూతకు ఇచ్చిన పింఛన్ల వంటివి భవిష్యత్తు తరాలకు ఉపయోగించే విద్య, వైద్యం వంటి సౌకర్యాల గురించి బీఆర్ఎస్ నాయకుల ప్రసంగాలు సాగాయి. అయితే అందుకు పూర్తి భిన్నంగా కాంగ్రెస్ నాయకుల ప్రచారం సాగింది. కండ్లకు కనిపించని విషయాలు-బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల అవినీతి అనీ, తాము అమలు చేయబోయే (?) పథకాలు ఆకాశంలో పందిరి వేసినట్టు చెప్పారు. పైగా తమ గత పాలన చూసిన ప్రజలు తమను నమ్మకపోవచ్చని గ్రహించి, ఢిల్లీ అధినాయకులనే కాక, పక్క రాష్ర్టాల అతిరథులని కూడా పిలిపించి ఉపన్యాసాలు ఇప్పించింది హస్తం పార్టీ. ఈ ఆకాశహర్మ్యాలు చూసి కొందరు భ్రమపడి మార్పు చూద్దామని ఆ పార్టీకి ఓట్లేశారు. ఇప్పుడు ఒక్క నెలలోనే చూస్తున్న మార్పులు ఇలా ఉన్నాయి.
పోలీసు వ్యవస్థను బలపరచాలని ముందుగా ఆ కార్యక్రమం తీసుకున్న కేసీఆర్.. స్త్రీల భద్రత కోసం ‘షీ టీమ్స్’ని సృష్టించారు. బాలికలు, స్త్రీలను రోడ్ల మీద, బస్టాపుల్లో, బస్సుల్లో ఇబ్బందులు కలిగించే తుంటరులు, పోకిరీల పని పట్టించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రంలో విఫలమైన తమ పథకం ‘బస్సుల్లో స్త్రీలకు ఫ్రీ ప్రయాణం’ తెలంగాణలో ప్రవేశపెట్టింది. దీనివల్ల ఆడవాళ్లు స్త్రీ శక్తిని చూపుతూ సీట్ల కోసం సిగపట్ల పోరాటం చేస్తున్నారు. ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరగడంతో బస్సుల టైర్లు ఊడిపోవటం, కాలేజీ అబ్బాయిలు లోపల చోటు లేక ఫుట్‌పాత్‌పై నిలబడి, బస్సు వెనుక వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. అనుకోని ప్రమాదం జరుగుతుందేమో అన్న భయంతో ఆర్టీసీ సిబ్బందితో పాటు సంస్థ కూడా వణికిపోతున్నది. ఇదివరకు అంటే మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు రానప్పుడు.. ఆడవారు బోర్ల దగ్గర పోట్లాడుకునే సంఘటనలు చూసేవాళ్లం. కానీ, ఇప్పుడు బస్సుల్లో సీట్ల కోసం చూస్తున్నాం. చంకలోని పిల్లల్ని కూడా సీటు మీద పడేసి ద్వంద్వ యుద్ధాల్లోకి దిగుతున్నారు మహిళలు. కేసీఆర్ స్త్రీ శక్తి గమనించకుండా వారికి రక్షణగా షీటీమ్స్‌ను నియమిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం స్త్రీలు ఏ విషయంలోనూ తీసిపోరని నిరూపిస్తున్నది. మార్పు బాగుంది కదా!
పైగా ‘ఎంకి పెండ్లి సుబ్బి సావుకి వచ్చినట్టు’ ఫ్రీ బస్ ప్రయాణం ఆటోవాళ్ల ఉపాధిపై దెబ్బకొట్టింది. సాధారణంగా మధ్య, ఎగువ మధ్య తరగతి స్త్రీలు బయటకు వెళ్లినప్పుడు ఆటోలలో ప్రయాణిస్తారు. ఈ మెజారిటీ ఇప్పుడు ఫ్రీ ప్రయాణాలకు ఎగబడటంతో లక్షల ఆటోవాళ్ల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఏ పథకమైనా కేసీఆర్ కిట్లా, కల్యాణలక్ష్మి లాగా, బీద విద్యార్థుల విదేశీ విద్యకు సహాయం లాగా కుటుంబమంతా సంతోషించేటట్టు ఉండాలి. కానీ, ఇంకొక వర్గం పొట్ట కొట్టేటట్టు ఉండకూడదు కదా! ఏదేదో ఊహించుకొని కర్ణాటకలో, తెలంగాణలోనూ మహిళలు ఓటేశారు. కానీ, నిజానికి వారికి ఒరిగిందేమీ లేదు. పైగా రోజూ ఆఫీసు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేవాళ్లకు బస్సు ప్రయాణం ఒక నరక సదృశ్యమైపోయింది. మార్పు భలే బాగుంది కదా!
రైతులకు పెట్టుబడి సాయంగా ఇచ్చే రైతుబంధు కొత్త పథకమేమీ కాదు. కానీ, ఎన్నికలను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు వల్లనే రైతులకు సమయానికి పెట్టుబడి సాయం అందలేదు. మరి ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కొత్త ప్రభుత్వమైనా ఆ నగదు అందించాలి కదా! అది రాలేదు రైతులకు. కాలం అయిపోతుందని అష్టకష్టాలు పడి పంట వేస్తున్నారు చేతనైనవాళ్లు. లేనివాళ్లు ఊరుకుంటున్నారు. మరి ఇది పెద్ద మార్పే కదా! బాగుందా ఈ మార్పు?
ఇంక ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్ అయింది. అంటే ప్రగతి పోయి ప్రజలను వారి సంగతి వారినే చూసుకోమని చెప్తున్నారన్నమాట. నాయకుడి పాలనపోయి ప్రజా పాలన వచ్చింది. నిజానికి 1947లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచీ ప్రజా పాలనే సాగుతున్నది. ఆ పార్టీ నాయకులు ఎప్పుడు పట్టించుకున్నారు ప్రజలను? అధికారులు విధిస్తున్న నిబంధనల ప్రకారం ప్రజలు వారిని వారే పాలించుకుంటున్నారు. కనీసం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించలేదు ఈ ప్రభుత్వాలు. అందుకే పెద్దఎత్తున మేధోవలస జరిగి, జీవితంలో ఏదైనా సాధించాలని ఉత్సాహంతో చదువుకున్న తెలివైనవారు విదేశాలకు తరలిపోయారు. ఇంత జనాభా ఉన్న మన దేశం, ఇన్ని విశ్వవిద్యాలయాలున్న భారతదేశ విద్యాసంస్థలు అంతర్జాతీయ ర్యాంకులలో 100లోపు ఎప్పుడూ సాధించలేదు. ఇది 1947 నుంచీ దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ఘనత. బ్రిటిష్ పాలన కింద ఉన్న విద్యాస్థాయి కూడా తర్వాత లేదంటే అది ఆ కాలంలోనే కాంగ్రెస్ సాధించిన మార్పు కదా!
2024 సార్వత్రిక ఎన్నికల దాకా అరకొరగా తాము చెప్పిన పథకాలు సాగినా, తర్వాత అసలైన మార్పు చూస్తారు అమాయక తెలంగాణ ఓటర్లు. అసలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య తేడా ఏమిటో ఈ ప్రజలకు తెలియలేదు, గ్రహించలేదు కాబట్టే అమాయకంగా పథకాల పేర్లు చూసి కాంగ్రెస్‌ను గెలిపించారు. రాష్ట్రం ఏర్పడగానే కేసీఆర్ సకలజనుల సర్వే నిర్వహించి ప్రజల వివరాలన్నీ కుటుంబాల వారీగా సేకరించి, తర్వాతి ప్రణాళికలు అన్నీ ఆయనే రచించారు. ఐదున్నర దశాబ్దాలు కష్టాలు పడ్డ ప్రజలకు – వర్గాల వారీగా- అంటే రైతులు, మహిళలు, ఉద్యోగులు, వృద్ధులు, విద్యార్థులు ఇలా వారి అవసరాలను గుర్తించి ప్రణాళికలు రచించారు. దానికి రాష్ట్రం ఏర్పడకముందే చాలా సభలు పెట్టి, ఆయా రంగాల నిష్ణాతులతో చర్చించాకే పథకాలు రూపొందించారు. అందుకే అవన్నీ అంత విజయవంతంగా సాగాయి. అటు వ్యవసాయంలో రైతులకు, ఇటు పారిశ్రామికవేత్తలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించారు. హడావుడిగా కాంగ్రెస్ వారి లాగా ప్రజలను ఓటర్లుగా చూడకుండా, మనుషులుగా పరిగణించి వారి అవసరాలు తీర్చారు. ఇదే పెద్ద తేడా! మరి ఇప్పటి మార్పు గమనించారా?
ఇప్పుడు చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నదేమంటే అన్నేండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలో తడబడుతూ, రోజుకో మాట మారుస్తూ, ప్రజలకిచ్చిన ఒక్క అభ్యర్థనా పత్రంలో అన్ని లోపాలుండటం, డబ్బులు జమచేస్తామని అకౌంట్ నంబర్ అడుగకపోవటం. అసలు అన్ని పథకాలు ఒక్క పత్రంలో, అదీ డిజిటల్ కాకుండా ఒక పేరుతో ఇస్తే మళ్లీ వాటిని వర్గీకరించటానికి ఎంత సమయం కావాలి? ఇవన్నీ చూసి ప్రజలు కాంగ్రెస్ నాయకుల అసమర్థతకు ఆశ్చర్యపోతున్నారు. కానీ, కొద్దిగా లోతుగా 1956 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పాలన చూస్తే అసలు విషయం అర్థమవుతుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 58 ఏండ్ల కాలంలో కాంగ్రెస్ 44 ఏండ్లు, తెలుగుదేశం పార్టీ 14 ఏండ్లు పరిపాలించాయి. ఇరవై ఏడున్నర ఏండ్లు రాయలసీమకు చెందినవారు ముఖ్యమంత్రులుగా, ఇరవై నాలుగున్నర ఏండ్లు ఆంధ్రా ప్రాంతం వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముగ్గురిని తెలంగాణ నుంచి అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులుగా చేసినా.. వారి పాలనను ఆరేండ్లే సాగనిచ్చారు ఆంధ్రా నాయకులు. ఇక ఇతర ప్రాంతాలవారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు అన్ని ప్రణాళికలు, అన్ని విధానపరమైన నిర్ణయాలూ ఆ ముఖ్యమంత్రులూ, వారి సహచర వ్యాపారస్థులకు అనుగుణంగా తీసుకొని తెలంగాణ వనరులు దోచుకుంటూ పాలన సాగించారు. 1969 తెలంగాణ ఉద్యమం తర్వాత కూడా మంత్రివర్గంలో ఉన్నా, ఈ తెలంగాణ నాయకులు కూడా అవినీతి సొమ్ములో తమ పది పైసల వాటాతో తృప్తిపడ్డారు కానీ, ఆంధ్రా నాయకులను ప్రశ్నించే ప్రయత్నం చేయలేదు. తెలంగాణ వనరుల దోపిడి కానీ, ప్రజల పట్ల చూపిన వివక్ష గురించి కానీ వారు ఆంధ్రా నాయకులను నిగ్గదీసింది లేదు. నిర్ణయాలన్నీ ఆ ప్రాంతం నాయకులవి గనుక వాటి గురించి వీరు ఆలోచించినదీ లేదు.
డాక్టర్ జయశంకర్ సార్ ఎన్నో సభల్లో చెప్పేవారు. ‘తెలంగాణ వారు హోంమంత్రిగా ఉన్నా కూడా టోపీ మంత్రికి పెట్టి లాఠీ మాత్రం తన చేతిలో పెట్టుకునేవాడు ముఖ్యమంత్రి’ అని. ఇలాగా ఈ తెలంగాణ కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం నాయకులకు కానీ ఏ విధానం, ప్రణాళిక, నిర్ణయం కానీ ఎట్లా చేస్తారో తెలియదు. వీళ్లెవరూ వాటిల్లో పాత్ర వహించకపోవటంతో వీరికి ఏ రకమైన పాలనా అనుభవం రాలేదు. బయట ఎక్కడా వీళ్లని మాట్లాడనివ్వకపోవటంతో, రాజకీయ నాయకులు ఎంత హుందాగా మాట్లాడాలో కూడా వీళ్లకి అసలు అవగాహన లేదు. అందుకే ఇప్పుడు అధికారం చేతిలోకి వచ్చినా, వారికి ఒక అప్లికేషన్ ఎలా ఉండాలో కూడా తెలియదు. ప్రజలతో ఎలా మాట్లాడాలో తెలియదు. ప్రతిపక్షాన్ని హుందాగా ఎలా విమర్శించాలో తెలియదు. అందుకే గల్లీ రౌడీల్లా మాట్లాడుతున్నారు.
ప్రజలకు ఇప్పుడు ఈ మార్పు స్పష్టంగా తెలిసివస్తున్నది. మేధ, ప్రజ్ఞ, తెలివి, నిబద్ధత, ప్రజల పట్ల అపారమైన ప్రేమ, ప్రాంతం పట్ల భక్తి ఉన్న నాయకుడి పాలన, ఈ లక్షణాలేవీ లేకుండా, కేవలం నినాదాలతో అధికారం చేజిక్కించుకున్న అనుభవరాహిత్య నాయకుల పాలనలో తేడా! ఈ మార్పేనా ప్రజలు కోరుకున్నది? పదేండ్ల ముందు ఉన్న అంధకారమేనా వారికి కావాల్సింది?
ఈ విషయం గురించి బాగా అవగాహన చేసుకొని తెలంగాణ ప్రజలు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనైనా తమ పట్ల ప్రేమ ఉన్న నిజమైన నాయకుడు కేసీఆర్‌ని, మిగతా బీఆర్ఎస్ సభ్యులను అత్యధిక మెజారిటీ ఓట్లతో ఎన్నుకొని పార్లమెంట్‌కు పంపిస్తే తెలంగాణ వాణిని కనీసం ఢిల్లీలోనైనా వినిపించటానికి వీలవుతుంది. లేకపోతే రాష్ట్రంలో, కేంద్రంలో తెలంగాణ గొంతు మూగబోతుంది. 1956 నుంచి 2014 దాకా పడ్డ కష్టాలే మళ్లీ పడాల్సి ఉంటుంది. జాగ్రత్తగా, తెలివిగా ఆలోచించండి. దొరలు వద్దని సిద్ధాంతం పెట్టుకొని దొంగలను ఎన్నుకోకండి. నాయకులకు పాలనానుభవం చాలా ముఖ్యం. ఆలోచించండి, జాగ్రత్తగా ఓటు వేయండి.
దంటు కనకదుర్గ
89772 43484