Population | చైనాను అధిగమించి, ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్ అవతరించింది. ఈ నేపథ్యంలో అనేక వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం భారత్ జనాభా 143 కోట్లు. 2060ల నాటికి ఇది 170 కోట్ల గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని, ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతుందని అంచనాలున్నాయి. ఈ లెక్కల సంగతి ఎలా ఉన్నా.. అధిక జనాభా మన దేశానికి వరమా? శాపమా?
ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం ప్రపంచ జనాభా 800 కోట్లను దాటింది. 2050 నాటికి 970 కోట్లకు చేరుకోవచ్చు. 2080 నాటికి 1040 కోట్లకు పెరిగి, అక్కడ స్థిరంగా ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
భారతదేశ జనాభాలో సగం మంది 30 ఏండ్లలోపు వారు. అంటే, దాదాపు 72 కోట్ల మందితో కూడిన యువశక్తి ఉన్న దేశం మనది. ప్రపంచంలో ఏ దేశం వద్దా ఇంతటి యువశక్తి లేదు. సరైన విద్యను అందించటం ద్వారా, ఉద్యోగ నైపుణ్యాలకు సంబంధించి నిరంతర శిక్షణ ఇవ్వటం ద్వారా యువశక్తి ప్రతిభ సామర్థ్యాలను దేశం ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం వృద్ధి రేటు దాదాపు ఆరు శాతంగా నమోదవుతున్నది. ద్రవ్యోల్బణం, ప్రపంచవ్యాప్తంగా మాంద్యం, అంతర్జాతీయంగా భౌగోళికంగా, రాజకీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు వంటి సమస్యలున్నా భారత్ తన జనాభాను ముఖ్యంగా యువతను సరైన విధంగా వినియోగించుకుంటే అద్భుతమైన ప్రగతిని నమోదు చేయవచ్చని అంతర్జాతీయ సంస్థలు, నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే.
అధిక జనాభా ఉండటం సానుకూలతే కానీ దానితో ఉండే సమస్యలు దానికున్నాయి. జనాభాను దేశానికి పరిమితమైన అంశంగా కాక, అంతర్జాతీయంగా ప్రభావం చూపే అంశంగా గుర్తించాలి. ముఖ్యంగా వాతావరణ మార్పులు కీలకమైనవి. భూమ్మీద జీవ వైవిధ్యానికి ఎదురవుతున్న సవాళ్లపై ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూఎన్ఎఫ్సీసీసీ ఎప్పటికప్పుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ప్రతికూల వాతావరణ మార్పుల వల్ల ప్రజల వలసలు రానున్న రోజుల్లో విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉన్నదని ఈ సంస్థ చెప్తున్నది. అధిక జనాభా వల్ల నివాసయోగ్యమైన ప్రాంతాలు కుదించుకుపోతున్నాయి. దీవులు, తీరప్రాంతాలు మునిగిపోతున్నాయి. మనుగడ కోసం వన్యప్రాణులకు, మనుషులకు మధ్య ఘర్షణ పెరిగే ప్రమాదం ఉన్నది. నాణ్యమైన నీళ్లు, గాలి తగ్గుతున్నాయి. ఇవన్నీ ఏవో కాకిలెక్కలు కావు. ప్రపంచవ్యాప్తంగా తరచూ వెలువడుతున్న పరిశోధనల నివేదికలు, అధ్యయనాలు చేస్తున్న హెచ్చరికలు. అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్ వీటిని విస్మరించకూడదు. కచ్చితంగా వీటిపై అధ్యయనం జరిపి, తక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.
జీవన పరిస్థితులు దుర్భరంగా ఉన్న ఆసియా, ఆఫ్రికాల్లోని పేద దేశాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంటున్నది. ఈ దేశాల్లో ప్రజలు ప్రకృతి కారణంగానే గాక ప్రభుత్వపరంగా ఎదురవుతున్న వివక్ష, నిర్లక్ష్యం వల్ల కూడా పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. దీనికి పూర్తి భిన్నంగా, అత్యాధునిక దేశాల్లో జనాభా క్రమంగా తగ్గుతూ వస్తున్నది.
వృద్ధుల సంఖ్య పెరిగిపోయి శ్రామికుల సంఖ్య తగ్గటం ఈ దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. పెరిగిపోతున్న వృద్ధ జనాభాకు అవసరమైన వైద్య చికిత్సలను అందించటం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పలు ధనిక దేశాల్లో ఇప్పుడు ఈ సమస్య ఉన్నది. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకైతే ఈ వ్యయాన్ని భరించటం దాదాపుగా అసాధ్యం.
గత శతాబ్ద కాలంలో ఔషధ రంగంలో చోటుచేసుకుంటున్న అత్యాధునిక మార్పుల వల్ల మానవ జీవితకాలం దాదాపు రెట్టింపయ్యింది. ఆయుః ప్రమాణం మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. తరచూ ఏదో ఒక చికిత్స తీసుకునే వృద్ధ జనాభాతోనే తమకు ఎక్కువ లాభం కాబట్టి, మానవ ఆయుః ప్రమాణం పెరుగుదలలో ఔషధరంగం (ఫార్మా ఇండస్ట్రీ) పాత్ర కూడా లేకపోలేదన్న వాదనలున్నాయి.
అభివృద్ధి మార్గాన ఉన్న భారతదేశం, 100వ స్వాతంత్య్ర దినోత్సవాల నాటికి, అంటే 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన దేశం’ హోదాను సంతరించుకోవచ్చు. ఈలోపు జరిగే మార్పులను ఎలా ఎదుర్కొంటామన్నదే అసలు సమస్య. పెరుగుతున్న జనాభా వల్ల భూమి, అడవులు, జల వనరులు, గాలి వంటి సహజ వనరులపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. 2019లో దేశ జనాభాలో అరవై ఏండ్లు లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న వారు పది శాతమే. కానీ, 2050 నాటికి వారి సంఖ్య 19.6 శాతానికి పెరుగుతుంది. అంటే, మరో 25 ఏండ్లపాటు మన వద్ద తిరుగులేని యువశక్తి ఉన్నప్పటికీ, వృద్ధుల సంఖ్య కూడా తక్కువేమీ ఉండదు. వీరి సంఖ్య దాదాపు 30 కోట్లకు చేరుకుంటుంది. వీరందరికీ గౌరవనీయమైన జీవనాన్ని కల్పించటం చిన్న సవాలేమీ కాదు.
సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉన్న కేరళలో గత 30 ఏండ్ల వ్యవధిలో 65 ఏండ్ల వయస్సు వారి సంఖ్య రెట్టింపయ్యింది. ఆ రాష్ట్ర జనాభాలో వారి వాటా 12 శాతానికి చేరుకున్నది. జనాభా నియంత్రణలో కేరళతో పోటీ పడుతున్న పలు రాష్ర్టాల్లోనూ ఈ ధోరణే కనిపించనున్నది. కాబట్టి, చైనాను అధిగమించి భూగోళం మీద అత్యధిక జనాభా రికార్డు సృష్టించామని చెప్పుకునేముందు దానితోపాటు వచ్చే సమస్యలపైనా దృష్టిపెట్టాలి. ఆ సమస్యల పరిష్కారానికి దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమవుతాయి. ప్రజలకు నాణ్యతతో కూడిన జీవనాన్ని ఇవ్వటానికి ధైర్యంతో కూడిన నిర్ణయాలు, మెరుగైన విద్య, వైద్యం, నైపుణ్యాలు, ఉద్యోగాలు అవసరమవుతాయి. వీటన్నింటిపై ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తుల స్థాయిలో సమగ్రమైన కార్యాచరణ జరుగాలి.
జనాభాలో చైనాను అధిగమించినప్పటికీ, భారత జనాభా వృద్ధి రేటు నెమ్మదిస్తున్నది. 1971-81 మధ్య ఏటా సగటున 2.2 శాతం చొప్పున జనాభా పెరుగగా, 2001-11 నాటికి 1.5 శాతానికి తగ్గింది. ప్రస్తుతం దీనికంటే తక్కువగా ఉం ది. భారతీయ మహిళల సగటు సంతానోత్పత్తి 1960లలో ఆరు ఉండగా, ప్రస్తుతం రెండుకు తగ్గింది.
(ఎన్డీటీవీ సౌజన్యంతో..)