ఎన్నికలు సమీపించినా కొద్దీ కాంగ్రెస్, బీజేపీ నాయకుల వాచాలత ఎక్కువవుతున్నది. ఈ ధోరణి లోగడ కూడా ఉండేది గాని ఇటీవల రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లు ఆ పని ఒకరితో ఒకరు పోటీ పడి చేస్తున్నారు. ఎందుకని ఆలోచించగా, ఎన్నికలు గెలవక పోయినా కనీసం రెండవ స్థానాన్ని సంపాదించలేకపోతే తమ పరువు, పార్టీ పదవి రెండూ ఉండవనే భయం వారికి పట్టుకున్నట్టు కనిపిస్తున్నది. రెండవ స్థానం రాకపోవటం రెండు పార్టీలకూ అనేక విధాలుగా సంకట స్థితే అవుతుంది.
రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా మంచి ప్రతిష్ట గల నాయకుడు ఎప్పుడూ కాదు. కనీసం సంస్థను ఒక ప్రణాళిక ప్రకారం ఐక్యంగా, ముందుకు తీసుకువెళ్లి, పార్టీ పునాదిని పెంచగల సమర్థత, కార్యశీలత అయినా తనలో ఎప్పుడూ కన్పించలేదు. పార్టీ అధ్యక్షుడు కావటానికి ముందటి చెడ్డపేరు ఆయన మౌలిక స్వభావం అనుకుంటే, అధ్యక్షుడు కావటం వల్ల లభించిన హోదా, అధికారాలతో అదే పద్ధతిలో మరింత రెచ్చిపోతూ వచ్చారు.
మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో వరుసగా ర్యాంకులను, రాష్ర్టానికి పెట్టుబడులను, మరింతగా ప్రజాదరణను గడిస్తూ, బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్త ఖ్యాతిని, విస్తరణను సాధిస్తుండటం వీరి భయాలను మరింత పెంచుతున్నదనేది స్పష్టం. రేవంత్, సంజయ్ తీరును జాగ్రత్తగా గమనించండి. ఇద్దరూ రెండు పెద్ద జాతీయపార్టీలకు తెలంగాణ శాఖ అధ్యక్షులు. ఇక్కడ కాంగ్రెస్‌కు మొదటి నుంచి ప్రతి గ్రామంలో ఎంతో కొంత ప్రజాదరణ ఉంది. రాష్ట్రం ఏర్పడినాక వరుసగా ఓడుతున్నా వెనుకటి పునాది ఇంకా కొంత మిగిలి ఉంది. నాయకత్వం సరైనది అయితే ఆ పునాదిని ఆధారం చేసుకుంటూ వీలైనంత పెంచుకోవచ్చు. ఆ పని జరిగితే ఈ తొమ్మిదేండ్లలోఎట్లా ఉండేదో చెప్పలేము. కనీసం ఇంత అధ్వాన్నంగా మారేది కాదు. రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వాల అసమర్థతలు రెండూ కలిసి ఇక్కడ ఈ దుస్థితి తెచ్చిపెట్టాయి. ఉన్న పార్టీ పెరగకపోగా కొందరు టీఆర్ఎస్/బీఆర్ఎస్ వైపు, కొందరు బీజేపీవైపు పోయారు. ఢిల్లీ నాయకత్వమే గందరగోళంగా ఉన్నందున వారు తెలంగాణకు ఎవరిని పర్యవేక్షకులుగా నియమిస్తారో, ఎందుకో, వారిక్కడ ఏమి చేస్తారో మనకు ఎప్పుడూ అంతు పట్టదు. సాక్షాత్తూ పార్టీలోనే వినవచ్చే విమర్శలకు, గుసగుసలకు, ఆరోపణలకు అంతులేదు.
రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా మంచి ప్రతిష్ట గల నాయకుడు ఎప్పుడూ కాదు. కనీసం సంస్థను ఒక ప్రణాళిక ప్రకారం, ఐక్యంగా, ముందుకు తీసుకువెళ్లి, పార్టీ పునాదిని పెంచగల సమర్థత, కార్యశీలత అయినా తనలో ఎప్పుడూ కన్పించలేదు. పార్టీ అధ్యక్షుడు కావటానికి ముందటి చెడ్డ పేరు ఆయన మౌలిక స్వభావం అనుకుంటే, అధ్యక్షుడు కావటం వల్ల లభించిన హోదా, అధికారాలతో అదే పద్ధతిలో మరింత రెచ్చి పోతూ వచ్చారు. తను లేదా తన వంటి వ్యక్తులు అంతకు భిన్నంగా వ్యవహరించలేరన్నది వేరే విషయం. కానీ సమస్య ఏమంటే, ఆ లాభనష్టాలు తనవి కాదు. కాంగ్రెస్ పార్టీవి అయ్యాయి, అవుతున్నాయి. విస్తృత స్థాయితో చూసినపుడు ప్రతిపక్ష రాజ కీయానివి, రాష్ట్ర రాజకీయానివి, ప్రజాస్వామ్యానివి అవుతున్నాయి. కానీ ఇవేవీ గుర్తించని ఆయన తన స్వభావానికి అనుగుణంగా వ్యవహరిస్తూనే ఉన్నారు.
ఇపుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి. రేవంత్ అధ్యక్షుడు అయిన తర్వాత ఉప ఎన్నికలు అన్నింటిలోనూ విఫలమయ్యారు. ఎందుకు, ఏ విధంగా అనే విశ్లేషణను, అపుడు వచ్చిన వదంతులను పక్కన ఉంచుదాం. కానీ సార్వత్రిక ఎన్నికలు భిన్నమైన లెక్క. ఆయన మొదటి నుంచి పార్టీని సరిగా అభివృద్ధి చేసి ఉంటే ఇపుడు పరిస్థితి ఇంత కష్టంగా ఉండేది కాదు. కానీ అది జరగలేదు గనుక సహజంగానే గాభరా మొదలైంది. మరీ ముఖ్యంగా ఒకవైపు కేసీఆర్ బలం మరింతగా పెరుగుతూ, బీజేపీ రూపంలో ఒక పోటీదారు రావటంతో ఆ గాభరా పెరుగుతున్నది. ఈ స్థితి నుంచి పుట్టుకువచ్చిందే రెచ్చిపోయిన పిచ్చి మాటల ధోరణి.
రేవంత్‌కు, సంజయ్‌కు నిరర్థకమైన అపోహ ఒకటి ఏర్పడినట్లు తోస్తున్నది. ఎంత రెచ్చిపోతే, ఎంత పిచ్చిగా మాట్లాడితే ప్రజలను అంతగా రెచ్చగొట్టి అంత ఎక్కువగా ఓట్లు సంపాదించవచ్చునని. అందుకే -ఒకరితో ఒకరు ఇట్లా పోటీ పడుతున్నారు. అందువల్ల తాము సమాజంలో గౌరవాన్ని కోల్పోతున్నామని, ఛీత్కరింపుల పాలు అవుతున్నామని వారికి అర్థమవుతున్నదో లేదో, అర్థమైనా అంతకన్న భిన్నంగా వ్యవహరించేందుకు వారు ఆశక్త్తులు, అసమర్థులోగాని, ఆ ధోరణిలో మాత్రం కూరుకుపోయారు. ఒక కాకతాళీయమైన విషయమేమంటే స్వభావం, సంస్కారాల రీత్యా ఈ నాయకులిద్దరూ ఒకటే కావటం.
ఇక బీజేపీకి రాష్ట్రంలో కొన్నిచోట్ల కొంత ఆదరణ ఉన్నది. కొత్తగా కొన్ని వర్గాలు కొంత ఆకర్షితమవుతున్నాయి. మొత్తం మీద ఇదంతా కలిపినా పరిమితమైనదే. ఒకప్పటి పరిస్థితిని అట్లుంచితే బలాన్ని పెంచుకునేందుకు వాజపేయి కాలం నుంచి ప్రయత్నిస్తున్నారు. అప్పటి ప్రయత్నాలు సవ్యంగా ప్రజాస్వామికంగా ఉండగా, నరేంద్ర మోదీ కాలం వచ్చేసరికి అవే సవ్యమైన పద్ధతులలో ప్రజాదరణను పెంచుకోవటానికి బదులు ధూర్తమైన మార్గాలే తమకు తగిన వ్యూహం, ఎత్తుగడలు కూడా అనే నిర్ణయానికి వచ్చారు. దేశమంతటా అమలు చేస్తున్న ఈ పనే తెలంగాణలో కూడా చేస్తున్నారు. ఇందుకు సరిగా సరిపోయే ధూర్త స్వభావం ఉన్నవారు జాతీయస్థాయిలో, వివిధ రాష్ర్టాలలో నాయకత్వ స్థానాలలో నియమితులైనట్లు, ఇక్కడ బండి సంజయ్ నాయకుడయ్యారు. పార్టీ పునాదిని సవ్యమైన, ప్రజాస్వామికమైన పద్ధతులలో పెంచగల సమర్థత ఆయనకు లేదు. కనుక షార్ట్కట్లు కావాలి. రెచ్చిపోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడటం అటువంటి షార్ట్కట్లలో ఒకటి. రెండవ స్థానం కోసం కాంగ్రెస్‌తో పోటీ ఉన్నందున మాటల ధోరణి అందుకు భిన్నంగా ఉండగల అవకాశమే లేదు మరి.
-టంకశాల అశోక్