రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు పూర్తయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఆలోచన, విజన్ లేకుండా కేవలం కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగతంగా నిందలు వేసి, ప్రజల్లో లేని ఒక వ్యతిరేకతను సృష్టించడం వల్లనే అధికారంలోకి వచ్చింది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిస్తామని తెలుపుతూనే, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్ని పార్టీలు కోరుతున్నాయి. కాంగ్రెస్ కూడా ఎన్నికల ప్రచారంలో పలుమార్లు ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పుకొంటూ వచ్చింది. అసలు ఈ ఆరు గ్యారెంటీలు సాధ్యమేనా? ఇవి అమలుచేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఏం చేయాలి? వీటి సవాళ్లను తెలుసుకుందాం.
మొదటి గ్యారెంటీ కింద మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు ప్రయాణం, సిలిండర్ 500, రూ.2,500 మహిళలకు ఇస్తామని తెలిపింది. రేషన్‌కార్డున్న మహిళలకే ఉచిత బస్సు సౌకర్యం ఉంటుందా? మిగతా వారు ఉచిత బస్సు సౌకర్యం కోల్పోతారా? అనే ప్రశ్న ప్రజల్లో మొదలైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా రవాణాను ప్రైవేట్‌పరం కాకుండా మెట్రో, ఆర్టీసీని అనుసంధానిస్తూ కామన్ మొబిలిటీ కార్డు తెచ్చే ప్రయత్నం చేసింది. కానీ, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నది. సిలిండర్ రూ.500కు ఇస్తామంటున్నది. ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ప్రజలకు ఇస్తుందా? లేదా ప్రభుత్వమే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా కొనుగోలు చేసి ప్రజలకు ఇస్తుందా? సిలిండర్ రేటు అంతర్జాతీయ అంశాలపై ఆధారపడి ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా సిలిండర్లను మార్కెట్ రేటుకు అనువుగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. అంటే ఇది ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలు. ఇప్పటికే కేంద్రం ఇస్తున్న ఎల్పీజీ సౌభాగ్య పథకం కింద ఉన్నవారిని ఇందులో అర్హులుగా చేర్చుతారా? అంటే రేషన్ కార్డున్న వారికి గ్యాస్ సిలిండర్‌పై కొన్ని ఆంక్షలుంటాయి. మరి ఇప్పుడున్న వారందరికీ ఇది వర్తిస్తుందా? మహిళలకు రూ.2,500 ప్రతి నెల ఇస్తామన్నారు, ఎలా ఇస్తారు? పింఛన్ తీసుకుంటున్న అవ్వలకు, ఒంటరి మహిళలకు ఏది వర్తిస్తుంది? దీనిమీద ప్రభుత్వం దగ్గర ఎలాంటి విధివిధానాలున్నాయో ప్రజలకు తెలియడం లేదు.
రెండవ గ్యారెంటీ రైతు భరోసా. రాష్ట్రంలో రైతుబంధు తీసుకుంటున్న వారి సంఖ్య 70 లక్షలు. ఈ ఏసంగికి ఇంకా రైతుబంధు పడలేదు. ఎకరానికి రూ.15,000 ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దానిని నెరవేర్చలేదు. కౌలు రైతులకు కూడా రైతుభరోసా ఎలా ఇస్తారు? కౌలు రైతులకు ఈ రోజు పాసుబుక్ లేదు. మరి వారికి ఎలా అమలుచేస్తారు? భూ యజమానికి, కౌలు రైతుకు ప్రభుత్వం ఏమైనా గ్యారెంటీ పత్రం ఇస్తుందా? 1952లో తీసుకువచ్చిన హైదరాబాద్ కౌలుదారు చట్టాన్ని మళ్లీ అమలుచేస్తుందా? కూలీలకు రూ.12,000 ఎలా ఇస్తారు? రైతు కూలీలు ఏదైనా పథకం లబ్ధి పొందినట్టయితే దానివల్ల ఉపాధిహామీ పథకానికి ఇబ్బందులు తలెత్తే అవకాశాలుంటా యా?. 100 ఎకరాలున్న వారికే రైతుబంధు వస్తుందని తప్పు డు ప్రచారం చేసిన కాంగ్రెస్ ఈ రోజు రైతుభరోసా విషయంలో ఇన్ని ఎకరాల్లోపే ఇస్తామని ఎక్కడా చెప్పడం లేదు. 2018 నుంచి నిర్విరామంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు వేస్తూ రూ.65 వేల కోట్లకు పైగా ఖర్చుచేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి రైతుబంధు డబ్బులనే పూర్తిగా వేయలేకపోతున్నది.
మూడవ గ్యారెంటీ యువ వికాసం. ప్రతి విద్యార్థికి రూ.5 లక్షల కార్డును అందిస్తామన్నారు. ఇది ఏ విధంగా అమలుచేస్తారు? 18 ఏండ్లు నిండిన వారికిస్తారా? లేక నిరుద్యోగులకిస్తారా? ఒకవేళ 18 ఏండ్లు నిండిన వారికిస్తే ప్రభుత్వ ఖజానా మీద భారీగా భారం పడే అవకాశం ఉన్నది. ఇవేకాకుండా స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రభుత్వానికి భారీగా భారం పడుతుంది. నిరుద్యోగులకిస్తే అసలు ఎంత మంది నిరుద్యోగులున్నారు? వారిని ఏ ప్రాతిపదికన గుర్తిస్తారు? LFPR (Labour Force Paricipation Rate) ప్రకారంగానా? లేక CWS (Current Weekly Status) ద్వారా నిరుద్యోగాన్ని కొలుస్తారా? ఇవన్నీ కూడా ప్రజల్లో తలెత్తుతున్న ప్రశ్నలు.
నాలుగవ గ్యారంటీ ఇందిరమ్మ ఇల్లు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మన రాష్ర్టానికి కేటాయించినవి 1,90,000 గృహాలు. వీటిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1,20,000పైన నిర్మించింది. మరిప్పుడు మిగిలిన వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం కడుతుందా? లేదా ఇందిరమ్మ పేరు మీద మళ్లీ కొత్తవి నిర్మిస్తుందా? కొత్తవి నిర్మిస్తే ఎన్ని నిర్మిస్తుంది? అర్హులకు రూ.5 లక్షల సాయమన్నారు. గత వారం గృహలక్ష్మి కింద నమోదు చేసుకున్న లబ్ధిదారులను పూర్తిగా రద్దుచేసింది నేటి ప్రభుత్వం. మరి వారందరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తుందా? కొత్తవి నిర్మిస్తే ప్రభుత్వంపై పెనుభారం పడే అవకాశం ఉన్నది. ప్రజాపాలన ఫాంలో సైతం ప్రజలు పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసమే నమోదు చేసుకున్నారు. వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందుతాయా అనేది ప్రజల్లో మెదులుతున్న ప్రశ్న.
ఐదవ గ్యారెంటీ గృహజ్యోతి. ఇది కాంగ్రెస్‌కు పెనుసవాలుగా మారనున్నది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తామన్నారు. 200 యూనిట్లు అంటే దాదాపు 700-800 మధ్య కరెం టు బిల్లు వస్తుంది. రాష్ట్రంలో కోటి గృహాలకు కరెంటు కనెక్షన్లున్నాయి. ప్రతి నెల 700 X 10000000… అంటే ప్రభుత్వంపై పెద్ద ఎత్తున భారం పడే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో 26 లక్షల వ్యవసాయ కనెక్షన్లున్నాయి. మరి గృహజ్యోతి పథకం ఈ కనెక్షన్లకు వర్తిస్తుందా? కర్ణాటకలో దీనివల్ల భారీగా కరెంటు కోతలు మొదలయ్యాయి. పథకం లబ్ధి పొందనివారిపై భారీగా భారం పడుతుంది. ఉదాహరణకు 203 యూనిట్లు వస్తే ప్రజలు 3 యూనిట్ల వరకు బిల్లు చెలించాలా? లేక 203 యూనిట్ల బిల్లు చెల్లించాలా? ఎందుకంటే విద్యుత్తు రేట్లు స్లాబుల ప్రకారం లెక్కించబడుతాయి. స్లాబుకు 1 యూనిట్ పెరిగినా భారీగా బిల్లులో తేడా వస్తుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద సవాలు.
ఆరవ గ్యారంటీ చేయూత. ప్రభుత్వం ఏర్పాటైన నెల నుంచి రూ.4 వేల పింఛన్ అందిస్తామని చెప్పారు. ఈ పథకం మొదటి గ్యారంటీలోని మహాలక్ష్మిలో రూ.2500 తీసుకున్న మహిళలకు, ఈ పథకానికి అర్హులైన వారి మధ్య క్లాష్ అయ్యే అవకాశం ఉన్నది. అందులో లబ్ధి పొందిన వారికి ఇది వర్తిస్తుందా లేదా? అన్నది వేచిచూడాలి. గత ప్రభుత్వం కేవలం ఆధార్ ఉన్న వారందరికి పింఛన్ కల్పించింది. గ్రామాల్లో రేషన్‌కార్డు లేనివారు కూడా పింఛన్ తీసుకుంటున్నారు. మరి వీరికిప్పుడు ఈ పథకం వర్తిస్తుందా?
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆరు గ్యారెంటీలను అమలుచేయాలంటే ప్రధానంగా వీరు చేయాల్సింది సామాజిక, ఆర్థిక సర్వే. దీని ద్వారానే నిజమైన లబ్ధిదారులు బయటకి వస్తారు. ప్రస్తుతం అనర్హులకు సైతం రేషన్‌కార్డులున్నాయి. మొదట వీటిని రద్దుచేయాలి. బీహార్ రాష్ట్రం మాదిరి కులగణన చేయడం ద్వారా కూడా మరింతగా లబ్ధి చేకూర్చే అవకాశం ఉంటుంది. అప్పుడే ఈ 6 గ్యారెంటీలు నిజమైన లబ్ధిదారులు పొందగలుగుతారు. ఇలా లైనులో నిలబడి భారీగా దరఖాస్తులు నింపితే సాధ్యమయ్యే పనులు కావివి.
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టి రాష్ట్ర ఆర్థికపరిస్థితిని తెలియజేసింది. ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలను అమలుచేస్తే ఏటా రూ.1,50,000 కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్ల వరకు భారం పడే అవకాశం ఉన్నది. అంతేకాకుండా రాష్ట్రంలోని నిర్మాణరంగంలో అమలవుతున్న పనులకు ఆటంకం కలుగవచ్చు. పాలమూరు-రంగారెడ్డి చివరి దశ, ఐటీ టవర్లు, కాళేశ్వరంలో చివరి లింకు, మున్సిపాలిటీల నిర్వహణ, పల్లె ప్రగతి కార్యక్రమాలకు భారీగా నిధులు అవసరమవుతాయి. ఇన్ని సవాళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఎదుర్కుంటుందనేది రాష్ట్ర ప్రజలకు అంతుచిక్కడం లేదు.
-కన్నోజు శ్రీహర్ష
89851 30032