తెలంగాణ మట్టిలో పుట్టి, ఆ మట్టితో కలిసి, ఆ మట్టికే గీతం పాడిన గొంతుక అందెశ్రీ. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. అక్షర జ్ఞానం లేకపోయినా, అది ఆయనకు అడ్డురాలేదు. తన హృదయాన్ని పల్లె భాషలో గీతాలుగా పలకరించిన ఆ ప్రజాకవి పేరు నేటి తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో చిరస్మరణీయం. తెలంగాణ మట్టికి ఎంతో సేవ చేసిన అందెశ్రీ మృతిచెందడం సాహితీలోకానికి తీరని లోటు.
1961 జూలై 18న అప్పటి వరంగల్ జిల్లాలోని మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో అందెశ్రీ జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా పెరిగిన ఆయన జీవితం కష్టసుఖాల సమ్మేళనం. తాపీ పనులు చేస్తూ, గొర్రెలు కాస్తూ జీవించిన ఆయనకు మట్టిపై, మనుషులపై అప్పుడే మమకారం కలిగింది. అదే మమకారం ఆయనలోని కవిని మేల్కొల్పింది. అక్షరాలు చదవకపోయినా, ఆ అక్షరాలకు అర్థం చెప్పినవారు అందెశ్రీ. తన గాత్రంలో, గీతంలో ప్రజల వేదనను మేళవించిన ఆ కవికి పల్లె ఒక విశ్వవిద్యాలయం. అందుకే ప్రజల గుండెల్లో నుంచి వచ్చిన మాటలు, అనుభవాలు, వేదనలు ఆయన కవితలుగా మారాయి.
తెలంగాణ ఉద్యమం మంటలు రగిలిస్తున్న రోజుల్లో అందెశ్రీ గీతాలు ఆ అగ్నికి స్వరరూపాన్నిచ్చాయి. ఆయన రాసిన ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ తెలంగాణ ఆత్మ గీతంగా నిలిచింది. ఆ గీతంలోని ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ అన్న పల్లవిలో తెలంగాణ ఆత్మస్ఫూర్తి, ఆవేదన, ఆశ, ఆత్మగౌరవం సమ్మిళితమై ఉన్నాయి.
‘మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు’ (ఎర్ర సముద్రం సినిమా) గీతం ఆయన మానవతా దృష్టికి ప్రతిరూపం. సమాజంలో విలువలు క్షీణిస్తున్నాయనే ఆవేదనను ఆయన పంక్తులు ఈ విధంగా ప్రతిబింబిస్తాయి. ‘మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు…/ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు…’ ఈ పంక్తుల్లోని భావగర్భిత, మానవవాదం ఆయన కవిత్వంలో ప్రవహించే నది లాంటివి.
అందెశ్రీ పాటలు వినేవారికి వినోదాన్ని మాత్రమే అందించవు; చైతన్యం, ఆత్మపరిశీలన వైపునకు నడిపిస్తాయి. ‘కొమ్మ చెక్కితే బొమ్మరా’ అనే పాటలో గ్రామీణ జీవన సరళిని, ప్రకృతితో మనిషికున్న అనుబంధాన్ని మృదువుగా లిఖించడం అద్భుతమనే చెప్పాలి. ‘పల్లె నీకు వందనములమ్మో’ అంటూ ఆయన పల్లెల జీవనతత్త్వాన్ని కీర్తించారు. ‘జనజాతరలో మన గీతం’, ‘యెల్లిపోతున్నావా తల్లి’ వంటి గీతాలు ఆయనలోని మానవతా కవిత్వానికి చిహ్నాలు. ఆ పాటల్లోని పదజాలం మానవ సంబంధాల లోతును, సానుభూతిని ప్రతిబింబిస్తాయి. 2006లో వచ్చిన గంగి చిత్రంలోని ‘ఎల్లిపోతున్నావా తల్లి, మసకబారిన జాబిల్లి’ పాటకు నంది అవార్డు వచ్చింది. 2008లో కాకతీయ విశ్వవిద్యాలయం అందెశ్రీకి గౌరవ డాక్టరేట్ అందజేసింది. అనంతరం అమెరికా అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ సంస్థ ఆయనకు ‘లోక కవి’ బిరుదును ప్రదానం చేసింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ పాత్ర అమోఘం. ఆయన పాటలు కేవలం సాహిత్య సృష్టులు కాదు, అవి ఉద్యమ గీతాలు, ప్రజల ఊపిరి కూడా. తెలంగాణ ధూంధాం వంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఆయన ప్రజల్లో స్వాభిమానాన్ని రగిలించారు. కవిగా మాత్రమే కాదు, సాంస్కృతిక విప్లవకారుడిగా కూడా ఆయన ప్రజల గుండెల్లో నిలిచారు.
2014లో నాటి తెలంగాణ ప్రభుత్వం అందెశ్రీ పేరును పద్మశ్రీ పురస్కారానికి సిఫారసు చేసింది. అందెశ్రీ కవిత్వం మట్టి నుంచి మొలిచింది, మట్టివాసనతో పరిమళించింది. ఆయన గీతాలు మనిషి బతుకు బాటలోని దుఃఖానందాలను, ప్రేమను, ఆవేదనను, పోరాటాన్ని ప్రతిబింబిస్తాయి. ఆయన కవిత్వంలో పుస్తకాల పదజాలం లేదు, పల్లెల మాటలే ఉన్నాయి. అదే ఆయన కవిత్వానికి ప్రాణం. అందెశ్రీ కవిత్వం తెలంగాణ గళం, ప్రజల హృదయం, మట్టికొలిమి నుంచి ఉద్భవించిన మన ఆత్మగీతం. 2025, నవంబర్ 10న అందెశ్రీ పరమపదించినా, ఆయన స్వరం తెలంగాణ గాలిలో, జలంలో, భూమిలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.
– (వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్) రామకిష్టయ్య సంగనభట్ల