భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ దేశంలో తలెత్తిన ఒక చిన్న రాజకీయ కుదుపు న్యాయవ్యవస్థలో ఉన్న గణనీయమైన విభజనలను బహిర్గతం చేసింది. ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రత, మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల మధ్య సంక్లిష్టమైన సమతుల్యత గురించిన ఆందోళనలను రేకెత్తించింది. 2011లో సల్వా జుడుం తీర్పులో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రతిపక్ష అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి పాత్రను ప్రస్తావిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన విమర్శలు భిన్నాభిప్రాయాలకు దారితీశాయి. అంతేకాదు, పదవీ విరమణ చేసిన న్యాయమూర్తుల మధ్య విభజనకూ ఇది కారణమైంది.
బీజేపీ పాలనలో దశాబ్దానికి పైగా కార్యనిర్వాహక అతిక్రమణ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ సంఘటన న్యాయవ్యవస్థ సమగ్రతను కాపాడటం, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థలో కీలకమైన సమతుల్యతలను నిలబెట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్నది. జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ప్రతిపక్ష ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా నక్సలిజాన్ని ప్రోత్సహిస్తున్నదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించడంతో ఈ వివాదం చెలరేగింది. 2011లో నందిని సుందర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్‌గఢ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమిత్ షా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మద్దతిచ్చిన మావోయిస్టు వ్యతిరేక గ్రూప్ సల్వా జుడుం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఈ తీర్పులో పేర్కొంది. పౌరుల చేతికి ఆయుధాలు ఇవ్వడం మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని, ప్రత్యేకించి ఆర్టికల్ 21 (జీవించే హక్కు) ఉల్లంఘన అని న్యాయమూర్తులు జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, జస్టిస్ ఎస్.ఎస్.నిజ్జార్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఇది వామపక్ష తీవ్రవాదాన్ని అరికట్టడానికి బదులుగా హింసను తీవ్రతరం చేసిందని ఆ తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది. సల్వా జుడుం రద్దు నక్సల్ కార్యకలాపాలను మరింతగా పెంచిందని, జస్టిస్ సుదర్శన్‌రెడ్డి వెలువరించిన తీర్పు నక్సల్స్ పట్ల సానుభూతితో ఉందని అమిత్ షా అన్నారు. అయితే, రాజకీయ లబ్ధి కోసం న్యాయ విచక్షణను వక్రీకరించడంగా ఈ ఆరోపణలను విమర్శకులు భావిస్తున్నారు.
అమిత్ షా వ్యాఖ్యలు అంతర్గత భద్రతపై బీజేపీ కఠిన వైఖరికి అనుగుణంగా ఉన్నప్పటికీ, ఎన్నికల రాజకీయ రంగంలో న్యాయస్థానాల తీర్పులను ప్రశ్నించడం ప్రమాదకరం అవుతుంది. రాజకీయాల్లోకి వచ్చే వారు తమ గత చర్యలపై సమీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న అమిత్ షా వ్యాఖ్యలను సమర్థిస్తూ బీజేపీ నేతలు వాదిస్తున్నారు. అయినప్పటికీ, ఈ ఘటన ఒక్కటే కాదు, రాజకీయ లబ్ధి కోసం న్యాయ చరిత్రను పాలకులు ఉపయోగించుకునే విధానాన్ని ఇది తెలియజేస్తున్నది. అంతేకాదు, ఇది కోర్టులపై ప్రజలకున్న నమ్మకాన్ని క్షీణింపజేసే ప్రమాదముంది.
ఈ వివాదం సత్వరమే తీవ్ర విభేదాలకు దారితీసింది. ఒకవైపు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ అభయ్ ఓకా వంటి 18 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు షా వ్యాఖ్యలను ఖండించారు. ‘దురదృష్టకరం, అసమంజసం, పక్షపాతం, సల్వా జుడుం తీర్పును తప్పుగా అర్థం చేసుకోవడం’గా పేర్కొంటూ వారు ఒక ప్రకటన విడుదల చేశారు. రాజకీయ వాదనల్లో సంయమనం పాటించాలని, న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ‘తీవ్ర ప్రభావాన్ని’ నివారించాలని వారు కోరారు. న్యాయమూర్తుల తీర్పులను ప్రస్తావిస్తూ ఇలా వారిపై మాటల దాడి చేయడం చట్టబద్ధమైన పాలన సూత్రాన్ని బలహీనపరుస్తుందని తేల్చిచెప్పారు. ఇటువంటి విమర్శలు రాజకీయ అధికారానికి వ్యతిరేకంగా న్యాయవ్యవస్థ పాత్రను బలహీనపరుస్తాయని వాదించారు.
దీనికి విరుద్ధంగా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ పి.సదాశివం, జస్టిస్ గొగోయ్ సహా 56 మంది మాజీ న్యాయ మూర్తుల నుంచి మరో ప్రకటన వెలువడింది. పైన పేర్కొన్న 18 మంది బృందం ‘న్యాయ వ్యవస్థ స్వేచ్ఛ పరిభాషతో రాజకీయ పక్షపాతానికి ముసుగు తగిలించార’ని అందులో పేర్కొన్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించే న్యాయమూర్తులు తమ రికార్డులను సమర్థించుకోవాలని, న్యాయవ్యవస్థను వైరిపక్ష చర్చల్లోకి లాగకూడదని అన్నారు. ఇలాంటి చర్యల వల్ల మాజీ న్యాయమూర్తులు ‘పక్షపాత కోటరీ‘గా కనిపించే అవకాశం ఉందని
హెచ్చరించారు. న్యాయ నిష్పాక్షికత అవసరాన్ని ఈ బృందం నొక్కిచెప్పింది.
‘18 వర్సెస్ 56’ అనే ఈ విభజన న్యాయవ్యవస్థలో ఒక భావజాల చీలికను, బహుశా సమాజంలోని విస్తృత విభజనలను ప్రతిబింబిస్తుందని చెప్పవచ్చు. రాజ్యాంగ హక్కుల గురించి ప్రగతిశీల వివరణలు ఇస్తూ, దేశ భద్రతా చర్యల కంటే మానవ హక్కులకు మొదటి బృందం ప్రాధాన్యం ఇచ్చింది. జస్టిస్ గొగోయ్ (తన పదవీకాలంలో వివాదాస్పద తీర్పులతో ప్రసిద్ధి చెందిన జడ్జి) వంటి వారితో కూడిన రెండవ బృందం సంస్థాగత సంయమనం, రాజకీయాల్లో జోక్యం చేసుకోకపోవడాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. ఇటువంటి విభజనలు ముందుకురావడం ఆందోళనకరం. ఎందుకంటే అవి న్యాయమూర్తులను నిష్పక్షపాత న్యాయనిర్ణేతలుగా కాకుండా సైద్ధాంతిక ఆధారిత వ్యక్తులుగా చూపుతాయి. ఇది కార్యనిర్వాహక దుర్వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించే అవకాశం ఉంది.
గత 11 ఏండ్లుగా (2014-2025) బీజేపీ పాలనలో కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కోణంలో ఈ ఘటనను చూడాలి. కేంద్రంలో అధికారంలోకి మోదీ సర్కారు వచ్చినప్పటి నుంచి కొలీజియం సిఫారసులను ఆలస్యం చేయడం, నామినేట్ చేసిన పేర్లను అడ్డుకోవడం, ప్రతికూల తీర్పులపై బహిరంగంగా విమర్శలు గుప్పించడం లాంటి చర్యల ద్వారా న్యాయ స్వయంప్రతిపత్తిని క్రమంగా బలహీనపరిచారనేది విశ్లేషకుల వాదన. న్యాయమూర్తుల ఎంపికలో కేంద్ర పాలకులకు ఓటు హక్కు కల్పించడానికి ఉద్దేశించిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ)-2015 చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా పేర్కొంటూ సుప్రీంకోర్టు కొట్టివేయడం అందుకు ఉదాహరణ. అయినప్పటికీ జడ్జీల నియామకాల్లో ఆలస్యం కొనసాగుతూనే ఉన్నది. 2025 నాటికి హైకోర్టు జడ్జీల పోస్టుల్లో 30 శాతానికి మించి ఖాళీలున్నాయి.
కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు దీన్ని ‘నియంతృత్వంతో రాజ్యాంగాన్ని కళంకం చేయడం’గా విమర్శించాయి. అసమ్మతిని అణచివేయడం, మైనారిటీ వర్గాల హక్కులను కాలరాయడంగా పేర్కొన్నాయి. జర్నల్ ఆఫ్ డెమోక్రసీ వంటి అంతర్జాతీయ సంస్థల పరిశీలకులు భారతదేశం ‘ఎన్నికల నిరంకుశత్వం’ వైపు జారుతున్నదని అంటున్నారు. అధికార శక్తులను బలోపేతం చేయడానికి న్యాయవ్యవస్థ స్వాతంత్య్రం రాజీపడుతున్నదని చెప్పారు. బీజేపీ తన పటిష్ఠమైన పాలన భద్రత, ఆర్థిక రంగాల్లో ఫలితాలను ఇచ్చిందని చెప్తున్నప్పటికీ, న్యాయవ్యవస్థతో దాని ఘర్షణలు భారతదేశ రాజ్యాంగ వ్యవస్థలను బలహీనపరిచే ప్రమాదముంది. శాసనసభ, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు పరస్పరం ఒకదానిపై మరొకటి ఆధారపడినప్పటికీ, వాటిని మన రాజ్యాంగం స్వతంత్ర సంస్థలుగా రూపొందించింది. శాసనసభ చట్టాలు చేస్తుంది. కార్యనిర్వాహక వ్యవస్థ వాటిని అమలు చేస్తుంది. న్యాయవ్యవస్థ రాజ్యాంగ హక్కులను రక్షిస్తుంది. అమిత్ షా చేసిన విమర్శలు ఈ వ్యత్యాసాలను అస్పష్టం చేస్తాయి. న్యాయస్థానాల తీర్పులను రాజకీయం చేసే విధానాన్ని ప్రోత్సహిస్తాయి. ఆత్యయిక స్థితిలో న్యాయమూర్తుల బదిలీ వంటి చారిత్రక సంఘటనలను ఇవి గుర్తుకుతెస్తాయి.
కార్యనిర్వాహక విమర్శలు సహేతుకంగా, వాస్తవాల ఆధారంగా ఉండాలి. న్యాయ సమగ్రతను ప్రశ్నించే వాగాడంబరాన్ని నివారించాలి. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తుల మధ్య వచ్చిన ఈ విభజన విభిన్న దృక్పథాలను ప్రతిబింబిస్తున్నప్పటికీ, వర్గ వాదాన్ని పెంచే ప్రమాదం ఉంది. పదవీ విరమణ తర్వాత న్యాయమూర్తులకు బలమైన నైతిక ప్రమాణాలు పాటించాల్సిన అవసరాన్ని ఇది నొక్కిచెప్తుంది.
వ్యవస్థల మధ్య సమతుల్యతను పునరుద్ధరించడానికి కొలీజియంలో పారదర్శకతను పెంపొందించడం, న్యాయ నియామకాలను వేగవంతం చేయడం, పదవీ విరమణ తర్వాత గవర్నర్ లాంటి పదవుల ప్రలోభాల నుంచి న్యాయమూర్తులకు రక్షణ కల్పించడం వంటి వ్యవస్థాగత సంస్కరణలు చాలా కీలకం. న్యాయవ్యవస్థ ధైర్యంగా, సహేతుక తీర్పుల ద్వారా తన స్వయంప్రతిపత్తిని నిలబెట్టుకోవాలి. అయితే, కార్యనిర్వాహక వర్గం నిరంకుశ ధోరణులను నివారించడానికి సంస్థాగత సరిహద్దులను గౌరవించాలి. మొత్తం మీద జస్టిస్ సుదర్శన్‌రెడ్డి చుట్టూ ముసురుకున్న ఈ వివాదం భారతదేశ ప్రజాస్వామ్య సూత్రాలకు విస్తృతమైన సవాళ్లను ప్రతిబింబిస్తున్నది. న్యాయ పవిత్రతను కాపాడటమంటే వ్యక్తులను రక్షించడం కాదు, అతిక్రమణల నుంచి రక్షించేందుకు వ్యవస్థను బలోపేతం చేయడం. భారతదేశం మరో ఎన్నికల ఘట్టానికి సమీపిస్తున్నందున, మూడు స్తంభాలు పరస్పర గౌరవం పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించాలి. గణతంత్ర మూలాలను భావజాల చీలికలు క్షీణింపజేయకుండా చూసుకోవాలి. అప్పుడే భార తదేశం రాజ్యాంగంలోని న్యాయం, సామాజిక, ఆర్థిక, రాజకీయ దృక్పథాన్ని సాకారం చేసుకోగలుగుతుంది.
(వ్యాసకర్త: పూర్వ సీనియర్ ఎడిటర్, ది ఎకనామిక్ టైమ్స్, హైకోర్టు అడ్వకేట్)
-సీఆర్ సుకుమార్