తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు కీలకమైన కృష్ణానదితో పాటు తుంగభద్ర, కొన్ని ఉప నదులపై నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టు మూలంగా లక్షల కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి. నిర్వాసితుల త్యాగాలపై నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టు మరోసారి ప్రజల జీవితాలను ఎండబెట్టబోతున్నది. శ్రీశైలం కనీస నీటి మట్టం నిబంధనలకు విరుద్ధంగా ఖాళీ అవుతున్నా మౌనంగా ఉండి ప్రభుత్వాలు రేపటి భవిష్యత్తును ప్రశ్నార్థకంలోకి నేట్టివేస్తున్నాయి.
Telangana | ఈ ఎడాది వర్షాలు బాగా పడ్డాయి. ఎగువ ప్రాంతం నుంచీ వరద జలాల ఉధృతి అధికంగా వచ్చింది. అందరూ భావించినట్టే రైతులు కూడా రెండు పసళ్ల పంటలను సాగుచేసుకోచ్చని సంబురపడ్డారు. కానీ, పరిస్థితి ఇందుకు భిన్నంగా కన్పిస్తున్నది. శ్రీశైలం నీటిమట్టం అతివేగంగా కనిష్ఠ స్థాయికి చేరుకుంటున్నది. సాగునీటికి ఢోకా ఉండదని భావించినవాళ్లు తాగు నీటి కోసం మదన పడుతున్నారు. మళ్లీ చెలిమెలకు పని చెప్పే కాలంతో పాటు బోరుబావుల చుట్టూ బిందెలతో పరుగులు తీసేకాలం వస్తుందేమోనని భయపడుతున్నారు. దీనికి కారణం శ్రీశైలం నీటిని ఏపీలోని పోతిరెడ్డిపాడుకు తరలిస్తుండటమే. ముఖ్యంగా యంజీఎల్ఐ ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథకు నీళ్ల కేటాయిం పు జరుగుతున్నది. ఈ నీళ్లు ఆగిపోతే దక్షిణ తెలంగాణ గొంతెండుతుంది. ఉన్న కాస్త నీళ్లను సాగు అవసరాలకు వాడుకోలేక తెలంగాణ రాష్ర్టానికే కాక దేశ విదేశాలకు ఎగుమతి చేసే మామిడితోటలు, ఆయిల్‌పాం తోటలు నీటి ఎద్దడితో ఎండిపోయే ప్రమాదం ఉన్నది.
తెలంగాణ ప్రభుత్వం మాత్రం రాజకీయాలతో కాలక్షేపం చేస్తున్నది. రాష్ట్రంలోని హైదరాబాద్ మినహా మిగిలిన భూ భాగమంతా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నది. దీంతో సాగునీటి ప్రాముఖ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, తప్పనిసరి పరిస్థితిలో సాగునీటి గురించి ఆలోచించవలసిన అవసరం తెలంగాణ మేధావుల భుజస్కంధాలపై ఉన్నదని గుర్తుచేస్తున్నాను. ఎందుకంటే వరద జలాలను వినియోగించుకోవడంలో లోపం జరిగింది. ఉన్న జలాలను సైతం వినియోగంలో తెచ్చేందుకు ప్రభుత్వం శక్తి సామర్థ్యాలను వెచ్చించలేదు. ఉమ్మడి ఏపీలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జలయజ్ఞం పేరుతో సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. జలయజ్ఞంపై ఆరోపణలు వచ్చినా, ఆచరణలో రైతులకు కొంతమేర సాగు నీరందింది. నీళ్ల కోసం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మొదటి ప్రయత్నంలో చెరువుల పూడికలతో పాటు గత ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టుల పెండింగ్ పనులను పూర్తిచేయడంతో పాటు నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి అనతికాలంలోనే రైతులకు సాగునీళ్లిచ్చారు. తద్వారా బీడు భూముల్లో పచ్చగా కళకళలాడాయి. ఒకప్పటి కరువు నేల నేడు అన్నపూర్ణ నేలగా ధాన్యపురాశులతో వెలుగొందుతున్నది. కానీ, పాలకులు మారినప్పుడు వారి ఆలోచనా విధానం మార్చుకుంటున్నారు. ఆ ఆలోచన అభివృద్ధి కోసమైతే ఫర్వాలేదు కానీ, గత పాలకులు చేసిన మంచి పనిని కొనసాగించేందుకు వెనుకాడుతుండటమే బాధాకరం.
పోతిరెడ్డి పాడు నుంచి రోజుకు 24 వేల క్యూసెక్కుల నీళ్లు అంటే దాదాపు రెండు టీఎంసీల కృష్ణానది నీళ్లను తరలిస్తున్నారు. మూడు టీఎంసీల వరకు కూడా నీళ్లను తరలించే మెకానిజం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు ఉన్నది. కానీ, మన మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకంలోని ఐదు మోటర్లలో ఒక్క అదనపు మోటరు మినహా నాలుగు మోటర్లు రోజంతా కృష్ణానది నీళ్లను ఎత్తిపోసిన 4 వేల క్యూసెక్కులకు దాటదు. కానీ, గత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాన్ని శ్రీకారం చుట్టడం కాక తొమ్మిది బాహుబలి మోటార్లలో ఒక్క బాహుబలి మోటర్తోనే మొదటి రిజర్వాయర్‌లోకి నిబంధనల ప్రకారం మూడో వంతు రెండు టీఎంసీల కృష్ణా నీళ్లను ఎత్తిపోశారు. మళ్లీ ఈ ఏడాది కూడా నిబంధనల ప్రకారం రెండు టీఎంసీల నీళ్లను రిజర్వాయర్‌లోకి ఎత్తిపోయాలి. కానీ, బహుశా ప్రభుత్వం కక్ష రాజకీయాలతో తీరిక లేకుండా ఉండటంతో సాగునీటి అవసరాల సంగతి మర్చిపోయినట్టున్నది.
ఏడాది కాలంలో చిన్న చిన్న పెండింగ్ పనులను పూర్తిచేసి ఉంటే ఈరోజు పోతిరెడ్డిపాడుకు దీటుగా కృష్ణానది నీళ్లతో నెర్రెలు బారిన నేలల దాహం తీర్చే అవకాశం ఉండేది. కానీ, ప్రస్తుతం 875 అడుగుల నీటి మట్టం ఉన్న పోతిరెడ్డి పాడు నుంచి నిరంతరం నీటి తరలింపు కొనసాగుతున్నది. 830 అడుగుల వద్ద తాగు నీటి అవసరాల కోసం నిల్వ ఉంచాలనే నిబంధనలున్నా, వాటిని పట్టించుకోకుండా శ్రీశైలంను ఖాళీ చేస్తున్నారు. ప్రభుత్వాలకు ముందుచూపు లేకపోవడంతోనే శ్రీశైలంలోని నీళ్లను ఖాళీ చేస్తున్నారనుకుంటే పొరపాటు పడినట్టే. ఆ తరలింపులు ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నవే. ఈ జలదోపిడీపై మేధావులు, నిపుణులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
-సీపీ నాయుడు
85199 91515