తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడి తెచ్చుకున్నస్వరాష్ట్రంలో నేడు ప్రజాస్వామ్యం నవ్వుల పాలవుతున్నది.ఎన్నికలకు ముందు ఇచ్చిన భారీ హామీలను అమలుచేయడంలోప్రభుత్వానికి చిత్తశుద్ధి కనిపించడం లేదు. పాలనలో అనుభవం లేదు. అధికారంలో స్థిరత్వం లేదు. నైతిక విలువలు అసలే లేవు.
పాత పథకాలు అమలు చేయాలంటే అహం అడ్డం వస్తున్నది.
తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన పథకాలన్నీ కేసీఆర్ ముద్రతో వెలుగొందినవే. రైతుబంధు, కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు, దళితబంధు, మిషన్ భగీరథ ఇవన్నీ తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పథకాలు. కానీ, ఇవి అమలుచేస్తే కేసీఆర్‌కు పేరొస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది. ఆ అహమే ఈ ప్రభుత్వానికి అడ్డంకిగా మారింది. కొత్త పథకాలు అమలు చేసే తెలివి ఈ ప్రభుత్వానికి లేదు. పాలన అంటే పాత ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు. ప్రజా సమస్యలు తీర్చడం. అవసరమైన కొత్త పథకాలను అమలు చేయడం. కానీ, ఈ ప్రభుత్వ పాలనలో సృజనాత్మకత లేకుండా పాత పథకాలను నిలిపివేయడం తప్ప మరో పనేదీ చేయడం లేదు.
ప్రతిపక్షంలో ఉన్న ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్‌లా కనిపిస్తున్నారు. హరీశ్‌రావు, కేటీఆర్, కవిత ఇలా బీఆర్ఎస్ నేతలు ప్రతి ఒక్కరూ కేసీఆర్‌లా విజృంభిస్తున్నారు. ప్రభుత్వం నుంచి మాత్రం ఒక్క మేధావీ కనిపించడం లేదు. ఒక్క రోజు కూడా మంత్రిగా పనిచేయని రేవంత్‌రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడం తెలంగాణ ప్రజల దురదృష్టం. సీనియర్ నేతల అభిప్రాయాన్ని ఆయన లెక్కచేయరు. సహచర మంత్రులకు గౌరవం లేదు. అధిష్ఠానం నుంచి గట్టి మద్దతు లేదు. పాలన ఎలా చేయాలో తెలియదు. పక్కనే ఉన్న కేసీఆర్‌ను అడిగేందుకు ధైర్యం రావడం లేదు. మాట్లాడితే బూతులు. ప్రజా సమస్యలను దాటవేసేందుకు డైవర్షన్ పాలిటిక్స్. ఇవి తప్ప ఈ ప్రభుత్వంలో ఇంకేమీ లేవు.
తెలంగాణకు కావాల్సింది కేసీఆర్ లాంటి మేధావి పాలన. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలకు ఒకే ఒక్క పరిష్కారం కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం. రాష్ర్టాన్ని అణువణువునా అర్థం చేసుకున్న కేసీఆర్ అభివృద్ధిని తన ఊపిరిగా మార్చుకున్నారు. తెలంగాణ గర్వించదగిన నేత ఆయన. ప్రస్తుత ప్రభుత్వానికి ప్రతిపక్షాల విమర్శలను తట్టుకునే ధైర్యం లేదు. ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి లేదు. అందుకే ఇప్పుడు తెలంగాణలోని ప్రతి గుండె కేసీఆర్‌ను కోరుకుంటున్నది. తమను రక్షించాలని వేడుకొంటున్నది.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ యూత్ లీడర్, వరంగల్ జిల్లా అధ్యక్షులు)
-నరేష్ మైనాల