‘ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగుపడద’నే సూక్తి అనాది నుంచే పెద్దలు చెప్తున్నారు. అందుకే, నాటి శాతవాహన, కాకతీయుల వంటి రాజుల హయాం నుంచి నిన్నటి తెలంగాణ జాతిపిత కేసీఆర్ పాలనాకాలం వరకూ ఇదే సూత్రాన్ని అనుసరించి పాలన చేశారు. అయితే, దురదృష్టవశాత్తు కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతీసారి దీనికి వ్యతిరేకంగా పాలన సాగుతుండటం బాధాకరం.
‘ప్రజాపాలన’ అని పేరు పెట్టుకొని, మాది రైతురాజ్యం అని నాటకాలాడే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అన్ని కోతలే మిగిలాయి. ఓ వైపు యూరియా కొరత, మరోవైపు కరెంటు కోత వెరసి రాష్ట్రంలో రైతాంగం అవస్థల పాలవుతున్నది. పంటను కొనలేమని చేతులేత్తేసిన కాంగ్రెస్ సర్కారు బోనస్‌ను బోగస్‌ను చేసింది. రైతులకు పంటనే దక్కకుండా చేస్తే ఏ గోల ఉండదన్నట్టుగా ఇప్పుడు ఎరువులను సైతం అందించలేకపోతున్నది. ఏటా ఏడు లక్షల మెట్రిక్ టన్నులు కూడా వాడని తెలంగాణను సాగు విస్తీర్ణం పెంచి దాదాపు 27 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాడకానికి పెంచితే.. ఈ సీజన్లో ఈ కేంద్ర, రాష్ట్ర పాలనా వైఫల్యం, ముందుచూపు లేనితనం వల్ల ఇప్పటివరకూ తెలంగాణకు కేటాయించింది తొమ్మిదిన్నర లక్షల మెట్రిక్ టన్నులే. అందులోనూ వచ్చింది 5 లక్షల మెట్రిక్ టన్నులు కూడా దాటకపోవడమే నేటి యూరియా సమస్య తీవ్రతను తెలియజేస్తుంది.
ఓవైపు సీజన్ దాటిపోతుంది, ఎరువు అందకపోతే పంట ఎండిపోతుంది. పైసా పైసా కూడబెట్టుకున్నదంతా పెట్టుబడిగా పెట్టి నాట్లేసిన రైతన్న, సమయానికి ఎరువులందకపోవడంతో మలమల మాడుతూ పంటలెండిపోతుంటే కన్నీరు కారుస్తున్నాడు. కన్నబిడ్డలా పెంచుకున్న పైరు తన ముందే రంగుమారి, జవజీవాలను కోల్పోతుంటే తల్లడిల్లిపోతున్నాడు. ఒక్క బస్తా యూరియా కోసం ఇక్కడా, అక్కడా అని కాదు.. ఆదిలాబాద్ నుంచి నల్లమల కొండల దాకా అదే పనిగా తిరిగి చివరికి తనువు సైతం చాలిస్తున్నాడు.
ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎలాంటి పాషాణ హృదయుడినైనా కన్నీళ్లు పెట్టిస్తాయి. అయ్యో పాపం అనిపిస్తాయి, కానీ 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలకు మాత్రం చీమకుట్టినైట్టెనా కావడం లేదు. నేటి రాష్ట్ర, కేంద్ర పాలకులు ఒకరి మీద ఒకరు నెపం తోసి తప్పించుకుంటున్నారు. ఇంక కొందరు నాయకులేమో యూరియా కోసం అల్లాడుతున్న రైతన్నలను చూసి రాజకీయ ప్రత్యర్థులంటున్నారు. తిన్నదరగక లైన్లలో ఉంటున్నారని ఒకరంటారు. వచ్చే పంట కోసం దాచుకుంటున్నారని ఇంకొకరంటారు. అసలు యూరియా కొరత లేనే లేదు, అంతా డ్రామా అని మరొకరంటారు. ఇక ఏకంగా ముఖ్యమంత్రేమో ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసినా రైతన్నకు బస్తా యూరియా అందించలేకపోతున్నారు.
కడుపు రగిలి అన్నదాత ఆవేదనతో చేసే ఆర్తనాదాలను మాత్రం మన్నించవద్దంటారు ముఖ్యమంత్రి రేవంత్. దేశద్రోహం కేసులు బనాయించి జైళ్లలో పెట్టమంటున్నారు. ఇక మరో వారం రోజుల్లో వానకాలం పంటల కొనుగోళ్లకు ఏర్పాట్లు మొదలు పెడుతున్నామని చెప్తున్న ప్రభుత్వమే పంట చివరిదశకు వచ్చేవరకూ కనీసం యూరియాను కూడా అందించలేని దుస్థితి తెలంగాణలో మాత్రమే కన్పించడం విచారకరం. నిన్నటికి నిన్న ఒక ఎమ్మెల్యే సిబ్బంది ఏకంగా లారీ లోడ్ యూరియాను మళ్లిస్తే శిక్షించాల్సింది పోయి, మిన్నకుండిపోయారు ప్రభుత్వ పెద్దలు. సగటు తెలంగాణ వాది మదిలో ఇందుకా ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చుకున్నది, ఇందుకా విద్యార్థులు బలిదానాలు చేసి మనకు రాష్ర్టాన్ని అందించిందనే ఆవేదన మొదలవుతున్నది. ఇప్పటికైనా చేతనైతే కష్టాలు పెట్టకుండా పాలించండి, చేతగాకుంటే దిగిపోండి అని ప్రజలు ప్రభుత్వాన్ని గద్దిస్తుండటం గమనార్హం.
– (వ్యాసకర్త: రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్)
డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి 95530 86666