దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సర్వ మతాలకు ప్రాధాన్యం ఇస్తూ మూడు ప్రధాన మతాల ప్రార్థనా మందిరాలు నిర్మించి అందుబాటులోకి తీసుకురావడం సంతోషించదగిన విషయం. దీని కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అన్ని మతాలవారు ధన్యవాదాలు తెలుపుతున్నారు. అసలు దేశంలోని ఏ రాష్ట్ర సచివాలయంలోనూ ప్రార్థనా మందిరాలు లేవు! సర్వ మత సమానత్వం గురించి గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లోని సచివాలయాల్లోనూ ఇలా ప్రార్థనా మందిరాలు లేవు!
మనిషికి రెండు కనులు ఏ విధంగా సమానమో.. అన్ని మతాలు తనకు సమానమని తన చేతల ద్వారా తెలంగాణ సీఎం కేసీఆర్ నిరూపించారు. ఏ మతానికి చెందిన ప్రజలు బాధపడొద్దని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో క్రైస్తవులు ప్రార్థన చేసుకోవడడానికి చర్చి, హిందువులు పూజలు చేసుకోవడానికి నల్ల పోచమ్మ దేవాలయం, ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి మసీదు నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చారు. చర్చిలు కూలగొడుత.. మసీదులు పడగొడుత అని రెచ్చగొట్టే నేతలున్న మన దేశంలో అన్ని మతాల వారికి సమాన అవకాశాలు ఇచ్చే కేసీఆర్ వంటి నేతలు ఉండటం ప్రశంసనీయం. ఆయన దేశ రాజకీయాల్లోకి వచ్చి దేశ భవిష్యత్తు మార్చాలని, మత సామరస్యాన్ని నెలకొల్పాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. అసలు క్రైస్తవులకు కేసీఆర్ ఎంత మేలు చేశారో తెలుసుకునే ముందు గతంలో ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలు ఏ విధంగా క్రైస్తవులను నిర్లక్ష్యం చేశాయో తెలుసుకోవాలి. గత ప్రభుత్వాలు క్రిస్మస్ వేడుకలను పెద్దగా పట్టించుకునేవి కాదు. కేవలం 40 లేదా 50 మంది క్రిస్టియన్ నాయకులు, మత పెద్దలను పిలిచి తేనేటి విందు ఇచ్చి మమ అనిపించేవారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఏటా ఎల్బీ స్టేడియంలో దాదాపు 15 వేల మందితో అధికారికంగా క్రిస్మస్ వేడుకలు జరపడమే కాకుండా వారితో కలిసి క్రిస్మస్ ప్రేమ విందులో పాల్గొంటున్నారు. ఏటా దాదాపు 2.85 లక్షల కుటుంబాలకు క్రిస్మస్ కానుకలు ఇవ్వడంతో పాటు క్రిస్మస్ వేడుకల కోసం ప్రతి నియోజకవర్గానికి రూ. 2 లక్షల నిధులు కేటాయిస్తున్నారు.
2 వేల మంది క్రిస్టియన్ మహిళలకు, 20 వేల మంది మైనారిటీ మహిళలకు ఉపాధి కల్పించేందుకు కుట్టు శిక్షణ ఇవ్వడంతో పాటు ఉచితంగా కుట్టు మిషన్ యంత్రాలను అందజేయనున్నట్లు సీఎం ఇటీవల ప్రకటించారు. దీని వల్ల సదరు మహిళలు స్వయం ఉపాధి పొంది వారి కుటుంబానికి చేదోడుగా నిలుస్తారు. దళిత బంధు, బీసీలకు ఆర్థిక సాయం మాదిరి మైనారిటీలకు 100 శాతం సబ్సిడీతో రూ.లక్ష ఆర్థిక సాయం అందించేందుకు సీఎం ప్రణాళికలు రచించారు. ఈ నెల 19న ఈ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు.
అసలు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏ మతస్థుల పండుగలపైనా వివక్ష చూపడం లేదు. హిందువులు జరుపుకొనే బోనాలు, బతుకమ్మ పండుగ, ముస్లింలు జరుపుకొనే రంజాన్, క్రైస్తవులు జరుపుకొనే క్రిస్మస్ పండుగల పట్ల రాష్ట్ర సర్కార్ తొమ్మిదేండ్ల కాలంలో ఏనాడూ వివక్ష చూపించలేదు. ప్రతి పండుగ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. బోనాల సందర్భంగా అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తున్నది. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తున్నది. క్రైస్తవుల కోసం ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నది. ప్రతి సామాజికవర్గంతో పాటు క్రైస్తవులకు సైతం ఆత్మగౌరవ భవనం ఉండాలని పరితపించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ మాత్రమే. ఇందుకోసం ఉప్పల్ భగాయత్‌లో రెండు ఎకరాల స్థలం కేటాయించడంతో పాటు రూ.10 కోట్లు మంజూరు చేశారు. రాష్ట్రంలో నూతన చర్చిల నిర్మాణానికి కూడా రాష్ట్ర సర్కార్ వెన్నుదన్నుగా నిలుస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 411 చర్చిల నిర్మాణానికి రూ.32.63 కోట్లు కేటాయించింది. క్రిస్టియన్ యువత ఉపాధి కోసం డ్రైవర్ ఎంపవర్మెంట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో శిక్షణ పొందినవారికి వాహనం కొనుగోలు ధరలో 60 శాతం రాయితీ ఇచ్చి అండగా ఉంటున్నది. ఇప్పటికే 154 మంది లబ్ధిదారులకు రూ.6.9 కోట్ల రాయితీ అందజేసింది.
రాష్ట్ర పరిపాలనా సౌధమైన సచివాలయం ప్రారంభోత్సవంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే ప్రతి నూతన జిల్లాలోని కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సవాల్లోనూ సర్వ మత ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలు సమానమే అని సీఎం కేసీఆర్ నిరూపిస్తున్నారు. గంగా జమునా తెహ్‌జీబ్‌కు నిదర్శనంగా తెలంగాణ ప్రజలు మతాలను మరిచి సంతోషంగా జీవిస్తున్నారు.
(వ్యాసకర్త: చైర్మన్, తెలంగాణ ఫుడ్స్)