దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు మామునూరు విమానాశ్రయం ముందుకు కదలడం శుభపరిణామం. స్వాతంత్య్రం కంటే ముందే దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా మన మామునూరు విమానాశ్రయం పేరుగాంచింది. అనేక రాష్ర్టాలకు విమానాశ్రయం లేనప్పుడే ఇక్కడ ఉన్నది. చైనా, భారత్ యుద్ధ సమయంలో సైతం ఉపయోగంలో ఉన్నది.
తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రతిపాదనలు పంపగా కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. రెండు ప్రభుత్వాలు పునరుద్ధరణ కోసం పనిచేశాయి. కానీ, అనేక కారణాల వల్ల పనులు అనుకున్న స్థాయిలో ముందుకు పడలేదు. ఆ కృషి ఫలితాలు ఇప్పుడు రావడం, ఎట్టకేలకు ఆమోదం పొందటం శుభపరిణామం. కానీ, దీన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దినప్పుడే ప్రయోజనకరంగా ఉంటుంది. డొమెస్టిక్ ఇచ్చి చేతులు దులుపుకొంటే తర్వాత దోమలు తోలుకోవడం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. డొమెస్టిక్ విమానాశ్రయంగా అభివృద్ధి చేస్తే ఆంధ్రలో కడప, కర్నూల్ విమానాశ్రయాల వలె పడావు పడి నిరుపయోగంగా మారుతుంది. మామూనూరు విమానాశ్రయానికి కాకతీయుల పేరు లేదా ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి. ఈ ప్రాంతాన్ని 400 ఏండ్లు పాలించి, ప్రజలపై చెరగని ముద్ర వేసిన కాకతీయులు ఈ ప్రాంతానికి గర్వకారణం. కాబట్టి, విమానాశ్రయానికి కాకతీయుల పేరు పెట్టడమే సముచితం. లేదా, తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, ఓరుగల్లు బిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కదా అని మళ్లీ రాజీవ్ గాంధీ పేరో, రాహుల్ గాంధీ పేరో పెడితే వరంగల్ ప్రజల మనోభావాలతో ఆడుకున్నట్టే, ఇక్కడి ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసినట్టే అవుతుంది.
కాంగ్రెస్ పాపమే ఇన్నాళ్ల నిరీక్షణకు కారణం. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా తెచ్చిన జీఎంఆర్ ఒప్పందమే ఇన్నాళ్ల నిరీక్షణకు కారణం. కాబట్టి, ఇన్నేండ్లు కాంగ్రెస్ పార్టీ వరంగల్‌కు చేసిన పాపాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా చేసి కడుక్కోవాలి. తెలంగాణ సరిహద్దు రాష్ర్టాలైన ఏపీలో జాతీయ అంతర్జాతీయ విమానాశ్రయాలతో కలిపి 7, కర్ణాటకలో 6, కేరళలో 4, తమిళనాడులో 10, ఆఖరికి అతి చిన్న రాష్ట్రమైన గోవాలో సైతం 2 విమానాశ్రయాలున్నాయి. తెలంగాణలో మాత్రం కేవలం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే నడుస్తున్నది. బేగంపేటలోని విమానాశ్రయాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా మూసివేయడం కారణంగా ప్రస్తుతం సైనిక శిక్షణ కోసం మాత్రమే వాడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన జీఎంఆర్ ఒప్పందంతో ఉమ్మడి వరంగల్ జిల్లా దశాబ్దాల నిర్లక్ష్యానికి గురైంది, అభివృద్ధిలో వెనక్కి నెట్టబడింది. ఇది కొత్తగా తెచ్చిన విమానాశ్రయం కాదు, ఉన్నదాన్ని మూసివేసి, పునరుద్ధరణ చేస్తున్న విమానాశ్రయం మాత్రమే. కాబట్టి ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం మాని పనులను వేగవంతం చెయ్యాలి. వరంగల్ జిల్లాలో ఎన్నో పేరుగాంచిన పర్యాటక ప్రదేశాలున్నాయి. బొగత లాంటి జలపాతాలు, పాకాల, రామప్ప, లక్నవరం లాంటి సరస్సులు, దట్టమైన అడవులు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప, వేయి స్తంభాల ఆలయాలు ఇలా అడుగడుగునా ఆధ్యాత్మికతతో పర్యాటకరంగం మరింత పుంజుకునే అవకాశం ఉం టుంది. టెక్స్టైల్ రంగం అభివృద్ధి చెందటానికి కూడా ఎన్నో అవకాశాలున్నాయి. ఇక్కడ పత్తి అధికంగా పండుతుంది. కాబట్టి, టెక్స్టైల్, అలాగే మన నేతన్నల కళా రూపాలను ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. మిర్చి, మక్కజొన్న పంటలకు కూడా కొదవ లేదు కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేయడం ద్వారా మన రైతులు నేరుగా అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించే అవకాశం కలుగుతుంది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో మడికొండలో ఐటీ హబ్ ఏర్పాటుచేశారు. ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం వస్తే మరింత వేగంగా ఐటీ రంగం ఉమ్మడి వరంగల్ జిల్లాకు విస్తరించే అవకాశం ఉంటుంది. అలాగే భూపాలపల్లి, రామగుండం, కొత్తగూడెంలో బొగ్గు పుష్కలంగా ఉండటం వల్ల వాటి సంబంధిత పరిశ్రమలకు సైతం ఉపయోగకరంగా ఉంటుంది. మౌలిక సదుపాయాలు పెరిగి అభివృద్ధి వేగవంతమవుతుంది.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు)
-ఏనుగుల రాకేష్ రెడ్డి