మూసీ ప్రక్షాళన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఆ నది ఒడ్డున నివసిస్తున్న వేల మంది బడుగు జీవుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నవి.గత్యంతరం లేని అట్టడుగువర్గాల ప్రజలు, ఇండ్లలో పాచి పనులు, చిత్తు కాగితాలు ఏరుకునేవాళ్లు, పూలమ్ముకునేవారు, పారిశుద్ధ్య కార్మికులు, వీధి వ్యాపారులు తదితరులు ఎక్కువగా మూసీ ఒడ్డున నివసిస్తున్నారు.
అత్యంత అపరిశుభ్రమైన, దుర్గంధభరితమైన పరిసరాల్లో వారు ఉంటున్నారు. పైసా పైసా కూడబెట్టుకున్న తమ కష్టార్జితంతో చిన్నపాటి స్థలాన్ని కొనుగోలు చేసి అందులో రేకుల షెడ్డు నిర్మించుకుని గత 30-40 ఏండ్లుగా అక్కడే బతుకుతున్నారు. ప్రభుత్వానికి అన్నిరకాల పన్నులు కడుతున్నప్పటికీ, కనీస మౌలిక వసతులకు కూడా నోచుకోని నిరుపేదల గూళ్లను రాత్రికిరాత్రే కూల్చివేయడం బాధాకరం.
ఒకప్పటి తాగునీటి వనరైన మూసీ నది కాలుష్య కాసారంగా మారడానికి ఉమ్మడి ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణం. ఇండ్లు, పరిశ్రమలు, ఆసుపత్రుల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు, రసాయనాలు యథేచ్ఛగా మూసీలో కలుస్తున్నా నాటి పాలకులు పట్టించుకోలేదు. అందుకే మూసీ మురికికూపంగా మారింది. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లోంచి మూసీ, దామగుండం అడవుల్లో నుంచి ఈసా, కొండకోనల్లో నుంచి పారే చిన్నచిన్న వాగులు, వంకలు ఏకమై మూసీ నదిగా రూపాంతరం చెందాయి. హైదరాబాద్లో మురికికూపంలా కనిపించే మూసీ నది రంగారెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది. 240 కిలోమీటర్లు ప్రయాణించే ఈ నది నల్లగొండ జిల్లాలోని వాడపల్లిలో కృష్ణా నదిలో కలుస్తుంది.
మూసీ నీటితో పండించే కూరగాయలు, పండ్లు, ఆహారధాన్యాలు కూడా విషపూరిత రసాయనాలను కలిగి ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెప్తుండటం ఆందోళనకరం. ప్రజల సంక్షేమం, ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి శ్రద్ధ, చిత్తశుద్ధి ఉంటే కాలుష్యానికి కారణమవుతున్న డ్రైన్లు, పారిశ్రామిక రసాయనాలు, జీవ వ్యర్థాలు మూసీలో కలవకుండా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నాలుగు దశాబ్దాల నుంచి మూసీ ఒడ్డున నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు ప్రత్యామ్నాయ నివాసాలను ఏర్పాటు చేయవచ్చు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం అలా చేయడం లేదు. మలక్పేట నుంచి హయత్నగర్ వరకు నిజాం కాలంలో గడ్డి పెంచుకోవటానికి గొల్లలకు ఇచ్చిన గడ్డి భూములను కబ్జా చేసి లేఔట్లుగా మార్చి రియల్ ఎస్టేట్ మాఫియా సొమ్ము చేసుకున్నది. పేద ప్రజల ఓట్ల కోసం ‘మేమున్నాం.. మీకేం కాదు, ఇల్లు కట్టుకోండి’ అంటూ రాజకీయ నాయకులు వారికి భరోసా ఇచ్చారు. దాంతో రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన సొమ్ముతో పాటు ఊర్లలో ఉన్న అరెకరం, ఎకరం అమ్ముకొని, అప్పోసొప్పో చేసి చాలా మంది నిరుపేదలు స్థలాలు కొని దశాబ్దాల క్రితం మూసీ ఒడ్డున ఇండ్లు కట్టుకున్నారు. ఇప్పుడు సుందరీకరణ పేరిట వారి గూడు చెదరగొట్టి, రెక్కలు విరగొట్టి, తరిమికొడితే వారి గుండె పగలదా? ప్రజా సంఘాల నిజనిర్ధారణ బృందానికి ఎదురైన కన్నీటి గాథలివీ.
మనిషి ఆశాజీవి. కొందరు ఉన్న 53, 83 గజాల స్థలంలోనే లక్షలు ఖర్చు చేసి 2, 3 అంతస్తులు కట్టుకున్నారు. ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఒక్క ఇంట్లోనే వేర్వేరు పోర్షన్లలో ఉంటున్నవాళ్లు కూడా ఉన్నారు. వాళ్లెవరూ తమ ఇళ్లను వదిలి పోవడానికి సిద్ధంగా లేరు. ఎలాంటి సంప్రదింపులు, ముందస్తు నోటీసులు లేకుండా, ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా ఇండ్లను కూల్చడం నియంతృత్వం కాదా? ‘మేం కూల్చితీరుతాం, మూసీ ప్రక్షాళన చేసి తీరుతా’మంటూ పాలకులు ప్రకటనలు చేయడం.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాదా? ఐదేండ్లు గ్యారెంటీ లేని తమకే అంత అహంకారముంటే ప్రభుత్వాలను మార్చే శక్తి ఉన్న ప్రజలకి ఎంత ధైర్యం ఉండాలి? ప్రభుత్వాలు మారుతుంటాయి, ప్రజలు మాత్రమే శాశ్వతం. ప్రజల ఉసురుపోసుకున్న ప్రభుత్వాలకు పుట్టగతులు ఉండవన్న తెలివి పాలకవర్గాలకు ఉండాలి.
అసలు మూసీ ప్రక్షాళన చేయాల్సిన తీరు ఇది కాదు. మూసీ సుందరీకరణకు ముందే తొలుత ప్రభుత్వం చేయాల్సిన పనులు తక్షణ కర్తవ్యాలు కొన్ని ఉన్నాయి. ఆర్బీ-ఎక్స్, ఎఫ్టీఎల్, బఫర్జోన్లు అంటూ మార్క్ చేసిన ఇళ్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆయా బస్తీలు, కాలనీల్లో ముందుగా ప్రకటించాలి. ఇళ్లను కూల్చి, మూసీ ప్రక్షాళన చేసిన తర్వాత ఆ స్థలాలను ఏం చేస్తారన్న ప్రణాళిక, డీపీఆర్లను ప్రజల ముందుంచాలి. ఇది కదా ప్రభుత్వం మొదటగా చేయాల్సింది.
మూసీ ఒడ్డున ఉన్న తాత్కాలిక నివాసాలు, పక్కా ఇండ్లు, పట్టాదారులు, కిరాయిదారులను వివిధ క్యాటగిరీలుగా విభజించి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి. నగరం నడిబొడ్డున సొంత ఇళ్లను కోల్పోతున్న బాధితులకు ఏ రకమైన న్యాయం చేయనున్నారు? వాళ్లకు అదే ప్రాంతంలో ఇంటి స్థలాలను కేటాయిస్తారా? లేదా కేటాయించని పక్షంలో ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలు ఏమిటి? అన్నది స్పష్టం చేయాలి.
చెరువులు, కుంటలను కబళించి వ్యాపార, విద్యా కేంద్రాలు, విల్లాలు నిర్మిస్తున్న బడాబాబుల కట్టడాలకు, పేదల ఇళ్లకు అసలు పోలికే లేదు. తమ దృష్టిలో అందరూ సమానమేనని ప్రభుత్వం చెప్తుండటం ఒక బూటకం. ఈ విషయం పాలకులతో పాటు ప్రజలకు కూడా బాగా తెలుసు. రాజ్యాంగబద్ధమైన నివాస హక్కు, జీవించే హక్కులకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్న విషయాన్ని ఈ సందర్భంగా పాలకులు గుర్తుంచుకోవాలి. 1946 డిసెంబర్ 3న భారత రాజ్యాంగ పరిషత్తులో లక్ష్యాల తీర్మానం ప్రవేశపెడుతూ దేశ ప్రజలందరికీ కూడు, గూడు, గుడ్డ అందించడమే రాజ్యాంగ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న విషయం విదితమే. అయితే, ఆ మాటలు నేటికీ అమలుకు, ఆచరణకు నోచుకోకపోవడం విచారకరం.
(వ్యాసకర్త: పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు)
-జి.అనసూయ
94901 28259