బీజేపీకి అత్యంత ప్రీతిపాత్రమైన వాటిలో ‘370 అధికరణం రద్దు’, ‘ఉమ్మడి పౌరస్మృతి’ తో పాటు మరో ముఖ్య అంశం ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’. గత నెల ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో ఈ అంశాన్ని మరోమారు ప్రస్తావించారు. పదే పదే ఎన్నికలు దేశ ప్రగతికి అడ్డుపడుతున్నాయన్నారు. ఆయన ఇలా మాట్లాడటం అదే మొదటిసారి కాదు, గతంలో అనేక సార్లు ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ గురించి ఆయన బలంగా వాదించారు. అంతులేని ఎన్నికల చక్రభ్రమణంలో నుంచి దేశాన్ని బయటపడేయాలనడం మోదీకి పరిపాటిగా మారింది. బీజేపీ ప్రస్తుత పదవీ కాలంలోనే ఏకకాల ఎన్నికలనే వివాదాస్పద విధానాన్ని ప్రవేశపెట్టాలనే కృత నిశ్చయంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నదనే సూచనలు వెలువడుతున్నాయి. అయితే, ఇవి నేరుగా అధికారిక ప్రకటన రూపం లో కాకుండా అభిజ్ఞ వర్గాల సమాచార రూపం లో బయటకురావడం గమనార్హం.
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ, గత మార్చి లో సమర్పించిన నివేదికలో ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ భావనను బలంగా సమర్థించింది. ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల పాలనపరమైన సుస్థిరత, విధానపరమైన స్పష్టత ఏర్ప డి దేశానికి మేలు కలుగుతుందని ఆ కమిటీ అభిప్రాయపడింది. ఈ ప్రక్రియ ఓటర్లకు సౌకర్యం గా ఉంటుందని, అనవసరమైన హైరానా తప్పుతుందని, అధిక ఓటింగ్ నమోదుకు అవకాశం ఉంటుందని, దేశంపై ఎన్నికల నిర్వహణ వ్యయభారం కూడా తగ్గుతుందని కూడా ఆ కమిటీ సూచించింది. పార్లమెంటుకు, అన్ని రాష్ర్టాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని, అదేవిధంగా 100 రోజుల లోపు స్థానిక సంస్థల కు ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేసింది. ప్రస్తుతం లోక్‌సభకు ఐదేండ్ల కాలవ్యవధితో ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ, వివిధ రాష్ర్టా ల్లో అర్ధాంతరంగా శాసనసభల రద్దు, ఇతరేతర కారణాల వల్ల పదే పదే ఎన్నికలు జరపాల్సి వస్తున్నది.
ఏక కాల ఎన్నికల విషయంలో దేశంలో ఏకాభిప్రాయం లేదు. దీన్ని సమర్థించేవారు ఉన్నట్టుగానే వ్యతిరేకించేవారు కూడా బహుళ సంఖ్యలో ఉన్నారు. దీని సమర్థకులు ఎన్నిల వ్యయం తగ్గ డం మొదలుకొని ప్రభుత్వ పరిపాలనా సౌల భ్యం దాకా పలు కారణాలను చూపిస్తుంటారు. ప్రాంతీయ అస్థిత్వాలు, ఆకాంక్షలు వెనుకతట్టు పడతాయని, సమాఖ్యవాదానికి ముప్పు ఏర్పడుతుందని, లోక్‌సభతో పాటు అసెంబ్లీలకూ ఎన్నికలు జరిపితే జాతీయవాద ఎజెండా ముం దుకువచ్చి రాష్ర్టాల ప్రాధాన్యాలు నిర్ణయాత్మకం కాకుండా పోతాయనేవి వ్యతిరేకుల ప్రధాన అభ్యంతరాలు. జమిలి ఎన్నికలు జరపాలంటే కనీసం ఐదు రాజ్యాంగ సవరణలు అవసరమవుతాయని, ఇది అంత సులభసాధ్యమైన విష యం కాదని రాజ్యాంగ నిపుణులు అంటున్నా రు. మూడో హయాంలో మైనారిటీలోకి పడిపో యి, మిత్రపక్షాల మద్దతుతో సర్కారును నెట్టుకొస్తున్న ఎన్డీయే ప్రభుత్వం ఇదంతా ఎలా సాధిస్తుందన్నది ప్రశ్న.
కానీ, మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూ ఏకకాల ఎన్నికలకు సానుకూలంగా ఉన్నాయని బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రస్తుతం ఎన్డీయేలో భాగంగా ఉన్న జనతా పరివార్ పార్టీలు జమిలి భావనను సమర్థిస్తున్నప్పటికీ డీఎంకే, టీఎంసీ, ఆప్ వంటివి గట్టిగా వ్యతిరేకిస్తుండటం గమనార్హం. 2017లో జరిగిన ఒక సర్వే ప్రకారం లోక్‌సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే 77 శాతం మంది ఒకే పార్టీని ఎన్నుకునే అవకాశాలున్నాయని, అలా కాకుండా ఆరు మాసాల తేడాతో జరిగితే వేర్వేరు పార్టీలను ఎన్నుకునే అవకాశా లు పెరుగుతాయని, ఒకే పార్టీని ఎన్నుకునే అవకాశాలు 69 శాతం తగ్గిపోతాయని వెల్లడైంది. ఈ అంశమే బీజేపీని జమిలి వైపు లాగుతున్నద నే వాదన ఉన్నది. జమిలి వంటి సుదూర పర్యవసానాలు కలిగిన మార్పుల విషయంలో కేం ద్రం ఆచితూచి అడుగువేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అన్నిపక్షాల అభిప్రాయాలు తీసుకొని, రాజ్యాంగపరమైన, పరిపాలనపరమైన అంశాలను లోతుగా పరిశీలించిన తర్వాతే దీనిపై ముందడుగు వేయడం శ్రేయస్కరం. కానీ, దుందుడుకు పోకడలకు పేరుగాంచిన మోదీ సర్కారు ఆ మార్గంలో పయనిస్తుందా?