ప్రజా న్యాయస్థానంలో తీర్పు కోరుతూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యూహం ఫలిస్తుందా? అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న అంశం. ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు పెట్టిన కేసుల కారణంగా రెండు దఫాలుగా జైలులో ఉన్న కేజ్రీవాల్ తాజాగా బెయిలుపై విడుదలైన విషయం విదితమే. జైలు నుంచి బయటికి వచ్చిన వెంటనే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను మహారాష్ట్రతో కలిపి నిర్వహించాలని ప్రకటించి తీవ్ర సంచలనం సృష్టించారు. రానున్న ఎన్నికల్లో ఆప్‌ను మరోసారి గెలిపిస్తేనే తాను తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతానని ఆయన చెప్పడం రాజకీయ సాహసమే గాక, ఢిల్లీ ఓటర్లపై ఆయనకున్న నమ్మకానికి చిహ్నంగా భావించవచ్చు.
ఈ లెక్కన పంజాబ్, హరియానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఏ మాత్రం ప్రయోజనకరం కాదనే స్పష్టమైన అవగాహనతోనే హర్యానాలో కాంగ్రెస్ పది సీట్ల వరకు ఇవ్వజూపినా ఆ పార్టీతో పొత్తుకు ఆప్ నిరాకరించింది. కుటుంబ మూలాల రీత్యా సొంత రాష్ట్రమైన హర్యానాలోని మొత్తం 90 సీట్లకు కేజ్రీవాల్ సొంత పార్టీ అభ్యర్థులను నిలబెట్టారు.
ఆప్ ప్రభుత్వంలో కీలక శాఖల మంత్రిగా పనిచేసిన ఆతిశీ మార్లెనా సీఎం పదవి చేపట్టాక జరగనున్న ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కు ఎక్కువ విజయావకాశాలున్నాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. నాలుగు నెలల క్రితం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకున్నది. అయినప్పటికీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి తప్పదని ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు. 2011లో కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి, షీలా దీక్షిత్ నాయకత్వాన నడుస్తున్న ఢిల్లీ కాంగ్రెస్ సర్కారు అవినీతికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున లేచిన ప్రజా ఆందోళనల నుంచి అవతరించిన అరవింద్ కేజ్రీవాల్ అనతికాలంలోనే సమర్థ నేతగా ఎదిగారు.
2012లో ఆప్‌ను స్థాపించిన తర్వాత అనతికాలం లోనే ఆయన ఓటర్లను ఆకట్టుకున్నారు. ఏడాది తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 సీట్లలో ఆప్ 28 స్థానాలు గెలిచి, రెండో పెద్ద పార్టీగా అవరించింది. బీజేపీని అధికారంలోకి రాకుండా నిరోధించే లక్ష్యంతో 8 మంది కాంగ్రెస్ సభ్యులు ఇచ్చిన మద్దతుతో కేజ్రీవాల్ 2013 డిసెంబర్ 28న తొలిసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే, లోక్‌పాల్ బిల్లుతో పాటు అనేక కీలక అంశాల్లో కాంగ్రెస్ వైఖరికి నిరసనగా 2014 ఫిబ్రవరిలో రాజీనామా చేశారు. అయితే మొహల్లా క్లినిక్‌లు, విద్యా విధానంలో మార్పులు, విద్యుత్తు చార్జీల తగ్గింపు వంటి జనాకర్షక విధానాలతో ఢిల్లీ ప్రజలకు ఆప్ తక్కువ సమయంలోనే మరింత దగ్గరైంది. అయితే, కొన్ని వారాల తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్‌ను కొనసాగించడమా, లేక గద్దె దించడమా? అనేదే ప్రధాన ఎజెండాగా ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆప్ ఢిల్లీలోని అన్ని సీట్లలో ఓడిపోయింది.
ఆ తర్వాత 2015లో జరిగిన ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ ఎవ్వరూ ఊహించినంతటి భారీ మెజారిటీని సాధించింది. మొత్తం 70 స్థానాల్లో ఆప్‌కు 67 సీట్లు రాగా, బీజేపీ మూడు స్థానాలే దక్కించుకుంది.1998-2013 మధ్య 15 సంవత్సరాలు ఢిల్లీని నిరాటంకంగా పరిపాలించిన కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. 2013 ఎన్నికల్లో 8 సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్ 2015 ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేదు. తన జనాకర్షక, ప్రజాసంక్షేమ విధానాల ద్వారా అరవింద్ కేజ్రీవాల్ ప్రజలను సంతృప్తి పరచడంలో విజయం సాధించారు.
ఈ నేపథ్యంలో అడుగడుగునా ఆప్ సర్కారును కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పెట్టినా కేజ్రీవాల్ తలవంచలేదు. కానీ, బీజేపీ రామబాణానికి పోటీగా హనుమాన్ చాలీసా పఠనం వంటి కొత్త ఆయుధాలతో కాషాయపక్షంతో తలపడ్డారు. ముస్లింల మద్దతు పొందుతూనే హిందూత్వ విషయంలో అవసరమైన మేరకు స్వల్ప స్థాయిలో ఆయన రాజీపడ్డారనే పేరు తెచ్చుకున్నారు. మొదటిసారి ఆప్ నాలుగేండ్ల జనరంజక పరిపాలన తర్వాత 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అంతకుముందు పార్లమెంటు ఎన్నికల్లో మాదిరిగానే ఆప్ ఒక్క సీటూ కైవసం చేసుకోలేకపోయింది. అప్పుడు కేంద్రంలో పాలకపక్షమైన బీజేపీకి ఢిల్లీ ఓటర్లు అనుకూలంగా ఉండటం ఆప్ పరాజయానికి దారితీసింది.
ఈ ఎన్నికలైన దాదాపు ఏడాది తర్వాత 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి స్వల్ప సంఖ్యలో సీట్లు తగ్గినా ఆప్ మరోసారి తిరుగులేని మెజారిటీ సాధించింది. మొత్తం 70 సీట్లలో 62 స్థానాలు దక్కించుకున్నది. బీజేపీ బలం 3 నుంచి 8కి పెరిగింది. కాంగ్రెస్ వరుసగా రెండోసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరవకుండా కొత్త రికార్డు నమోదు చేసింది. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఆప్ వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో (2015, 2020) 85 శాతానికి పైగా సీట్లు (67, 62) కైవసం చేసుకోవడంతో పాటు వరుసగా 54.3 శాతం, 53.57 శాతం ఓట్లు సంపాదించడం విశేషం.
రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి 40 శాతంలోపు, కాంగ్రెస్‌కు 10 శాతం కంటే తక్కువ ఓట్లు రావడం ఏండ్లకేండ్లు ఢిల్లీని పాలించిన ఆ పార్టీలకు జనామోదం లేదని నిరూపించింది. వరుసగా మూడు పార్లమెంటు ఎన్నికల్లో (2014, 2019, 2024) ఆప్‌కు ఢిల్లీలో ఒక్క సీటు కూడా దక్కలేదు. కానీ, రాజధాని ప్రాంతాన్ని పరిమిత అధికారాలతో జనరంజకంగా పరిపాలించిన పార్టీగా ఆప్‌ను జనం గుర్తించారు. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్టయి జైలు జీవితం గడిపిన సింపతీ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పెట్టుకున్న పొత్తు కూడా ఆప్‌కు ఉపయోగపడలేదు. కొత్త మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఆప్ రాజధానిలో ఖాతా తెరవలేకపోయాయి. హర్యానాలో కూడా ఈ పొత్తు ఫలించకపోవడంతో కాంగ్రెస్‌కు అక్కడి మొత్తం పది సీట్లలో ఐదు మాత్రమే దక్కాయి. ఆప్ పోటీచేసిన ఒక్క సీటు కురుక్షేత్రలో ఆ పార్టీకి ఓటమి ఎదురైంది.
ఈ లెక్కన పంజాబ్, హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఏ మాత్రం ప్రయోజనకరం కాదనే స్పష్టమైన అవగాహనతోనే హర్యానాలో కాంగ్రెస్ పది సీట్ల వరకు ఇవ్వజూపినా ఆ పార్టీతో పొత్తుకు ఆప్ నిరాకరించింది. కుటుంబ మూలాల రీత్యా సొంత రాష్ట్రమైన హర్యానాలోని మొత్తం 90 సీట్లకు కేజ్రీవాల్ సొంత పార్టీ అభ్యర్థులను నిలబెట్టారు.
అంతేగాక, కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకున్నాక తన రాజీనామా నిర్ణయం, మహారాష్ట్ర ఎన్నికలతో పాటే ఢిల్లీ ఎన్నికలు జరిపించాలనే డిమాండ్‌తో ముందుకొచ్చిన కేజ్రీవాల్ మాటలు హస్తం పార్టీకి రుచించలేదు. ఆయన నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఎన్నికల్లో గెలుపుపై హర్యానాలో ఉన్న ధీమా ఢిల్లీలో కాంగ్రెస్‌కు లేదు. ఈ విధంగా ఒకేసారి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను రాజధానిలో మట్టికరిపించడానికి కేజ్రీవాల్ పన్నిన వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో త్వరలోనే తేలిపోతుంది.
ఒకవేళ మహారాష్ట్రతో పాటే కొద్ది వారాల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిపిస్తే కొత్త సీఎంగా ప్రమాణం చేసే ఆతిశీ మార్లెనా పాలనతో సంబంధం లేకుండా కేజ్రీవాల్ పదేండ్ల పాలనపై ఓటర్లు తీర్పు ఇస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయ కక్షలతో కేంద్ర ప్రభుత్వం తన చెప్పుచేతల్లోని సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో పెట్టిన కేసుల ఫలితంగా కొన్ని మాసాల జైలు జీవితం గడిపిన అనేకమంది ప్రాంతీయ పక్షాల నేతలు ప్రజాక్షేత్రంలో విజయం సాధించిన సందర్భాలే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్‌కు స్ఫూర్తిదాయకం.
-నాంచారయ్య మెరుగుమాల