ఆర్టీసీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన రోజు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఆర్టీసీ కార్మికుల ఆకాంక్ష ఫలించింది. ఆరు దశాబ్దాలకు పైగా కార్పొరేషన్‌గా కొనసాగిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో 43 వేల 373 మంది ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో కేసీఆర్ వెలుగులు నింపారు.
నిత్యం ప్రజలతో మమేకమయ్యే ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ భద్రత కల్పించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ బిల్లు ప్రవేశ పెట్టనున్నారు. దీంతో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆర్టీసీ కార్మికులను మరో మెట్టు పైకి ఎక్కించారు. ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్నారు. అలాంటి వారు చాలీచాలని వేతనాలతో ఉద్యోగం చేస్తున్నారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి కూడా సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ రవాణాశాఖ మంత్రిగా పని చేసిన సమయంలో ఉద్యోగుల సమస్యలను ప్రత్యక్షంగా చూశారు. తెలంగాణ వచ్చాక ఆర్టీసీ స్థితిగతులను పూర్తిగా అధ్యయనం చేసి సంస్థను ఒక తోవలో పెట్టి,.. ఉద్యోగులకు పూర్తి భరోసా ఇచ్చారు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా సంస్థను నిలబెట్టి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించారు కేసీఆర్. ‘కార్మికులు’ అనే పదాన్ని తీసివేసి ‘ఉద్యోగులు’గా వారి గౌరవాన్ని మరింత పెంచారు. కరోనా సమయంలోనూ ఆర్టీసీని ఆదుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు.
రోడ్డు రవాణా సంస్థకు నూతన జవసత్వాలు అందించి ఆర్టీసీకి పూర్వవైభవం తేవడానికి సీఎం కేసీఆర్ సంకల్పించారు. కష్టకాలంలో ఉన్న ఆర్టీసీని ఆదుకునే దిశగా కేసీఆర్ ప్రభుత్వం చర్యలు చేపడుతూ సంస్థను గాడిన పడేసింది. అందులో భాగంగానే ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం జరుగుతున్నది.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆర్టీసీ నష్టాలను పూడ్చుకుంటూ క్రమంగా లాభాల్లోకి తెచ్చే క్రమంలో కరోనా వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా కేసీఆర్ వెనుకడుగు వేయలేదు. వేలాదిమంది ఉద్యోగుల జీవితాలతో ముడి పడి ఉన్నందున ఆర్టీసీని ఆదుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. లక్షలాదిమంది ప్రజలను వారి గమ్యస్థానాలకు చేరుస్తూ జనం హృదయాల్లో ఆత్మీయ చిరునామాగా నిలిచిన ఆర్టీసీకి అండదండలు అందించారు.
కేసీఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిన సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. జీతాలు లేక వారి కుటుంబాలు ఎన్ని ఇబ్బందులు పడినా ఉద్యమానికి ఊపిరు లూదారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వని విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చి వేతనాలు పెంచారు. ఇతరత్రా సదుపాయాలు కల్పించారు. ఆర్టీసీ మనుగడకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి భరోసా కల్పించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలు, సూచనలు మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. నష్టాలను పూడ్చుకొంటూ వస్తూ లాభాల బాట పట్టించారు. పలు విప్లవాత్మక నిర్ణయాలతో ఆర్టీసీలో సమూల మార్పులు తీసుకువచ్చారు. పార్శిల్ సర్వీసులు, కార్గో సేవలను బలోపేతం చేయడం ద్వారా సంస్థకు లాభాలు తీసుకువచ్చారు.
పెండ్లిళ్లకు, శబరిమల వంటి యాత్రలకు ఆర్టీసీ బస్సులను వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు రావడం చిన్న విషయం కాకున్నా, కార్మికుల సంక్షేమం కోసం ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకుండా ఆర్టీసీకి పునర్వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నది.
ఆర్టీసీ సంస్థ, ఉద్యోగుల బాగోగుల పట్ల కేసీఆర్ ఒక నిబద్ధతతో వ్యవహరించారు. ప్రయాణికులను పలు ఆఫర్లతో ఆకట్టుకోవటంతో పాటు, మారుమూల గ్రామాలకు కూడా ఆర్టీసీ సేవలు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆర్టీసీ ప్రయాణమే సురక్షితమని ప్రచారం చేయడం ద్వారా ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కొత్త బస్సులను ప్రవేశపెట్టి ప్రయాణీకులకు మరింత సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నారు దీంతో ప్రయాణికులకు ఆర్టీసీ పట్ల మరింత నమ్మకం పెరిగింది. ఆర్టీసీలో ప్రస్తుతం 9200 బస్సులున్నాయి. అందులో 2800 అద్దె బస్సులు. కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో ఆధునిక సౌకర్యాలతో బస్టాండ్లు, నూతన బస్‌డిపోలు నిర్మించడం ద్వారా ప్రయాణికులకు ఆర్టీసీ మరింత చేరువైంది. అలాంటి ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ఉద్యోగులకు పూర్తి స్థాయిలో భరోసానిచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్.
అనేక సంవత్సరాలుగా తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉన్న ఆర్టీసీ ఉద్యోగాలు నేడు ప్రభుత్వ ఉద్యోగాలుగా మారటంతో ఆర్టీసీ ఉద్యోగుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
(వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్ )
చిటుకుల మైసారెడ్డి
94905 24724