పనిమంతుడు పందిరేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిందట. కాంగ్రెస్ పార్టీ నిర్వాకం కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. హస్తం పార్టీ ప్రభుత్వాలు నిర్మించే సాగునీటి ప్రాజెక్టులను చూస్తే ఈ సామెత గుర్తుకురాక మానదు. కనీస అవగాహన, దీర్ఘకాలిక ప్రణాళిక లేకుండా, నాసిరకం పనులతో ఆ పార్టీ ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టుల కారణంగా ఇప్పటివరకు ఎంతోమంది వ్యక్తులు అసువులు బాశారు. వేల కోట్ల ప్రజాధనం వృథా అయింది. అందుకు తాజా నిదర్శనమే ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదం. పేరు కోసం పాకులాడుతూ ప్రచార యావతో కనీస జాగ్రత్తలు పాటించకుండా రేవంత్రెడ్డి సర్కారు చేసిన నిర్వాకం వల్ల 8 మంది ప్రాణాలు ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఈ వ్యాసం రాసే సమయానికి వారి భవిష్యత్తు ఇంకా ఏమీ తేలలేదు.
సాగునీటి ప్రాజెక్టులను నిర్మించేటప్పుడు పలు కీలక అంశాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సి ఉంటుంది. మట్టి నాణ్యత, క్యాచ్మెంట్ ఏరియా, నీటి లభ్యత, సగటు వర్షపాతం, ప్రాజెక్టు సామర్థ్యం… ఇలా అనేక విషయాలపై సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత ప్రాజెక్టుల నిర్మాణంపై ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా టన్నెల్ నిర్మాణమైతే ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఏ మాత్రం ప్లానింగ్ లేకుండా 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం కొబ్బరికాయ కొట్టిన ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణ పనులకు రెండు దశాబ్దాలు గడిచినా గుమ్మడికా య కొట్టలేకపోతున్నాం. పడుతూ లేస్తూ పనులు సాగుతున్నాయి. ప్రచార యావ కోసం పడిచచ్చే రేవంత్రెడ్డి ప్రభుత్వం కనీస అధ్యయనం లేకుండా పనులు చేపట్టి కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆ పార్టీ ప్రభుత్వాలు ముందూ వెనుకా ఆలోచించకుండా చేసిన పనుల వల్ల ప్రజాధనం వృథా అవ్వడంతో పాటు పలువురు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది.
భౌగోళిక పరిస్థితులు, సగటు వర్షపాతం, వరదలను అంచనా వేయకుండా నిర్మల్లో 1950లో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన కడెం ప్రాజెక్టు ఎనిమిదేండ్లకే పునాదులతో సహా కొట్టుకుపోయింది. ఆ తర్వాత మరోసారి పునర్నిర్మాణం జరిగినా ఈ ప్రాజెక్టు ఇప్పటికీ వర్షాకాలం వస్తే గజగజ వణకాల్సిన పరిస్థితి.
కాంగ్రెస్ సర్కార్ వైఫల్యానికి దేవాదుల మరో నిదర్శనం. కమీషన్లకు కక్కుర్తి పడి హడావుడిగా చేపట్టిన ఈ ప్రాజెక్టు నీటి ఒత్తిడికి తట్టుకోలేక పైపులు గాల్లోకి ఎగిరేయి. 2011లో దేవాదుల టన్నెల్లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు జల సమాధి అయ్యారు. టన్నెల్ పైభాగంలో ఉన్న చలివాగు ప్రాజెక్టు నుంచి వస్తున్న నీటి ఊటను లెక్కచేయకుండా పనులు చేపట్టిన అప్పటి కాంగ్రెస్ సర్కార్ అమాయక ప్రజలను
బలి తీసుకున్నది.
ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, పునాదులు తీసి, పనులు మొదలుపెట్టి, ఆ తర్వాత డిజైన్ గురించి తీరికగా ఆలోచిస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వాలకు పేరున్నది. అంతేకాదు, ప్రాజెక్టు పనులు మొదలుపెట్టాక అకస్మాత్తుగా డిజైన్ మార్చడం, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకు, కమీషన్లు కొల్లగొట్టేందుకు ఒక్కసారిగా అంచనా వ్యయాన్ని పెంచడంలో కాంగ్రెస్ పార్టీ దిట్ట. తెలంగాణలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టుల పరిస్థితి అదే విధంగా ఉన్నది. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో 2009-14 మధ్యకాలంలో పూర్ణ బ్యారేజీ 40 శాతం పనులు పూర్తయ్యాక అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లను పిలవడమే అందుకు తార్కాణం. అంతవరకు ఎందుకు.. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తలా తోక లేకుండానే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరిట అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు దోచిపెట్టింది మనకు తెలియదా? తల లాంటి ప్రాజెక్టు పనులను వదిలేసి తోక లాంటి కాలువలను తవ్వడాన్ని మనం చూడలేదా?
తెలంగాణ పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పార్టీ మన సాగునీటి ప్రాజెక్టులన్నింటిని సంకటంలో పడేసింది. ఏ ప్రాజెక్టు చేపట్టినా దశాబ్దాల పాటు సాగతీతే. అంతేకాదు, ఏదో ఒకరోజు వేరు కుంపటి పెట్టాల్సి వస్తుందని ముందే గ్రహించిన కాంగ్రెస్ సమైక్య పాలకులు… కృష్ణా నదిపై నిర్మించిన ప్రధాన ప్రాజెక్టులన్నీ సరిగ్గా ఏపీ-తెలంగాణ సరిహద్దుల పైనే నిర్మించి జుట్లకు జుట్లు ముడివేశారు. ఆ పంచాయితీ ఇప్పటికీ తెగడం లేదు.
(వ్యాసకర్త: పౌరసరఫరాల శాఖ మాజీ మంత్రి)
-గంగుల కమలాకర్