బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీ ఇచ్చేశారు. అస్తవ్యస్త కార్యాచరణతో దాన్ని అడ్డంకుల్లోకి నెట్టారు. అమలు అసలు సాధ్యమా, కాదా సర్కారుకు తెలియదా? చట్టం పట్టదా? రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుందనే ఆలోచన లేదా? అయినా తప్పులతడకలతో చట్టాలు, జీవోలు, ఆర్టినెన్స్‌లు చేస్తూ సమస్యను మరింత జటిలం చేశారు. బీసీ రిజర్వేషన్ల హత్యా పాతకం ఎవరిది? అందుకే ఏ సంగతైనా పూర్తిగా తెలియనిదే కీలకమైన చట్టాలను చేయకూడదు. ఇది ఒక్క తెలంగాణ కథే కాదు, దేశమంతటి కథ. ఉత్తుత్తి రిజర్వేషన్ల ఉత్తర్వులతో ఏం లాభం? అసలు సర్కారుకు ఇవ్వాలనే ఉద్దేశం ఉందా?
తెలిసితెలిసీ లోపభూయిష్టమైన మార్గంలో రాజ్యాంగ విరుద్ధమైన, సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకమైన వాదనలతో, బిల్లులతో, ఆర్డినెన్స్‌లతో, గవర్నర్ ఆమోద వివాదాలతో 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని సర్కారు భ్రష్టుపట్టించింది. తలాతోకా లేకుండా చట్టాలు, జీవోలు తెస్తే ఏం జరుగుతుందో చూడండి. తెలంగాణ హైకోర్టు తాత్కాలిక స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఎందుకిదంతా? ఇది అక్కరకొచ్చే పనేనా? అసలు విషయం రాష్ట్ర ప్రభుత్వానికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వానికీ తెలుసు.
తెలంగాణ బీసీ కమిషన్‌కు డెడికేటెడ్ కమిషన్ బాధ్యతలను అప్పగిస్తూ 2024 సెప్టెంబర్ 6న జీవో 199 జారీచేశారు. డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సిందేనని 2024 అక్టోబర్ 30న హైకోర్టు చేసిన తీర్పులో రిజర్వేషన్ల స్థిరీకరణకు బూసాని వెంకటేశ్వర్లు నేతృత్వంలో ప్రత్యేకంగా 2024 నవంబర్ 4న డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేస్తూ జీవో 49 జారీచేశారు. 2024 డిసెంబర్ 5 నుంచి జిల్లాల్లో డెడికెటేడ్ కమిషన్ బహిరంగ విచారణ చేసింది. ఇంటింటి సర్వే గణాంకాలను డెడికేటెడ్ కమిషన్ 2025 ఫిబ్రవరి 6న రాష్ట్ర ప్రభుత్వానికి వివరించింది. ఫిబ్రవరి 27న ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
తెలంగాణ కులగణన: బీసీ కమిషన్ నివేదిక లేకుండానే బీసీలకు విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసింది. ఇక బిల్ నంబర్ 4 ద్వారా రాజకీయ రిజర్వేషన్లను పెంచింది. డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల మేరకు అంటూ బిల్లులో చేర్చారు. విద్య, ఉపాధి, ఉద్యోగ రిజర్వేషన్ల కల్పనకు డెడికేటెడ్ కమిషన్ అధ్యయనం చేసి, సిఫారసులు చేసేందుకు ఎక్కడా అధికారాలు లేవు. ప్రభుత్వం కూడా ఆ మేరకు డెడికేటెడ్ కమిషన్‌కు మార్గదర్శకాలు జారీ చేయకపోవడం ఆశ్చర్యం. ఎందుకింత రహస్యం? బూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికలను సైతం తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా బహిర్గతం చేసిందా? ఎందుకు చేయలేదు? అవేమైనా రహస్య పత్రాలా?
అంతేకాదు, కేవలం పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల స్థిరీకరణకు సంబంధించిన నివేదికనే తెప్పించుకుంది. కానీ, ప్రభుత్వం ఆ ఒక్క నివేదిక ఆధారంగా పంచాయతీ, మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు వర్తించేలా చట్టం చేసింది. బీసీ రిజర్వేషన్లలో ఏ క్యాటగిరీ వాటా ఎంతనేది కూడా ప్రకటించలేదు. అశాస్త్రీయంగా, అహేతుకమైన గణాంకాలతో, అశాస్త్రీయ పద్ధతులతో కావాలనే చట్టాన్ని చేశారంటే ఏమనాలి?
ఆర్డినెన్స్ ద్వారా బిల్లులను అమలు చేయాలని, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర క్యాబినెట్లో నిర్ణయించారు. రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులపై నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదు. అలా చేసే నిర్ణయాలు నిలబడవు కూడా. తెలంగాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్య స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం, ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 9 శాతం మొత్తం 69 శాతం రిజర్వేషన్లు, అదేవిధంగా విద్య, ఉద్యోగాల్లో కూడా అవే రిజర్వేషన్లు అమలు చేస్తామని రెండు ప్రత్యేక చట్టాలు తెచ్చారు. ఉభయ సభల్లో బిల్లులు పాస్ చేసుకున్నరు. ఆర్టికల్ 31సీ కింద రాష్ట్రపతికి పంపారు. అంతవరకు బాగానే ఉంది. రాష్ట్రపతికి నేరుగా బిల్లు పంపటానికి తెలంగాణ రాష్ట్ర శాసనసభకు అధికారం ఉందా? లేదు కదా. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి ఆమోదం పొందితేనే బిల్లుకు సంపూర్ణ చట్టబద్ధత వస్తుంది. బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఒక కాపీ రాష్ట్రపతికి పంపారు. ఈ బిల్లుపై కేంద్ర క్యాబినెట్లో చర్చించారా? తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చడానికి కేంద్ర ఉభయసభలు అంగీకరించాయా? దాన్ని రాష్ట్రపతికి పంపించారా? కేంద్రప్రభుత్వం అసలు దీని గురించి చర్చించిందా? అంగీకరించిందా?
342ఏ (3) ప్రకారం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసుకొని, ఓబీసీలను గుర్తించి విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చు. అయితే అందుకు రాజ్యాంగ సవరణ, రాష్ట్రపతి ఆమోదం అవసరం ఉంటుంది కదా. ఆర్టికల్ 242డీ (6), 242టీ (6) కింద బీసీలకు కూడా జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ కులాల తరహాలో రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ కావాలి. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలి. కానీ, అంతకంటే ముందు రాజ్యాంగపరంగా కొన్ని విధివిధానాలు ఉన్నాయి. కులగణన చేసిన తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. సరే కానీ, సర్వే కమిషన్ వేశారా? 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి ఆర్డినెన్స్ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు కూడా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అవన్నీ కలుపుకొని 67 శాతం అమలు చేస్తామంటున్నారు. రిజర్వేషన్ల సమస్యపై గత అనుభవాల గురించి తెలిసీ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ రిజర్వేషన్లను పెంచుతామని హామీ ఇచ్చారు. బీహార్‌లో రాజ్యాంగబద్ధంగా వెళ్లినా 50 శాతం రిజర్వేషన్ పరిమితికి మించింది కాబట్టి, రాజ్యాంగ వ్యతిరేకమని అంటూ ఆ రిజర్వేషన్లను అక్కడి హైకోర్టు కొట్టివేసింది. దీని మీద బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్తే ధర్మాసనం స్టే ఆర్డర్ ఇవ్వలేదు. ఇప్పటికీ సుప్రీంకోర్టులో బీహార్ రిజర్వేషన్ల కేసు పెండింగ్‌లో ఉన్నది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు: తెలంగాణ బీసీ కమిషన్‌కు డెడికేటెడ్ కమిషన్ బాధ్యతలను అప్పగిస్తూ 2024 సెప్టెంబర్ 6న జీవో 199 జారీచేశారు. డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సిందేనని 2024 అక్టోబర్ 30న హైకోర్టు చేసిన తీర్పులో రిజర్వేషన్ల స్థిరీకరణకు బూసాని వెంకటేశ్వర్లు నేతృత్వంలో ప్రత్యేకంగా 2024 నవంబర్ 4న డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేస్తూ జీవో 49 జారీచేశారు. 2024 డిసెంబర్ 5 నుంచి జిల్లాల్లో డెడికెటేడ్ కమిషన్ బహిరంగ విచారణ చేసింది. ఇంటింటి సర్వే గణాంకాలను డెడికేటెడ్ కమిషన్ 2025 ఫిబ్రవరి 6న రాష్ట్ర ప్రభుత్వానికి వివరించింది. ఫిబ్రవరి 27న ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
సర్వే సక్రమంగా చేసినట్టేనా?: గణాంకాల సేకరణ చట్టం 2008 ప్రకారం సర్వే నిర్వహించాలన్నా కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంది. 1952 రిజిస్ట్రార్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం ప్రకారం స్వయం ప్రతిపత్తి కలిగిన కమిషన్‌ను ఏర్పాటు చేయడంతోపాటు, గణాంకాల సేకరణకు ఒక ప్రభుత్వ శాఖను నోడల్ డిపార్ట్మెంట్గా గుర్తించి, నోడల్ ఆఫీసర్‌ను, కమిషన్‌కు సెక్రటరీని నియమించాల్సి ఉంటుంది. నేషనల్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ డిపార్ట్మెంట్, స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్, ఎన్ఎస్ఎస్వో తదితర విభాగాల నుంచి రాష్ర్టానికి చెందిన తాజా ఇండ్ల జాబితాను, బ్లాక్‌వారీగా రూపొందించిన హౌసింగ్ మ్యాపులను కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక సర్వే ప్రశ్నావళి రూపకల్పనకు సంబంధించి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంది. సేకరించిన డేటాను కూడా అందుబాటులో ఉన్న ప్రామాణికమైన డాటాను ఉపయోగించి ఓటర్, ఆధార్ జాబితాలు, రేషన్‌కార్డుదారులు మొదలైన వాటితో విశ్లేషించాల్సి ఉంది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ ఉపాధి, రాజకీయ అవకాశాలకు సంబంధించిన స్థితిగతులను తులనాత్మకంగా అధ్యయనం చేయాల్సి ఉంది. చివరికి అన్నింటినీ క్రోడీకరించి, విశ్లేషించి తుది నివేదికను రూపొందించాలి. క్యాబినెట్ ఆమోదం పొందాల్సి ఉంది.
కమిషన్ పనిని జీవోతో సాధిస్తారా?: సర్వే బాధ్యతలను ప్రత్యేక కమిషన్‌కు కాకుండా, ప్లానింగ్ డిపార్ట్మెంట్కు సర్కార్ అప్పగించింది. ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టమైన వివరాలను ఎక్కడా పేర్కొనలేదు. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఇంటింటి సర్వే (సామాజిక, విద్య, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కులాలవారీగా) అని మాత్రమే పేర్కొన్నది. ఎందుకోసం చేస్తున్నామనేది ఎక్కడా పేర్కొనలేదు. క్యాబినెట్, ఆపై అసెంబ్లీలో చేసిన తీర్మానాలను మాత్రమే రిఫరెన్స్‌గా ఇచ్చింది. కానీ, సమగ్ర ఇంటింటి సర్వే కోసం బీసీ సంక్షేమ శాఖ మార్చి నెలలో జారీచేసిన జీవో 26ను మాత్రం ఎక్కడా రిఫర్ చేయలేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా బీసీ కమిషన్‌కే బీసీ రాజకీయ రిజర్వేషన్ల స్థిరీకరణ బాధ్యతలను సర్కారు అప్పగించింది.
కులగణన కేంద్ర అధికారం: రాష్ర్టాలు నిర్వహించిన, నిర్వహిస్తున్న కులగణన సర్వేలకు పారదర్శకత లేదని, సాధికారత లేదని కేంద్ర క్యాబినెట్ సూపర్ కమిటీగా పేరొందిన ప్రధాని మోదీ నేతృత్వంలోని రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీపీఏ) ప్రకటించింది. త్వరలో దేశవ్యాప్తంగా చేపట్టబోయే జనాభా గణనలో కులగణనను కూడా నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది.
గణాంకాలు రహస్యమా?: రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 6 నుంచి 26 వరకు తొలిదశ ఇంటింటి సర్వేను నిర్వహించింది. ఎన్యుమరేటర్లకు ఎటువంటి జనాభా సమాచారాన్ని, సర్వే చేపట్టాల్సిన ఇండ్లకు సంబంధించిన వివరాలను అందజేయలేదు. కేవలం సర్వే పత్రాలను మాత్రమే వారి చేతికిచ్చింది.
ఎన్యుమరేటర్లే ఇంటింటికీ వెళ్లి ఆయా కుటుంబ సభ్యులు చెప్పిన కులం, వృత్తి, ఆస్తులు, ఆదాయ వివరాలనే నమోదు చేసుకున్నారు. ఆ వివరాలు సరైనవేనా? కాదా? అనేది క్షేత్రస్థాయిలోనే కాదు,పైస్థాయిలోనూ తెలుసుకున్న దాఖలాల్లేవు. సూటిగా చెప్పాలంటే పూర్తిగా గృహ యజమానులు ఇచ్చే సమాచారం మీదనే ఆధారపడి వివరాలను సేకరించారు. అటు తర్వాత ప్రభుత్వం సర్వే నివేదికను ప్రకటించింది.
బీసీ జనాభా 46.25 శాతం, ముస్లిం బీసీలు 10.08 శాతం, ఓసీలు 15.79 శాతం, ఎస్టీలు 10.45 శాతంగా కమిషన్ నిర్ధారించింది. కానీ, పట్టణ జనాభా, గ్రామీణ జనాభా ఎంత? వృద్ధులు ఎందరు? యువకులు ఎందరు? విద్యార్థులు ఎందరు? దివ్యాంగులు ఎందరు? క్యాటగిరీల వారీగా వివరాలను స్థూలంగానైనా ప్రకటించలేదు. అంతేకాదు జిల్లాలవారీగా కూడా గణాంకాలను వెల్లడించలేదు. కేవలం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గణాంకాలే వెల్లడించి, తాము చెప్పిందే లెక్క అన్న చందంగా వ్యవహరించింది. అసెంబ్లీలో ఆ గణాంకాలను వెల్లడించి తీర్మానం చేసింది. గణాంకాలపై విమర్శలు రావడంతో 2025 ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీవరకు ప్రభుత్వం రీసర్వే నిర్వహించింది. ఈ క్రమంలో మరో 21 వేల కుటుంబాల వివరాలను సేకరించింది. అప్పుడైనా వెల్లడించిందా అంటే అదీ లేదు. ఇప్పటికీ కులాలు, ఉప కులాలవారీగా జనాభా లెక్కలను ప్రకటించలేదు. కేవలం స్థూలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ వర్గాల గణాంకాలనే బయటపెట్టింది. ఇక చేయగలిగిందేమిటి? హైకోర్టు తాత్కాలిక స్టే మీద సుప్రీంకోర్టుకు పోతే ఊహించిన ఫలితమే వచ్చింది. కేసుల పేరిట కోట్ల రూపాయలు ఖర్చు చేయవచ్చు. అది వేరే సం గతి. అసలు నిజంగా బీసీలకు న్యాయం చేయాలనే ఆసక్తి ఉందా లేదా?
-మాడభూషి శ్రీధర్