బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల అంశంలో మొత్తానికి సర్కార్ వారి సరదా తీరింది. మనసులో నిత్యం ఏదైనా తలిస్తే పైనుంచి దేవతలు దాన్నే తథాస్తు అంటారని పెద్దలు అంటూ ఉంటారు. అదేవిధంగా బీసీలపై రేవంత్ సర్కార్ మనసులో ఏం పెట్టుకొని రిజర్వేషన్ల పెంపుపై కసరత్తు చేసిందో, అదే నిజమైంది.
వాస్తవానికి 20 నెలలుగా కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో వేస్తున్న కుప్పిగంతులను చూసి చాలామంది బీసీలు క్షేత్రస్థాయిలో ఆశలు పెట్టుకున్నారు. దశాబ్ద కాలంగా తెలంగాణ ఆర్థికవ్యవస్థ పునాదిలో జరిగిన మౌలికమైన మార్పుల వల్ల గ్రామీణ సమాజంలో పలువర్గాల ఆకాంక్షల్లో కూడా గతానికి భిన్నమైన నూతనత్వం వచ్చింది. అందులో భాగంగానే రాజకీయాల్లో క్రియాశీలక భాగస్వామ్యాన్ని, అధికారిక పదవుల్లో వాటాను అందిపుచ్చుకోవాలనే చలనశీలత కూడా ఇతర వర్గాలతో పాటు బీసీ సామాజిక వర్గాల్లోనూ బాగా బలపడింది.
రాష్ట్ర సామాజిక వ్యవస్థ ఆలోచనల్లో జడత్వానికి చిల్లులు పడి, యథాతథ స్థితి నుంచి కొంతైనా ముందుకు పాకాలనే పెనుగులాట బలహీనవర్గాలతో పాటు అన్ని సామాజిక వర్గాల్లోనూ స్పష్టంగా కనపడుతున్నది. ఏడు దశాబ్దాల కాలంలో కంటే కొంత భిన్నంగా కదులుతున్న గ్రామీణ తెలంగాణ ధోరణిలో సంభవించిన నూతన దృక్పథం వల్ల పల్లె రాజకీయాల్లోనూ ప్రాతినిధ్య పట్టుదల కోసం అందరూ పరుగులు తీస్తున్నారు. ఈ భావోద్వేగాలతోనే రేవంత్ ప్రభుత్వం చెలగాటమాడి చేతులు కాల్చుకున్నది. విపక్షంలో ఉన్న సందర్భాల్లో అనేక విధాలైన హామీలను రాజకీయ పార్టీలు ఇవ్వడం సహజంగా జరిగేదే. కానీ, రెండేండ్ల కిందట జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ హామీల చుట్టూ ప్రచారాన్నే కాదు గ్యారెంటీనీ ఇంటింటికీ ఇచ్చింది.
అయితే అధికార కాంగ్రెస్ పార్టీ 420 హామీల్లో ఆడుతున్న నాటకాలకు, బీసీ రిజర్వేషన్ల పెంపు హామీ చుట్టూ చేస్తున్న విన్యాసాలకు మధ్య ఉద్వేగపూరితమైన వ్యత్యాసం ఉన్నది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అంశం 50 శాతం పైగా ప్రజల తాజా భావోద్వేగాలతో పాటు బీసీయేతర సామాజికవర్గాల ఆలోచనలపైన సైతం తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను రేవంత్ సర్కార్ సామాజిక దృష్టికోణంతో పరిష్కార ప్రయత్నంగా ముందుకు తీసుకెళ్లకుండా, అలవాటైన కురచ బుద్ధితో రాజకీయ లబ్ధి కోసమే సాగదీసి వివాదాస్పదం చేసేసింది. దీనివల్ల రిజర్వేషన్ల అమలు సంక్లిష్టంగా మారి సామాజిక సామరస్యానికి సవాల్‌గా మారింది. దేశంలో ఇంతలా సంకుచితంగా, అవివేకంగా, అహంకార ధోరణితో సున్నితమైన రిజర్వేషన్ల అంశంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన దిక్కుమాలిన సర్కార్ మరేదీ ఉండదేమో?
హైకోర్టు స్టే ఇవ్వడానికి ముందురోజు వరకు రాష్ట్ర సర్కారు లేడికి లేచిందే పరుగన్నట్టుగా గ్రామాల్లో, మండల, జిల్లా కేంద్రాల్లో అధికారుల ద్వారా చేసిన హంగామా, స్థానిక సంస్థల ఎన్నికల శంఖారావం పూరిస్తూ ఊరూరా హస్తం పార్టీ నేతలు చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. దీంతో నిజంగానే ఎన్నికలు వస్తాయేమోనని నమ్మిన చాలామంది ద్వితీయ శ్రేణి నాయకులు విచిత్రమైన మానసిక భావోద్వేగ స్థితిలోకి వెళ్లిపోయారు. ఎన్నికల్లో జడ్పీటీసీ స్థానానికి తలపడాలని తపన పడుతున్న నాకు తెలిసిన ఒక నాయకుడికి కోర్టు స్టే ఇస్తుందని చెప్పినా నమ్మకుండా తన భూమి డాక్యుమెంట్లతో అప్పు కోసం ఆసాముల చుట్టూ చక్కర్లు కొట్టాడు. మానవ సమాజ పరిణామక్రమమే అవకాశాల వెతుకులాటలో విస్తరించింది. మనిషి ఆశాజీవి. అంతేకాదు, అవకాశాలకు సుదీర్ఘకాలం దూరంగా మెలిగిన వర్గాలకు అందుబాటులో ఏదైనా ఉందనితోస్తే వేగంగా అందిపుచ్చుకోవడానికి ఆరాటపడటం సహజ మానసికస్థితినే కదా..! కానీ, చివరికి నమ్మిన బీసీలే కాదు, ఎన్నికల కలలు కన్న వర్గాలన్నీ ఉసూరుమన్నాయి. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా గ్రామాల్లో గందరగోళమే తప్ప అన్నివర్గాల ప్రజల ఇష్టపూర్వక భాగస్వామ్యం మాత్రం ఉండకపోవచ్చు. సర్కారే మరుగుజ్జు మానసిక స్థితిలో ఉంటే సకలజనులను ఎలా సమస్యల వలయంలో పడేస్తుందో రేవంత్ ప్రభుత్వం నిరూపించింది.
తాజాగా నమ్మిన బలహీన వర్గాల పరిస్థితి తెలంగాణ కవి చెరబండరాజు ‘తీసుకున్న ఓట్లన్నీ మావి.. తీరా మా బతుకే ఎండమావి’ అని తన కవిత్వంలో అన్నట్టుగా మారింది. అయితే, ఇలా అన్నివర్గాల ఆవేదనకు కారణమెవ్వరంటే కసాయిని నమ్మిన గొర్రెల సామెతే సమాధానంగా స్ఫురిస్తుంది కదా? విపక్షంలో ఉన్నప్పుడే చాలా స్పష్టంగా రాష్ర్టాలకు రిజర్వేషన్లు అడిగిన వారిని ఉరి తీయాలని డిమాండ్ చేసిన రేవంత్ లాంటి పాలకుడు బీసీల రిజర్వేషన్లు పెంచే ప్రయత్నం చిత్తశుద్ధితో చేస్తాడని నమ్మడమూ మూర్ఖత్వమే కదా? అసలు రాష్ట్రంలోనే కాదు, భారతదేశ సామాజిక చరిత్రను యథాతథస్థితిలో ఉంచడానికో లేక వీలైతే వెనక్కి నడిపించడానికో కాంగ్రెస్ పార్టీ తన సర్వశక్తులూ ధారపోస్తుంది కానీ, పురోగతి కోసం ఒక్క చెమట బొట్టు కూడా ఖర్చుచేయదు. అందుకే, నెహ్రూ మంత్రిమండలి నుంచి అంబేద్కర్ బయటకొస్తూ బలహీనులకు సాధికారత ఇవ్వకపోయినా నష్టం లేదు కానీ, వారిని నిత్యం సమస్యల సంకెళ్లతో బంధించి ఉంచాలనే ప్రయత్నమే దారుణమనీ, అదే విధానంగా ఉన్న కాంగ్రెస్ దేశానికి పెద్ద ప్రమాదం అని పూర్తిగా విశ్వసించే రాజీనామా చేస్తున్నానని అన్నారు. అలాంటి కాంగ్రెస్‌ను తమిళనాడు వలె వదిలించుకోవాలే కానీ, తగిలించుకొని తెలంగాణ నిత్యం తన్నించుకుంటుండటమే ఆవేదనాభరితం.
ఏదేమైనా బీసీ రిజర్వేషన్ల పెంపు కసరత్తు విధానంలో అధ్వాన్నంగా వ్యవహరించడమే కాకుండా బీఆర్ఎస్నూ బద్నాం చేసే ఎత్తులేసిన రేవంత్ సర్కార్ తీరా తానే బొక్కబోర్లా పడ్డది.
వాస్తవానికి 2011లో సేకరించిన జనాభా లెక్కల్లో బీసీల వివరాలు కూడా సేకరించాలని నాడే భారతదేశ సంక్షేమ మంత్రిత్వశాఖ
కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి పీఎస్ కృష్ణన్ అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరంకు లేఖ రాశారు. ఆరు
దశాబ్దాల పాటు ఏమార్చినా, కనీసం 2011 జనాభా లెక్కల్లోనైనా యూపీఏ సర్కార్ పీ ఎస్ కృష్ణన్‌తో పాటు దేశ బీసీ సంఘాల డిమాండ్‌ను ఆలకించి ఉంటే, గడిచిన దశాబ్దన్నరలో అనేక సామాజిక సమస్యలకు రాజ్యాంగబద్ధ పరిష్కారం సాకారమయ్యేది.
కానీ, నక్కకు నెమలి నైజం ఎలా ఎప్పటికీ అలవడదో కాంగ్రెస్ పార్టీకి కూడా వాస్తవ ప్రజా డిమాండ్లను అర్థం చేసుకునే గుణం రానేరాదని ఆనాడే తేలిపోయింది. కార్యక్రమ సమగ్రత స్వభావం దెబ్బతింటుందనే సాకుతో బీసీల వివరాల సేకరణకు నిరాకరించారు. ఎస్సీ, ఎస్టీ కాలమ్ ప్రక్కన ఎస్.ఈ.బీసీ కాలమ్ చేర్చినంత మాత్రాన జనాభా లెక్కల సేకరణ సమగ్రత స్వభావం ఎలా దెబ్బతింటుందో చిదంబరమే సెలవివ్వాలి. నెహ్రూ హయాం నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు శాసించిన యూపీఏ ప్రభుత్వం దాకా ప్రజలు డిమాండ్లన్నింటినీ దారిలో దానయ్యల ఆర్తనాదాలుగా వదిలేసింది కాంగ్రెస్ అధిష్ఠానం.
తీరా నిండా మునిగాక కమ్యూనిస్టు పార్టీల చారిత్రక తప్పిదం తీర్మానాల వలెనే అహ్మదాబాద్‌లో ఏప్రిల్ నెలలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో రాహుల్‌గాంధీ బీసీల విషయంలో పట్టించుకోవాల్సినంతగా పట్టించుకోకపోవడం పొరపాటే అనడం హాస్యాస్పదం కాదా? పోనీ ఇప్పటికైనా రేవంత్ సర్కార్ కుట్రలను సరిచేసే పెద్దరికాన్నైనా రాహుల్ గాంధీ ప్రదర్శిస్తున్నారా అంటే సమాధానం శూన్యమే. ప్రజా విశ్వాస సముపార్జనకు పాదయాత్రలు, ప్రసంగాలు మాత్రమే సరిపోవని, పార్టీ ప్రవర్తన కూడా విశాల ప్రజావసరాల పునాదితో సరిచేసుకోవాలనే సత్యాన్ని రాహుల్ గాంధీ అర్థం చేసుకోకపోతే మరో పదేండ్లయినా పదవిలోకి రావడం అసాధ్యం. ఈ మాత్రం బీసీలు, సామాజిక న్యాయం అని హస్తం పార్టీ కొత్త సేనాపతి అప్పుడప్పుడు అరవడానికి ఉత్తరాదిలో, దక్షిణాదిలో మరీ ముఖ్యంగా తమిళనాడులో భాగస్వామ్య పక్ష పార్టీలు బయటకెళ్లిపోకుండా ఉండటానికేనని అందరికీ అర్థమైపోతున్నది.
అయితే, ఏడున్నర దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ దగాను మళ్లీ తాజాగా రుచి చూపించిన రేవంత్ సర్కార్ బీసీలకు కాంగ్రెస్ చేసిన చారిత్రక గాయాలన్నింటినీ మళ్లీ గెలికేశాడు. అందుకే, ఇప్పుడు వృత్తి కులాలన్నీ ఉడికిపోతున్నాయి. ఇప్పటికే మోసపోయిన వర్గాలన్నీ హస్తం పార్టీ సర్కార్‌ను శాపనార్థాలు పెడుతుండగా, బీసీలు సైతం భ్రమలు తొలగి ఈసడించుకుంటున్నారు.
రేవంత్ సర్కార్ రిజర్వేషన్లు ఇవ్వకపోయినా బాధపడేవారు కాదేమో కానీ, బీసీలను నవ్వుల పాలయ్యేలా ఎగతాళి తతంగం నడిపించడాన్నే జీర్ణించుకోలేకపోతున్నారు. అందువల్లే బీసీలతో బంతాట కాంగ్రెస్ సర్కార్‌కు బూమరాంగ్ అయిపోయింది. ఈ రేవంత్ సర్కార్ నడిపిస్తున్న తతంగమంతా అర్థమైన తర్వాత ఇప్పటికైనా బీసీలు మాత్రమే కాదు ఆలోచనపరులందరూ వాస్తవాల వెలుగులో కదలాలి.కాంగ్రెస్, బీజేపీలు దేశంలో ఏ వర్గాన్నీ ఒడ్డుకు చేర్చరనే చారిత్రక సత్యాన్ని అవగాహన చేసుకోవాలి.
డీవోపీటీ 2019, జూలై 17న అధికారికంగా వెల్లడించిన 78 మినిస్ట్రీలు, అనుబంధ విభాగాల్లోని ఏ,బీ,సీ,డీ కేటగిరీ కేంద్ర ఉద్యోగుల్లో 27 శాతం రిజర్వేషన్లు అమలవుతున్న ఓబీసీలు 21.57 శాతం మాత్రమే ఉన్నారు. అదికూడా డీ కేటగిరీ దిగువశ్రేణి ఉద్యోగాల్లోనే అత్యధికమని గణాంకాలు చెప్తున్నాయి. రాజ్యాంగంలో ఉన్న 340 (1), 15(4), 16 (4) ఆర్టికల్స్ అమలునే ఏడున్నర దశాబ్దాల నుంచి ఎండమావిలా చూపించాయి ఏలిన జాతీయ పార్టీలు. ఇక రాష్ర్టాల్లో బీసీల హక్కులు అమలుపరుస్తాయా? ఒకవేళ డీఎంకే, ఆర్జేడీ, బీఆర్ఎస్, ఎస్పీ వంటి ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఆవిర్భవించకపోయి ఉంటే, కాంగ్రెస్, బీజేపీలు ఇంకెంత బరితెగించి దేశంలోని వివిధ వర్గాలను వేధించేవారో కదా? ఇప్పుడు రాష్ట్రంలో రేవంత్ సర్కార్ సృష్టించిన సమస్యలో నుంచే రిజర్వేషన్లకు తెలంగాణ అంతిమ పరిష్కారాన్ని వెతుక్కోవాలి. అది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదే పదే దేశం ముందు బలంగా పెడుతూ వస్తున్న రాష్ర్టాలకు రిజర్వేషన్ల అమలు హక్కుల డిమాండ్‌ను కేంద్రం మెడలు వంచి సాధించుకోవడమే. అప్పుడే, రాజ్యాంగ అంతిమ లక్ష్యమైన సమాఖ్య వ్యవస్థ సాకారమవుతుంది. భౌగోళిక, సామాజిక వైవిధ్యమైన దేశంలో రాష్ర్టాలకు వర్తమాన సవాళ్లను పరిష్కరించుకునే స్వేచ్ఛ లేకపోతే సుదీర్ఘ సామాజిక రుగ్మతలు మొత్తం సమాజాన్ని వేధిస్తూనే ఉంటాయి.
(వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)
-డాక్టర్ ఆంజనేయ గౌడ్