2011 సంవత్సరం.. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ఏఈగా పనిచేస్తున్నాను. దేశంలోనే రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవిని నిర్వర్తించిన, నిజాయితీపరుడిగా కీర్తిగడించిన ఈశాన్య రాష్ర్టానికి చెందిన ఐఏఎస్ అధికారి ఆ ప్రాంతంలో పదవీ విరమణ అనంతరం స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. గ్రామీణ ప్రాంతాల గృహ వినియోగదారులకు పగటిపూట కరెంటు ఉండేది కాదు. వారు నన్ను పిలిచి పగలంతా కరెంటు లేకుండా ఎలా ఉండగలమని ప్రశ్నించారు. అలాగే పట్టణ, నగర ప్రాంతాల కరెంటు పరిస్థితిని వాకబు చేశారు. పట్టణాలకు 4 నుంచి 6 గంటలు హైదరాబాద్ నగరంలో 2 గంటల కరెంటు కోతలుంటాయని బదులిచ్చాను.
ప్రస్తుతం రైతులందరికి ప్రకృతి అవాంతరాలు, స్థానికంగా సాంకేతిక సమస్యలు ఉన్నప్పుడు తప్ప నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతున్నది.
ఇది ఎల్లప్పుడూ కొనసాగుతుందా అంటే కొందరి నాయకుల మాటలు వింటుంటే అనుమానాలు కలుగుతున్నాయి. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ రైతులకు అందని వెసులుబాటు సౌకర్యం మన రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందించారు. అదీ ఉచితంగా.
తను ఆవేదనతో, ఆవేశంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు మనుష్యులు కారా? ఇంత వివక్ష ఎందుకు? మీరు చేస్తున్న పని అమానవీయమని అనిపించడం లేదా అంటూ నన్ను ప్రశ్నించారు. నా చేతుల్లో ఏమీ లేకపోవడంతో జరుగుతున్న పరిణామాల పట్ల అభ్యంతరం ఉన్నా తలవంచుకొని సిగ్గుతో ఉండిపోయాను. వెంటనే వారు డిస్కం అత్యున్నత అధికారికి ఫోన్‌చేసి తీవ్రమైన పదజాలంతో తమ నిరసనను, అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మాట్లాడారు. కానీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల కాలంలోనే గృహ వినియోగదారులకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలతో సహా 24 గంటల కరెంటు సాధ్యపడింది.
అర్ధరాత్రి, అపరాత్రి భిక్షంగా వేసే అరకొర కరెంటు, విత్తనాల కొరత, కొరవడిన మద్దతు ధర, ఎరువుల కటకటల మధ్య అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తూ తాము సమిధలవుతున్నా ప్రజలకు పట్టెడన్నం పెడుతూ ఉండిన తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అందించిన అపురూపమైన కానుక 24 గంటల ఉచిత విద్యుత్తు. 2018 జనవరి 1 నుంచి మన రాష్ట్రంలో నిరాటంకంగా అమలవుతుండటం ఒక చరిత్ర.
దేశవ్యాప్తంగా ఉత్పత్తి సామర్థ్యం 4 లక్షల మెగావాట్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఇతర వర్గాల వినియోగదారుల మాదిరిగా అంటే గృహ, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు ఇస్తున్నట్టుగానే రైతులకు కూడా 24 గంటల విద్యుత్తును అందుబాటులో ఉంచిన ఏకైక రైతు పక్షపాతి కేసీఆర్. గతేడాది విద్యుత్తు సవరణ బిల్లు-22ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతూ వచ్చిన నేపథ్యంలో కూడా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు నినాదం నుంచి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన రైతు బాంధవుడు కేసీఆర్. విద్యుత్తును వృథా చేయకుండా రైతులకు చైతన్యం కలిగించాలి తప్ప, 24 గంటల విద్యుత్తు ఇవ్వకూడదనేది సరికాదు. వ్యవసాయ వినియోగం లెక్కించడానికి శాస్త్రీయమైన పద్ధతులు అవలంబించాలి తప్ప రైతులకు 24 గంటల విద్యుత్తును అందుబాటులో ఉంచకూడదనే వాదన సరికాదు.
రాష్ట్రవ్యాప్తంగా 27,48,598 వ్యవసాయ పంపుసెట్ల ద్వారా సౌకర్యవంతంగా వ్యవసాయం చేసుకుంటూ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా తమ స్థితిగతులను మెరుగుపర్చుకుంటున్న రైతులు ఎవ్వరూ గతంలోని అధ్వాన్న, భీతావహ పరిస్థితులు పునరావృతం కావాలని కోరుకోరు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక మునుపు వ్యవసాయరంగంలో కరెంటు అత్యంత దయనీయంగా ఉండిన పరిస్థితులు. పగలు 3 గంటలు, రాత్రి 3 గంటల కరెంటు మాత్రమే సరఫరా కావడంతో ఎక్కడచూసినా పంటలు ఎండిపోయి, అప్పులు తీర్చలేక రైతులు ప్రత్యేకించి చిన్న, సన్నకారు రైతులు తరచూ ఆత్మహత్యకు పాల్పడే విషాదకర సన్నివేశాలు కలచివేసేవి. నిర్దిష్ట సమయంలో మూడు ఫేజుల విద్యుత్తు సరఫరా కావడంతో ఒక్కసారే రైతులు ఆటోస్టార్టర్ల ద్వారా మోటర్లు ఆన్ చేయడంతో ట్రాన్స్ఫార్మర్లు విరివిగా కాలిపోవడం జరిగేది. రబీ సీజన్లో కాలిన ట్రాన్స్ఫార్మర్లు తీసుకొని రైతులు రిపేరింగ్ షెడ్ల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. ట్రాన్స్ఫార్మర్ల మీద అధిక భారం పడటంతో లో వోల్టేజీతో ఎండిన పంటలు ఎక్కడికివెళ్లినా సాధారణ దృశ్యం. లో వోల్టేజీ సమస్యతో రైతుల పంపు మోటర్లు కాలిపోయి వాటి రీవైండింగ్కు వేలాది రూపాయలు కట్టాల్సిన దుస్థితి.
కొత్త కనెక్షన్లు కోసం ఏండ్ల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. ఏడాదిలో మండలానికి 20-30 కనెక్షన్ల కంటే ఎక్కువ ఇవ్వలేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ కనెక్షన్ల మంజూరీ విషయంలో సీలింగ్‌ను ఎత్తివేయడంతో గత తొమ్మిదేండ్ల కాలంలో ఎనిమిది లక్షలకు పైగా బోర్లకు కొత్త కనెక్షన్లు ఇవ్వడం ఒక మహత్తరమైన విజయంగా చెప్పవచ్చు.
దేశం మొత్తమ్మీద ఏ రాష్ట్రంలోనూ రైతులకు 10 గంటలకు మించి కరెంటు ఇవ్వడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో 9 గంటలు, కర్ణాటకలో 7 గంటలు, గుజరాత్లో 8 గంటలు, మహారాష్ట్రలో 8 గంటలు, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో 10 గంటలు మాత్రమే ఇస్తున్నారు. ఈ కరెంటును ఏకబిగిన కాకుండా రెండు, మూడు విడతలుగా ఇస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోనే రైతులకు 24 గంటలు మూడు ఫేజుల నాణ్యమైన విద్యుత్తు అందుబాటులో ఉంటున్నది. అందువల్ల టాన్స్‌ఫార్మర్లు పేలిపోవడం, మోటర్లు కాలిపోవడం, అర్ధరాత్రి, అపరాత్రి రైతులు ఫ్యూజులు మార్చడానికి ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకుంటున్న దుర్ఘటనలు జరగడం లేదు.
ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు కాలిపోవడం గణనీయంగా తగ్గిపోయి రైతులు, విద్యుత్తు సంస్థలు కూడా వృథా ఖర్చును తగ్గించుకున్నట్టయ్యింది. రైతులకు నాణ్యమైన నిరంతరాయ కరెంటు లభించడం, పంటల నుంచి కూడా మంచి దిగుబడి రావడంతో రైతుల ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడ్డాయి. తెలంగాణలో రైతులకు ఉచితంగా కరెంటు లభిస్తుండగా రాజస్థాన్‌లో నెలకు హెచ్‌పీకి రూ.635, బీహార్‌లో రూ.800, గుజరాత్లో రూ.200, జార్ఖండ్‌లో రూ.400, మహారాష్ట్రలో రూ.355, యూపీలో రూ.150 రైతుల వద్ద వసూలు చేస్తున్నారు. 2018 జనవరి 1 నుంచి కరెంటు పరంగా తెలంగాణ రైతాంగానికి స్వర్ణయుగంగా పేర్కొనవచ్చు. ఎందుకంటే ఆరోజు నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్తును ప్రారంభించారు కాబట్టి.
అప్పట్లో… పగలు 3 గంటలు, రాత్రి 3 గంటల కరెంటు వ్యవసాయానికి ఇస్తున్న చీకటి రోజులు. తాండూరు సమీపంలోని ఐనెల్లి, మిట్టబాస్పల్లి, జిన్గుర్తి, గ్రంతబాస్పల్లి, కోటబాస్పల్లి (ప్రస్తుత విద్యశాఖమంత్రి పుట్టినిల్లు) తదితర గ్రామాల ప్రజలు ఉల్లిగడ్డ పంటను యాసంగి పంటగా పండించేవారు. ఉల్లిగడ్డ మడులు చిన్నగా ఉంటాయి. నీళ్లు మనిషి దగ్గరుండి మరీ పారించుకోవాల్సి ఉంటది. ఇచ్చే ఆరు గంటల కరెంటును పగటిపూట ఇవ్వవలసిందిగా స్థానిక ప్రజలు విజ్ఞాపన పత్రం సమర్పించుకున్నారు.
పగలు 6 గంటలు ఇచ్చే అధికారం ఏఈ, ఏడీఈ, డీఈ స్థాయి అధికారులకు కూడా లేదు. చివరికి అప్పటి ఎస్ఈ కూడా తమ నిస్సహాయతను వ్యక్తం చేశారు. విధిలేని పరిస్థితుల్లో రైతులందరూ కలిసి అప్పటి తాండూరు ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ పి.మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ యం.వి.శేషాద్రికి విన్నవించుకున్నారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని డిస్కం, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌కు సమస్యను వివరించి కేవలం ఆ గ్రామాల పరిధిలోని ఫీడర్‌కు పగటిపూట 6 గంటల కరెంటు రెండు నెలల పాటు ఇచ్చేలా ఆదేశాలు ఇప్పించారు. వ్యవసాయానికి కరెంటు కష్టాలు అంత గంభీరంగా ఉండేవి. ప్రస్తుతం రైతులందరికి ప్రకృతి అవాంతరాలు, స్థానికంగా సాంకేతిక సమస్యలు ఉన్నప్పుడు తప్ప నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతున్నది. ఇది ఎల్లప్పుడూ కొనసాగుతుందా అంటే కొందరి నాయకుల మాటలు వింటుంటే అనుమానాలు కలుగుతున్నాయి. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ రైతులకు అందని వెసులుబాటు మన రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందించారు. అదీ ఉచితంగా.
(వ్యాసకర్త: టీఎస్ఎస్పీడీసీఎల్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు)
-తుల్జారాంసింగ్ ఠాకూర్
78930 05313