గడిచిన పదేండ్ల కాలంలో 23 వేల మంది మిలియనీర్లు భారత్‌ను వదిలి అభివృద్ధి చెందిన దేశాలకు వలస వెళ్లారు. ఒక్క సంవత్సరంలోనే అంటే, 2025లో సుమారు 3,500 మంది మిలియనీర్లు మన దేశం విడిచి వెళ్లినట్టు హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ నివేదిక ద్వారా తెలుస్తున్నది. గడిచిన పదేండ్ల సగటుతో పోలిస్తే 2025లో నమోదైన వలసలు దాదాపు 50 శాతం ఎక్కువ కావడం గమనార్హం. సంపన్నులు దేశం విడిచి వెళ్లడమంటే వారితో పాటు సంపద కూడా మన దేశం దాటి వెళ్తున్నట్టు గుర్తించాలి. సంపద మాత్రమే కాదు, ఉపాధి అవకాశాలు కల్పించే సంపన్నులు దేశం విడిచి వెళ్తున్నారనే విషయాన్ని గ్రహిస్తే దానివల్ల జరిగే నష్టం కూడా అర్థమవుతుంది.
ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా, ఏ మూలకు వెళ్లినా మనకు భారతీయులు, ముఖ్యంగా మన తెలుగువాళ్లు ఎక్కువగా పని చేస్తూ కనిపిస్తారు. ఐటీ రంగంలో తెలుగువాళ్లు పెద్ద సంఖ్యలో ఉంటే, వ్యాపార రంగంలో గుజరాతీలు ఉన్నారు. గల్ఫ్ దేశాల్లో శ్రామికులూ మన వాళ్లే. కెనడాలో పంజాబీలు ఏకంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి అధికారంలో పాలుపంచుకున్నారు. వేలాది మంది తెలుగువాళ్లు అమెరికాలో చదువు కోసం వెళ్లి, అక్కడే ఉద్యోగాలు చేస్తూ మన దేశానికి సంపద పంపుతున్నారు. వీరి వల్ల దేశంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. అయితే అదే సమయంలో దీనికి పూర్తిగా భిన్నమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడ ఉపాధి పొంది, ఏదో ఒక పరిశ్రమ స్థాపించి, నలుగురికి ఉపాధి కల్పించడమే కాకుండా తామూ బాగా సంపాదించిన వారు విదేశాల్లో స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ప్రస్తుతం విదేశాలకు సంపద తీసుకువెళ్లే భారతీయుల కంటే విదేశాల్లో తాము సంపాదించిన డబ్బును తిరిగి భారత్‌కు పంపే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నది. దీనివల్ల ఇది ప్రస్తుతానికి పెద్దగా నష్టం కలిగించకపోయినా క్రమంగా ప్రమాదకర స్థాయికి చేరే సూచనలు కనిపిస్తున్నాయి.
విదేశాలకు చదువులు, ఉపాధి నిమిత్తం వెళ్లేవారిలో తెలుగువారే ఎక్కువగా ఉంటారు. ఏటా అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్తున్నవారిలో సుమారు 50 వేల మంది తెలుగువాళ్లే ఉంటున్నారు. చదువులు పూర్తయ్యాక వాళ్లు అక్కడే ఉద్యోగం చేస్తూ తమ సంపాదనను స్వదేశానికి పంపిస్తున్నారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పెరుగుదలలో వీరిదే కీలకపాత్ర. పిల్లలు డాలర్లలో సంపాదించి పంపిస్తే, వారి తల్లిదండ్రులు రూపాయల్లో వాటిని రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడుతుంటారు. వీరి సంపాదన ఇప్పటి వరకు దేశానికి ఉపయోగపడింది. కానీ, క్రమంగా ఈ విధానం మారుతున్నది. అమెరికాలో సంపాదించిన డాలర్లను అమెరికాలోనే ఇన్వెస్ట్ చేసే కొత్త ట్రెండ్ ఇటీవల మొదలైంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై ఈ ప్రభావం కనిపిస్తున్నది. అమెరికాలో సంపాదించిన సొమ్మును అక్కడే ఇన్వెస్ట్ చేసే వర్గం ఒకటైతే, ఇండియాలో సంపాదించి అమెరికా వంటి దేశాల్లో స్థిరపడుతున్న వర్గం మరొకటి. అయితే, ఇటీవల రెండో వర్గం సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. దేశ భక్తి లోపించడమే దీనికి కారణమని సంజయ్ బారు లాంటి వాళ్లు విమర్శిస్తుంటే, ఆర్థిక విశ్లేషకులు మాత్రం దీన్ని గ్లోబల్ ట్రెండ్‌గా భావిస్తున్నారు.
బ్రెయిన్ డ్రెయిన్ కన్నా వెల్త్ మైగ్రేషన్ దేశానికి ప్రమాదకరం. బ్రెయిన్ డ్రెయిన్ వల్ల మన దేశంలో ఒక నిరుద్యోగి తగ్గుతాడు. అమెరికా వంటి దేశాల్లో ఉపాధి పొందుతూ డాలర్లలో సంపాదన పంపడం వల్ల ఆ సొమ్ముతో దేశంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కానీ, వెల్త్ మైగ్రేషన్ ఫలితం దీనికి భిన్నంగా ఉంటుంది. వెల్త్ మైగ్రేషన్ మూలంగా ఉపాధి అవకాశాలు తగ్గడంతో పాటు సంపద కూడా తరలివెళ్తుంది.
బెంగళూరుకు చెందిన యువ పారిశ్రామికవేత్త చేసిన ఓ ట్వీట్ ఈ మధ్య బాగా వైరల్ అయింది. ‘18 నెలల్లో రూ.4 కోట్ల పన్ను కట్టాను. అయినా తనిఖీల పేరుతో ఇటు రాష్ట్ర జీఎస్టీ, అటు ఐటీ అధికారులు వేధిస్తున్నారు. కొత్త సంవత్సరంలో వేరే దేశానికి వెళ్లి వ్యాపారం చేసుకుంటాను’ అని రోహిత్ ష్రాఫ్ సోషల్ మీడియాలో తన ఆవేదనను పంచుకున్నారు. ఇలాంటి పారిశ్రామికవేత్తలు దేశం వదిలినా, విదేశాల్లో వ్యాపారం చేసుకున్నా అధికారులకు కలిగే నష్టమేమీ లేదు. వారి జీతానికి, ఆదాయానికి డోకా లేదు. కానీ, అసలు నష్టం దేశానికే జరుగుతుంది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ప్రచారంలో తప్ప వాస్తవంలో లేదు. ‘ఆదాయ పన్ను లేదు. మీ సంపదపై ఎలాంటి పన్నులు ఉండవు. మీ రియల్ ఎస్టేట్ సంపాదనపైనా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రండి .. రండి’ అని ఓ వైపు దుబాయ్ పిలుస్తుంటే మన దేశంలో మాత్రం వెళ్లం డి.. వెళ్లండి’ అని బలవంతంగా బయటికి నెట్టివేసే పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచం మారుతున్నది. దీని కి తగ్గట్టుగా మారకపోతే దేశానికి కోలుకోలేని దెబ్బ తగులుతుంది.
అమెరికా, కెనడా, గల్ఫ్ దేశాల్లో పని చేసేవారి నుంచి మన దేశానికి ఎక్కువగా డబ్బులు వస్తున్నాయి. 2024లో మన దేశానికి 129 బిలియన్ డాలర్ల సంపద వచ్చినట్టు వరల్డ్ బ్యాంకు నివేదిక చెప్తున్నది. ఆర్బీఐ నివేదిక ప్రకారం 119 బిలియన్ డాలర్ల సంపద భారత్‌కు వచ్చింది. మన దేశానికి మన వాళ్లు పంపే నిధుల్లో అమెరికా, కెనడా, గల్ఫ్ దేశాల వాటా 70 శాతం వరకు ఉంటుంది. అయితే, ఒకవైపు అమెరికాలో సంపాదిస్తున్న వాళ్లు అమెరికాలోనే ఇన్వెస్ట్ చేసే సంస్కృతి ఊపందుకుంటుండగా, మరోవైపు పన్నులు లేని దేశంగా పేరొందిన యూఏఈలో ఇన్వెస్ట్ చేయడం మొదలైంది. గల్ఫ్‌లో రియల్ ఎస్టేట్ రంగంపై పెట్టుబడులు పెడుతున్నది ఎక్కువగా మన వాళ్లే. మన దేశంలో పన్నుల భారాన్ని నరకంగా భావిస్తున్న వారికి యూఏఈ స్వర్గధామంగా కనిపిస్తున్నది. అమెరికాలోనూ గల్ఫ్ రియల్ ఎస్టేట్ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నారు. అమెరికాలో చదువుకోవడానికి వెళ్లి ఇప్పుడిప్పుడే ఉద్యోగం చేస్తున్నవాళ్లు కూడా గల్ఫ్ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
దేశ భక్తి లేదనే సినిమా డైలాగుల వల్ల ప్రయోజనం లేదు. కనీసం మన వాళ్ల పెట్టుబడినైనా ఆకర్షించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మూడు నాలుగు దశాబ్దాల క్రితం విదేశాలకు వెళ్లినవారికి ఈ దేశం పట్ల, ఈ దేశంలో ఉన్న తమ మూలాల పట్ల, తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఉండేది. ఆ ప్రేమ వారిని దేశంతో అనుబంధాన్ని కొనసాగించేటట్టు చేసింది. ఇప్పుడు కాలం మారింది. అనుబంధాలు, మూలాలు నేటితరాన్ని కట్టిపడేయలేవు. లాభనష్టాలు మాత్రమే వారిని కట్టిపడేస్తాయి.
పిల్లలు పుట్టిన రెండేండ్లకే తల్లిదండ్రుల వద్ద కన్నా ప్రీ స్కూల్లోనే ఎక్కువగా ఉంటారు. 10-15 ఏండ్ల పాటు ఇంటికి దూరంగా హాస్టల్లోనే చదువు కొనసాగుతుంది. అలా చదివితేనే ఐఐటీ, మెడిసిన్ లేదా ఇతర మంచి కాలేజీలలో సీటు వస్తుంది. ఐఐటీలో సీటు అంటే ఇక ఇంటికి దూరమే. ఐఐటీ చదువులు పూర్తయ్యాక అటు నుంచి అటే నేరుగా అమెరికాలో వాలిపోతారు. ఈ ట్రెండ్ ఇప్పుడు తెలుగునాట ఇంటింటి కథలా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో నవతరానికి తల్లిదండ్రుల పట్ల పెద్దగా ప్రేమ, అనుబంధాలు ఉండే అవకాశాలు లేవు. పుట్టినప్పటి నుంచి ఇంటికి దూరంగా ఉండి చదువుకున్న వారికి తల్లిదండ్రులతో విపరీతమైన అనుబంధం ఉంటుందని, ఉండాలని ఆశించలేం. తల్లిదండ్రులతోనే అనుబంధం లేనప్పుడు ఇక దేశం పట్ల, తమ మూలాల పట్ల ప్రేమను, అనుబంధాన్ని ఆశించడం అత్యాశే అవుతుంది.
దేశ భక్తి అని రాజకీయ విమర్శలు కాకుండా దేశంలో పరిస్థితులను మార్చడానికి సర్కార్ ప్రయత్నించాలి. ఏదైనా విషయంలో కోర్టుకు వెళ్తే నాలుగైదు దశాబ్దాలైనా కేసు తేలదు. ఇలా ఇరుక్కుపోవడం కన్నా తమకు మంచి అవకాశాలున్న, అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండటం మంచిదని చాలామంది భావిస్తున్నారు. ప్రస్తుతం వీరి సంఖ్య తక్కువే కావచ్చు. కానీ, వేగంగా వృద్ధి చెందుతున్నది. మిలీనియం తరం సంపాదనపరులుగా మారిన తర్వాత ఈ దేశంలో కన్నా విదేశాల్లో ఉండటం, అక్కడే సంపాదన, అక్కడే స్థిరంగా ఉండటం బెటర్ అనుకునేవారి సంఖ్య భారీగా పెరుగుతుంది. ఉపాధి, సంక్షేమ పథకాల కోసం ఎదురుచూసే వారు మాత్రమే దేశంలో ఉండి, ఉపాధి కల్పించేవారు విదేశాలకు వెళ్లిపోయే పరిస్థితి దేశానికి ఏ మాత్రం మంచిది కాదు.
-బుద్దా మురళి
98499 98087