ఈ నెల 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆయా పార్టీలు ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రజలు ఓట్లు వేస్తేనే అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీలు తమ తమ మ్యానిఫెస్టోతో ప్రజలను ఆకర్షించేందుకు పోటీ పడుతున్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, డీఎస్పీ, ఇతర పార్టీలు మ్యానిఫెస్టోను కొన్నిరోజుల కిందటే విడుదల చేశాయి. అయితే అధికార యావలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను తీసుకొచ్చింది. 10కి మించిన సరికొత్త హామీలతో బీఎస్పీ బహుజన వాదాన్ని ప్రజల ముందుంచింది. డీఎస్పీ దశ వాగ్దానాలను ప్రకటించింది.
అయితే అన్ని పార్టీల మ్యానిఫెస్టోలు దాదాపు ఒకే తీరుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కొంత ఆలస్యంగానైనా… కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో పలు అంశాలతో కూడిన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. సకలజనుల సౌభాగ్య పేరుతో ఇందులో 10 ప్రధానాంశాలను షా ప్రకటించారు. వీటికితోడు రాష్ట్రంలోని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. ‘బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్న వృద్ధులను అయోధ్య, కాశీ లాంటి యాత్రలకు ఉచితంగా తీసుకువెళ్తాం’ అని కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని చూసి ‘ఇంకా నయ్యం.. స్వర్గానికి ఉచితంగా తీసుకెళ్తామని’ ప్రచారం చేయడం లేదని ప్రజలు వ్యంగ్యంగా చర్చించుకుంటున్నారు.
తలారి గణేష్
99480 26058