ఖమ్మం జిల్లాకు చెందిన రమేష్ అనే ఎంపీడీఓ పదవీ విరమణ పొందిన కొన్ని నెలలకే తీవ్ర అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు. ఇదే జిల్లాకు చెందిన పాండురంగయ్య అనే రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు సైతం అనారోగ్యంతోనే అసువులు బాశాడు. వెంకటేష్ అనే విశ్రాంత ఉద్యోగి తన భార్య తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో అప్పు చేసి మరి చికిత్స చేయించాడు. అయినా ఫలితం శూన్యం. ఇలా.. ఒక్కో విశ్రాంత ఉద్యోగిది ఒక్కో గాథ.
2024, మార్చి నుంచి రిటైర్ అయిన సుమారు 16 వేల మంది విశ్రాంత ఉద్యోగులు తమకు రావాల్సిన బెనిఫిట్స్ అందక యాతనలు పడుతున్నారు. అందుకే, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనలు తెలియజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖలలో 30 ఏండ్లకు పైగా సేవలందించి ఉద్యోగ విరమణ చేసినవారికి న్యాయంగా రావలసిన జీపీఎఫ్ ప్రభుత్వం వద్దే బకాయిపడి ఉంటున్నది. గ్రాట్యుటీ, కమ్యూటేషన్, సరెండర్ లీవ్, జీవిత బీమా, తదితర ఆర్థిక బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులను తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నది. అందుకే వేరే దారిలేక ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతూ ప్రభుత్వంపై వారు ధ్వజమెత్తుతున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వారి బకాయిలు రాబట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోవడం విడ్డూరం.
ఇదే క్రమంలో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన బెస్ట్ అవైలెబుల్ స్కూళ్లకు చెల్లించాల్సిన రూ.200 కోట్ల పైచిలుకు బకాయిలు, సుమారు రూ.9 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, పెండింగ్‌లో ఉన్న మెస్ ఛార్జిలు, విద్యాశాఖలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు, అన్నీ కలిపి రూ.240 కోట్లను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల కోసం అన్నిరంగాల ఉద్యోగులు నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. అయితే, విశ్రాంత ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గత 22 నెలలుగా తమకు రావాల్సిన సుమారు రూ.9 వేల కోట్ల బకాయిల కోసం ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.
రిటైర్ అయిన తర్వాత సొంతిల్లు కొనుక్కోవాలనీ, బిడ్డల పెండిండ్లు చెయ్యాలనీ దాచుకున్న డబ్బులు పదవీ విరమణ తర్వాత అందకపోవడంతో వారు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ప్రభుత్వ శాఖల్లోని అటెండర్ స్థాయి నుంచి ఉన్నతాధికారి స్థాయి వరకు సర్వీస్ నుంచి రిటైర్ అయ్యే సమయంలో ఒక్కొక్కరికి సుమారు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. కానీ, 2024 మార్చి నుంచి పదవీ విరమణ పొందినవారికి బెనిఫిట్స్ సొమ్ము అందివ్వకపోగా, పెన్షన్ మాత్రమే విడుదల చేస్తున్నది. జీపీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్, ప్రభుత్వ ఇన్సూరెన్స్ గ్రాట్యుటీ తదితర బెనిఫిట్స్‌ను తన వద్ద పెండింగ్‌లో పెట్టుకొని ఇబ్బందులకు గురిచేస్తున్నదని విశ్రాంత ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం మొండికేస్తున్నది. ఒక పక్క హైకోర్టు తీర్పును అమలుచేయకుండా మరో పక్క పెన్షనర్ల ఆందోళనలను పట్టించుకోకుండా ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తున్నది. సర్వీస్‌లో దాచుకున్న డబ్బులైనా కనీసం తిరిగివ్వాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. గత ఆగస్టులో రిటైర్డ్ ఉద్యోగులకు ప్రతి నెల రూ.700 కోట్లు చెల్లిస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పి మాట తప్పారని పండుటాకులు ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉంటే ఐదు డీఏలు, పీఆర్సీలు పెండింగ్‌లో ఉన్నాయంటూ ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఆందోళనల బాట పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీరు విస్మయం కలిగిస్తున్నది.
(వ్యాసకర్త: ఫ్రీలాన్స్ జర్నలిస్ట్)
-వనం నాగయ్య
9441877695