‘కడుపు గంజికి ఏడిస్తే సిగ మల్లెపూలకు ఏడ్చినట్టు’ కాంగ్రెస్ పాలన సాగుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ వైపు రాష్ట్రంలో రైతు భరోసా కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటే, గురుకుల పాఠశాలల్లో పిల్లలు తిండికోసం రోడ్డెక్కుతుంటే పాలకులు మాత్రం భూములు చెరబట్టే ఘాతుకానికి తెగిస్తున్నారు. ప్రజాపాలన అని కల్లబొల్లి మాటలు చెప్తూ కార్పొరేట్లకు దోచిపెట్టే విధానాలను హస్తం పార్టీ పెద్దలు యథేచ్ఛగా నడిపిస్తున్నారు. కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో అడుగడుగునా పేదల పొట్టగొట్టే పాలసీలను తెరపైకి తీసుకొస్తున్నది. ఓవైపు హైడ్రా బుల్డోజర్ రాజ్‌తో విధ్వంసకాండ సృష్టిస్తున్నది. మరోవైపు భూములను చెరపట్టి సొమ్ము చేసుకునేందుకు సర్కార్ తహతహలాడుతున్నది. మూసీ ప్రాజెక్టు పేరిట ప్రభుత్వం వేస్తున్న ఎత్తుగడలు ఇందుకు తాజా ఉదాహరణగా నిలుస్తాయి. మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ ముసుగులో కాంగ్రెస్ అడ్డగోలు దోపిడీకి పథక రచన చేసుకున్నట్టు స్పష్టమైపోయింది.
ఎలాంటి డీపీఆర్‌లు లేకుండా మూసీ పరీవాహక ప్రాంతంలో పేదల ఇండ్లు, ఆస్తులు, ఉపాధి కేంద్రాలను నేలమట్టం చేయడానికి పూనుకున్నది. హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు సుమారు 1500 ఇండ్లను కూల్చివేసేందుకు సిద్ధమైంది. ఇది పైకి చెప్తున్న లెక్క మాత్రమే. కానీ వాస్తవానికి మూసీ ప్రాజెక్టు మొత్తంలో ఇప్పటికే 10 వేల ఇండ్లకు అధికారులు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. అసలు ప్రాజెక్టు ఏంటి? దాని లక్ష్యం ఏంటి? ఆర్థిక వనరుల సమీకరణ ఎలా? అనే విషయాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదు. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ రుణం ఇస్తుందని ప్రభుత్వం చెప్తున్నది. కానీ మార్చి 11 వరకు తమకు ఎలాంటి డీపీఆర్ రాలేదని ఆ బ్యాంకు స్పష్టం చేసింది. మరి ప్రభుత్వం అసలు ఏమి చేయదల్చుకుంటున్నది? అన్ని విషయాలూ పారదర్శకంగా ఎందుకు వెల్లడించడం లేదు? దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేదలను వీధిపాలు చేసి, రంగురంగుల పర్యాటకాన్ని సృష్టిస్తామని కథలు చెప్పడం ఏమిటి?
హిమాయత్‌సాగర్ నిర్మాణంలో పాలుపంచుకున్న కూలీలకు భూములను నాటి నిజాం ఇచ్చారు. అదే హిమాయత్‌సాగర్ గ్రామంలో మూడు తరాలుగా వాళ్లంతా నివాసం ఉంటున్నారు. ఇప్పుడు ఇది మీ ఊరు కాదు, మీ భూమి కాదని చెప్తుంటే వాళ్లు ఎలా తట్టుకోవాలి? ప్రభుత్వ అమానవీయ వైఖరి ముమ్మాటికీ ఆమోదయోగ్యమైన, ఆహ్వానించదగ్గ అభివృద్ధి నమూనా కాదు. మూసీ ప్రక్షాళనకు గత ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నది. మూసీలోకి వ్యర్థాలు రాకుండా చూడటం, నదీ తీరంలో పచ్చదనం, పార్కులు అభివృద్ధి చేయడం వంటి ప్రణాళికలు అమలు చేసింది. పలు ప్రాంతాల్లో ఆ అభివృద్ధి మనకు కనిపిస్తున్నది.
పేదలను తరిమికొట్టకుండా, వారి ఇండ్లను ధ్వంసం చేయకుండా సాంకేతిక పరిజ్ఞానంతో మూసీ నదికి పునరుజ్జీవం కలిగించవచ్చని నిరూపించింది. అలాంటి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లకుండా కాంగ్రెస్ సర్కార్ కొత్తగా రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవతారం ఎత్తింది. నది పేరు చెప్పి తీరాన్ని అమ్ముకునేందుకు ఉరకలు వేస్తున్నది. బఫర్‌జోన్‌లో ఉన్నాయంటూ కూల్చేసే గుడిసెలు, ఇండ్ల స్థానంలో ఆకాశహర్మ్యాలు కడతామని డంబాలు పలుకుతున్నది. అవి బఫర్‌జోన్‌లో పరిధిలోకి రాకుండా పోతాయా? ఇదెక్కడి విడ్డూరం?
మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ ప్రాజెక్టులపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని విపక్ష బీఆర్ఎస్ నిలదీస్తున్నది. కానీ పాలకపక్షం ఆ ప్రశ్నలను నిలువరించాలనే ధోరణిలో అడ్డుతగలడం, చర్చను పక్కదోవ పట్టించడంపై దృష్టి పెడుతున్నదే తప్ప, తాము ఆహా ఓహో అని చెప్పుకొనే ప్రాజెక్టుపై అడిగిన వివరాలను వెల్లడించలేకపోతున్నది. బఫర్‌జోన్ నిర్ధారించకుండా, డీపీఆర్ లేకుండా పాలక పెద్దలు తమ రియల్ ఎస్టేట్ తెలివితేటలతో ఇండ్ల మీదకు దండయాత్ర సాగించడం సరికాదు.
నచ్చిన చోట, తోచిన విధంగా ఇండ్లు కూల్చి కార్పొరేట్లకు కట్టబెట్టడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. అందుకు గాంధీ మహాత్ముడి పేరు వాడుకోవడం హేయం, దుర్మార్గం. లగచర్ల, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, వెలుగుమట్లలో ప్రజాపోరాటాల ధాటికి కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణి వీడకతప్పలేదు. ఇప్పుడు మూసీ విధ్వంసక విధానాలకు వ్యతిరేకంగా బాపూజీ బాటలో పోరాడుతున్న బాధితులదే అంతిమ విజయం అవుతుంది. మూసీ ముసుగులో సాగుతున్న రియల్ దందా వీగిపోక తప్పదు. ప్రజలంటే, ప్రజల జీవితాలంటే పట్టింపులేని కాంగ్రెస్ పాలకులకు మిగిలేది పరాభవమే.