హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : గత యాసంగి కంటే ఈసారి రైతులు 30 వేల టన్నుల యూరియాను అధికంగా కొనుగోలు చేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వెల్లడించారు. బుధవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ సభ్యుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు అడిగిన ప్రశ్నకు మంత్రి తుమ్మల సమాధానమిస్తూ.. గత యాసంగిలో 10.24 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కొనుగోలు చేస్తే, ఈ యాసంగి మార్చి 18 నాటికి 10.73 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారని తెలిపారు. రైతులు క్యూలైన్లలో నిలబడే పరిస్థితి ఉండొద్దనే ఉద్దేశంతోనే యూరియా యాప్‌ని తీసుకొచ్చినట్టు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా 20.74 లక్షల మంది రైతులు 88.35 లక్షల యూరియా సంచులను కొనుగోలు చేశారని, వీరిలో 17,926 మంది కౌలు రైతులు, 23,087 మంది ఎన్డీఎస్ రైతులు కూడా ఉన్నట్టు వివరించారు.