అమెరికా జైలులో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నెల్లుట్లకు చెందిన కుర్రెముల సాయికుమార్ (31) జూలై 26వ తేదీన ఉరివేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లుట్లకు చెందిన కుర్రెముల ఉప్పలయ్య-శోభ దంపతుల కుమారుడు సాయికుమార్ పదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. ఒక్లహామాలోని ఎడ్మండ్ నగరంలో ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం అక్కడే ఉద్యోగం చేస్తున్న బంధువుల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాగా, స్నాప్‌చాట్‌లో 15 ఏళ్ల బాలుడిగా నమ్మిస్తూ బాలికలతో స్నేహం చేసేవాడని, ఆ బాలికల అశ్లీల వీడియోలు సేకరించి సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేసేవాడని 2023 అక్టోబర్‌లో సాయికుమార్‌పై అమెరికా పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా లాక్డౌన్ సమయంలో ముగ్గురి బాలికలను లైంగికంగా వేధించడంతో పాటు.. 19 మంది బాలికల అసభ్యచిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి బెదిరించినట్లుగా విచారణలో వెల్లడైంది.
ఈ ఆరోపణలు రుజువు కావడంతో బాలికలపై వేధింపులు, చైల్డ్ పోర్నోగ్రఫీని అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించిన అమెరికా కోర్టు ఈ ఏడాది మార్చి 27వ తేదీన సాయికుమార్‌కు 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో మనోవేదనకు గురైన సాయికుమార్ జూలై 26వ తేదీన జైలులోనే ఉరివేసుకున్నాడు. కాగా, అతని కుటుంబసభ్యులు అమెరికాకు వెళ్లి అంత్యక్రియలు పూర్తి చేసినట్లు సమాచారం.