Mahesh Bigala | సిట్ పేరుతో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్)కు నోటీసులు జారీ చేయడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేపట్టిన డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమేనని బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వెబ్ సిరీస్‌లాంటి రాజకీయ నాటకాన్ని నడుపుతోందని విమర్శించారు.
ఒక రోజు కేటీఆర్, మరో రోజు హరీష్‌రావు, నిన్న సంతోష్‌రావు ఇలా రోజుకో బీఆర్ఎస్ నాయకుడిని సిట్ పేరుతో పిలుస్తూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికాలో ఉండగా.. అక్కడి నుంచి తన నాయకులు ఏదో చేస్తారనే ఉద్దేశంతో ఈ విధమైన డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని మహేష్ బిగాల ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి కక్షపూరిత కేసులు, విచారణలు పెడుతున్నారని స్పష్టం చేశారు.
ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలు రైతుల కష్టాలు, నిరుద్యోగం, హామీల అమలు వైఫల్యం, పాలనలో గందరగోళం.. వీటిపై మాట్లాడకుండా, రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని నోటీసులు, విచారణల పేరుతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
కాళేశ్వరం, సిట్ అని ఏదో ఒక అంశంతో కాలయాపన..
ప్రభుత్వం ఏర్పడిన మొదటి రెండు సంవత్సరాలుగా కాళేశ్వరం, సిట్ అని ఏదో ఒక అంశాన్ని ముందుకు తెచ్చి కాలయాపన చేస్తూ, అసలు ప్రజాపాలనను గాలికి వదిలేసిందని మహేష్ బిగాల తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి విధానం మంచి పాలనకు సరిపోదని ఆయన స్పష్టం చేశారు.
పరిపాలనలో చేతకానితనంతో, ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, అలాగే సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం హేయనీయమని మహేష్ బిగాల చెప్పుకొచ్చారు. ఇలాంటి రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించడం రేవంత్‌రెడ్డి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఈ ప్రభుత్వానికి భయంగా మారాయని, అందుకే బీఆర్ఎస్ను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని మహేష్ బిగాల అన్నారు.
ఇలాంటి రాజకీయ డ్రామాలతో ప్రజలను మోసం చేయడం ఇక సాగదని, తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. ఈ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ ఎన్నారైలు అందరి తరఫున ముక్తకంఠంతో ఖండిస్తున్నామని మహేష్ బిగాల స్పష్టం చేశారు.