హైదరాబాద్ : రాష్ట్ర రాజకీయాల్లో రాజీలేని పోరాటానికి ప్రతీకగా నిలిచిన పార్టీ బీఆర్ఎస్ అని, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పష్టం చేయడం అభినందనీయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడులకు లొంగకుండా, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడం బీఆర్ఎస్కు మాత్రమే సాధ్యమని ఆయన మాటలు మరోసారి రుజువు చేశాయి అని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల అన్నారు.
గత 15 ఏళ్లుగా రాష్ట్రం కోసం, ప్రజల కోసం నిబద్ధతతో పనిచేసిన నాయకుడు కేటీఆర్ అని తెలిపారు. ఎలాంటి బాధ్యత అప్పగించినా శక్తివంచన లేకుండా నిర్వర్తించారు. అధికారం అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడలేదు. ప్రతిపక్షాల కుటుంబాలను, పిల్లలను రాజకీయాల్లోకి లాగి వేధించే దిగజారుడు రాజకీయాలకు బీఆర్ఎస్ ఎప్పుడూ దూరంగా ఉందని గుర్తు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో కేటీఆర్ వ్యక్తిత్వ హననం చేయడం, లేనిపోని వార్తలు సృష్టించి ఆయన కుటుంబసభ్యులను మానసిక క్షోభకు గురి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేసులతో, కక్షసాధింపు రాజకీయాలతో కేటీఆర్ వంటి నాయకులను భయపెట్టడం ఎవరి వల్లా కాదు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐలు కేటీఆకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.