హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష ప్రజాస్వామ్య వ్యవస్థకు మాయని మచ్చ అని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌతాఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు నాగరాజు తెలిపారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు అత్యంత దురదృష్టకరంగా మారాయని గురువారం ఓ ప్రకటనలో ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగించిన భాష తీవ్ర అభ్యంతరకరమని నాగరాజు గుర్రాల మండిపడ్డారు. సీఎం హోదాలో ఉండి దిగజారుడు మాటలు మాట్లాడారని, ఇది రాజకీయ హుందాతనానికి పూర్తి విరుద్ధమని ఆయన అన్నారు. ‘బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తా’ అంటూ బెదిరింపులకు దిగడం రేవంత్ రాజకీయ ఆహంకారానికి నిలువెత్తు నిదర్శనమని నాగరాజు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణకు గౌరవాన్ని తెచ్చిన ఎన్ఆర్ఐలను అవమానించేలా సీఎం మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని నాగరాజు తెలిపారు.
ఉపాధి కోసం స్వదేశం వదిలి.. విదేశాల్లో కష్టపడి పని చేస్తున్న లక్షలాది మంది తెలంగాణ బిడ్డల శ్రమను చిన్నచూపు చూడటం తగదని రేవంత్‌కు ఆయన హితవు పలికారు. తెలంగాణ గౌరవాన్ని, స్వాభిమానాన్ని కాపాడేందుకు బీఆర్ఎస్ ఎప్పటికీ ముందుంటుందని నాగరాజు స్పష్టం చేశారు. అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలే తగిన సమయంలో బుద్ది చెబుతారని నాగరాజు హెచ్చరించారు.