2
Drugs | శక్కర్ నగర్ : కల్తీ కల్లు, మాదకద్రవ్యాల వినియోగంతో యువత నిర్వీర్యంగా మారుతుందని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సుబ్బ రామిరెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలో సదరు శాఖ ఆధ్వర్యంలో కల్తీకల్లు, మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ లో ఏర్పాటుచేసిన సదస్సులో ఆయన మాట్లాడారు.
కల్తీకల్లు, మాదక ద్రవ్యాలను వినియోగిస్తూ యువత నిర్వీర్యం అవుతుందని అన్నారు. తక్కువ డబ్బులతో ఎక్కువ కిక్కు వస్తుందని ఆశతో వీటిని వినియోగిస్తున్నారని, దీంతో చిన్న వయసులోనే అనారోగ్యాలకు గురై, కుటుంబాల గురించి యోచించే విచక్షణ కోల్పోవడంతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని అన్నారు. పలు ప్రాంతాల్లో అందిన సమాచారం, సర్వేల మేరకు కల్తీకల్లు తోపాటు గంజాయి వినియోగానికి యువత బలవుతుందని గుర్తించి, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ వారిచే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఆయన అన్నారు.
ముఖ్యంగా ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రజలు అనారోగ్యానికి గురైతే సదరు కుటుంబీకులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని సుబ్బరామిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా బోధన్ ఏసిపి శ్రీనివాస్ మాట్లాడుతూ బోధన్ ప్రాంతంలో పలువురు రోజువారి కూలీచేసుకొని జీవితాలు గడుపుతున్నారని.. ముఖ్యంగా నిరుపేదలు, కూలి పని చేసుకునే వారు కల్తీకల్లు సేవనానికి, మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలన్నారు. ప్రజలకు ఈ విషయంలో అవగాహన కల్పించేందుకు ఎక్సైజ్ శాఖ తో పాటు ప్రభుత్వానికి చెందిన అన్ని శాఖల అధికారుల సమన్వయం ఎంతో అవసరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ, ఎక్సైజ్ సీఐ భాస్కరరావు, ఎస్సైలు హబీబ్ ఖాన్, భాస్కరాచారి, ఐసీడీఎస్, సీడీపీవో పద్మ, బోధన్ పీఎల్ వీ పద్మాసింగ్, విద్యా వికాస్ విద్యాసంస్థల కరస్పాండెంట్ యార్లగడ్డ శ్రీనివాసరావు, బోధన్ పట్టణానికి చెందిన ప్రముఖులు ప్రతాప్ గుప్తా, పబ్బమురళి తోపాటు పట్టణంలోని పలువురు డ్రైవర్లు, కార్మికులు, యువకులు పాల్గొన్నారు.