బిచ్కుంద, నవంబర్ 17 : ప్రజాసమస్యలపై ప్రశ్నించడం యువత హక్కు అని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడిన ప్రతిఒక్కరికీ అండగా ఉంటానని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే భరోసా కల్పించారు. బిచ్కుందలో అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రశ్నించిన యువకులపై అక్రమకేసులు పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత యువకులను సోమవారం కలిసి మాట్లాడారు. అధైర్యపడొద్దని తాను అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ పార్టీలకు అతీతంగా బిచ్కుంద బంద్, ధర్నా నిర్వహించిన యువతపై అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజాసమస్యలపై ప్రశ్నించినందుకు యువకులపై అక్రమ కేసులు పెట్టి బెదిరించడం, ప్రజాస్వామ్యానికి పనికిరానితనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాసమస్యలపై ప్రశ్నించడం యువత హక్కుఅని, సమస్యలను పరిష్కరించాల్సింది పోయి కేసులు పెట్టడం ప్రజలను అణగదొక్కడమేననన్నారు. కాంగ్రెస్ నాయకులు ఈ ధోరణి మానుకోవాలని మండిపడ్డారు. సెంట్రల్ లైటింగ్ పనులు తదితర ప్రాథమిక సౌకార్యాల కోసం ప్రజలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని సూచిస్తున్నదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జుక్కల్ నియోజకవర్గ యువత, ప్రజలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. యువకులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.