ఆరు గ్యారంటీలకు దరఖాస్తు చేసుకున్నారా?.. అయితే పోలీసులు ఏమంటున్నారంటే..
ప్రజాపాలనలో మీరు ఇచ్చిన దరఖాస్తు అర్హత సాధించింది. మీకు ఇందిరమ్మ ఇల్లు, రేషన్‌కార్డు మంజూరైంది. ఫైనల్ వెరిఫికేషన్ కోసం మేం కాల్ చేస్తున్నాం.. మీ పేరు, రసీదు వివరాలు, ఫోన్ నంబర్, బ్యాంక్ వివరాలను చెప్పండి. మేము సరిచూస్తాం. అలాగే మీ మొబైల్‌కు ఓటీపీ వచ్చింది..
- సైబర్‌నేరగాళ్ల నయా స్కెచ్
- అభయహస్తం దరఖాస్తుదారులే టార్గెట్
- ఓటీపీ చెబితే పథకం మంజూరవుతుందంటూ వల
- నమ్మితే నట్టేట మునగడమేనంటూ పోలీసుల హెచ్చరిక
- అపరిచిత వ్యక్తులకు వివరాలు చెప్పొద్దని అవగాహన
ప్రజాపాలనలో మీరు ఇచ్చిన దరఖాస్తు అర్హత సాధించింది. మీకు ఇందిరమ్మ ఇల్లు, రేషన్‌కార్డు మంజూరైంది. ఫైనల్ వెరిఫికేషన్ కోసం మేం కాల్ చేస్తున్నాం.. మీ పేరు, రసీదు వివరాలు, ఫోన్ నంబర్, బ్యాంక్ వివరాలను చెప్పండి. మేము సరిచూస్తాం. అలాగే మీ మొబైల్‌కు ఓటీపీ వచ్చింది.. చెప్పండి అంటూ మాయచేస్తారు. వాళ్ల మాయమాటలు నమ్మి.. పథకాలు మంజూరయ్యాయనే సంతోషంలో మీ వివరాలు, ఓటీపీ చెప్పారంటే అంతే సంగతులు. మీ బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు ఖాళీ అవ్వడం ఖాయం. సైబర్‌నేరగాళ్ల పట్ల తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు పోలీసులు.
– నిజామాబాద్ క్రైం, జనవరి 9
రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరిట అభయహస్తం పథకాల కోసం స్వీకరించిన దరఖాస్తులపై సైబర్‌నేరగాళ్లు కన్నేశారు. అమాయకులే లక్ష్యంగా ఆన్లైన్ వేదికగా మోసాలకు పాల్పడుతున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని టార్గెట్ చేసుకొని, ఓటీపీల పేరుతో దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లో ప్రజాపాలన కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 7లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో ప్రజల అవసరం, నాడి తెలుసుకున్న సైబర్‌మోసగాళ్లు కొత్త పంథాను ఎంచుకునే ప్రమాదం ఉన్నదని పోలీసులు చెబుతున్నారు. మీ మొబైల్‌కు కాల్ చేసి మీరు అభయహస్తం పథకాలకు చేసుకున్న దరఖాస్తు సక్సెస్ అయ్యింది, వివరాలు కావాలని కొందరిని మభ్యపెట్టే అవకాశం ఉన్నది. మరికొందరికి కాల్ చేసి మీ దరఖాస్తు తిరస్కరణకు గురైంది, ఆమోదం పొందాలంటే మీ వివరాలు తెలపాలని మరోవిధంగా దగా చేసే అవకాశం ఉన్నది.
అధికారుల పర్యవేక్షణలోనే డాటాఎంట్రీ ..
అభయహస్తంలో దరఖాస్తు చేసుకున్న వివరాలను ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది డాటా ఎంట్రీ చేస్తున్నారు. డాటా ఎంట్రీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రభుత్వ సిబ్బంది డోర్ టూ డోర్ వివరాల సేకరణ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి వివరాలు అడిగితే చెప్పకూడదని, అత్యాశతో వివరాలు, ఫోన్‌కు వచ్చే ఓటీపీ చెప్పినా సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాలోని డబ్బులను మాయం చేస్తారని హెచ్చరిస్తున్నారు.
రూటు మార్చిన సైబర్ మోసగాళ్లు..
గతంలో సైబర్‌మోసగాళ్లు మీకు లాటరీ తగిలిందని, మీరు బహుమతి గెలుపొందారని చెబుతూ అమాయకులను మోసం చేసేవారు. వివరాలు చెప్పాలంటూ ఓటీపీని పంపి ఖాతాలోని డబ్బులను మాయం చేసేవారు. రాష్ట్ర పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరించడంతోపాటు పోలీసు స్టేషన్ల పరిధిలో సైబర్ మోసాలపై అవగాహన కల్పించడంతో జనంలో కొంత మార్పు వచ్చింది. దీంతో లాటరీ, బహుమతి అంటూ వచ్చే కాల్స్‌కు దూరంగానే ఉంటున్నారు. దీంతో పద్ధతి మార్చుకున్న సైబర్ కేటుగాళ్లు.. రూటుమార్చి ప్రభుత్వ పథకాలపై పడ్డారు. ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరుతుందనగానే ఎంతటి వారైనా తమ వలలో పడడం ఖాయమనే ఉద్దేశంతో కొత్త పంథాలో వెళ్తున్నారు. ప్రభుత్వాలు తీసుకొచ్చి సంక్షేమ పథకం మాటున అమాయకులను దోచేందుకు సిద్ధమయ్యారు.
ఎవరికీ, ఎలాంటి సమాచారం చెప్పొద్దు..
అభయహస్తం పథకం కోసం దరఖాస్తు చేసుకున్నవారిపై సైబర్ మోసగాళ్లు వేటువేసే అవకాశం ఉన్నది. అజ్ఞాత వ్యక్తులు ఫోన్ చేసి వివరాలు అడిగితే చెప్పొద్దు. మీకు ఇల్లు మంజూరైందని, రేషన్‌కార్డు వచ్చిందని అందుకోసం మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ చెప్పాలని అడిగినా స్పందించొద్దు. ఆన్లైన్ ద్వారా డబ్బులు పోతే వెంటనే సైబర్ హెల్ప్ సెల్ 1930 నంబర్‌కు 24గంటల్లోపు ఫిర్యాదు చేయాలి.
– కిరణ్‌కుమార్, ఏసీపీ, నిజామాబాద్
పోలీసుల అప్రమత్తం… అవగాహన ముమ్మరం
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న అభయహస్తం కార్యక్రమాన్ని అదనుగా చేసుకొని మోసం చేసే అవకాశం ఉన్నదని సైబర్ టెక్నాలజీ సెల్ అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సైబర్ మోసగాళ్లు ఫోన్ చేసి మాయమాటలు చెప్పి లూటీ చేసే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దని, ఎట్టిపరిస్థితుల్లో మొబైల్‌కు వచ్చే ఓటీపీ, బ్యాంకు వివరాలను చెప్పకూడదని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అత్యాశకు వెళ్లి వివరాలు చెబితే మీ బ్యాంకు అకౌంట్లలో ఉండే డబ్బులను సైబర్‌నేరగాళ్లు మాయం చేసే అవకాశం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. పొరపాటున వివరాలు చెబితే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

