రామారెడ్డి, జూన్ 11: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో బతుకు ఆగమైన ఓ ఆటోడ్రైవర్‌ను దురదృష్టం వెంటాడింది. ఇక్కడ ఆటో నడవడం లేదని, ఉపాధి కోసం ఎడారి దేశానికి వెళ్లిన వారానికే గుండెపోటు రూపంలో మృత్యువు కబళించింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన ఇనూస్ (42) వృత్తి రీత్యా ఆటోడ్రైవర్. ఆయనకు భార్య ఉమేరా, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అప్పు చేసి కొన్న ఆటోను నడుపుతూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకురావడంటో పాటు చేసిన అప్పుకు వడ్డీ చెల్లించే వాడు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడంతో ఉపాధి దూరమైంది. గిరాకీ లేక, వడ్డీ కట్టలేక అప్పు పెరిగిపోయింది. దీంతో ఆటోను అమ్మేసి మే 30న సౌదీ అరేబియా దేశంలోని జిద్దా పట్టణంలో హౌస్ డ్రైవర్‌గా వెళ్లాడు. విధుల్లో చేరిన తర్వాత ఈ నెల 4న కుటుంబసభ్యులకు ఫోన్ చేసి జ్వరంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపాడు. ఇదే విషయం అక్కడి కపిల్ (యజమాని)కి తెలపగా అతను స్పందించలేదు. దీంతో ఇనూస్ ఒక్కడే దవాఖానకు వెళ్తూ మార్గమధ్యలో గుండెపోటుతో కుప్పకూలాడు. అక్కడి పోలీసులు వేలిముద్రల ఆధారంగా మృతుడిని ఇనూస్గా గుర్తించి కపిల్‌తో పాటు ఇక్కడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. చేసిన అప్పులు అలాగే ఉండగా.. మళ్లీ అప్పు చేసి గల్ఫ్‌కు వెళ్లిన ఇనూస్ మృతితో కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించాలని కుటుంబసభ్యులు, బంధువులు వేడుకుంటున్నారు.