కామారెడ్డి, ఫిబ్రవరి 17 : ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడిన ఓ యువకుడు అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో చోటుచేసుకున్నది. దేవునిపల్లి ఎస్సై రాజు, కుటుంబీకుల కథనం ప్రకారం.. దేవునిపల్లి గ్రామానికి చెందిన దేవల సంజయ్‌కు నాలుగేండ్ల క్రితం శ్రీలతతో వివాహమైంది. వీరికి మూడున్నరేండ్ల కూతురు, ఏడాదిన్నర కుమారుడు ఉన్నారు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సంజయ్ రెండేండ్ల నుంచి ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడ్డాడు. అప్పటికే అప్పులు ఉండగా.. బెట్టింగ్ ఆడడంతో సుమారు రూ. 80 లక్షల వర కు అప్పులు పెరిగాయి. అప్పులు తీర్చడానికి ఉన్న ఇంటిని అమ్మడానికి ప్రయత్నించినా..అనుకున్నంతగా డబ్బులు రాకపోవడంతో విరమించుకున్నాడు.
భార్య ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో ఆమె తన తల్లిగారింటికి (క్రిష్ణాజివాడి) ఆరు నెలల క్రితం వెళ్లిపోయింది. అప్పుడప్పుడు తన భార్యతో సంజయ్ ఫోన్లో మాట్లాడే క్రమంలో ఆదివారం సాయంత్రం కూడా శ్రీలతకు ఫోన్ చేసి డబ్బుల విషయంలో కలత చెందాడు. అప్పులు కట్టలేక జీవితంపై విరక్తి చెంది తీవ్ర మనస్తాపంతో ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఉన్న బెడ్రూంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై రాజు తెలిపారు. తన భర్త ఆన్లైన్ బెట్టింగ్‌లో అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడని భార్య తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.