మోర్తాడ్, సెప్టెంబర్ 8: ఎస్సారెస్పీ సందర్శనకు వచ్చిన ఓ యువకుడు గోదావరిలో గల్లంతయ్యాడు. మెండోరా ఎస్సై నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన ఫిరోజ్ అహ్మద్‌ఖాన్ (28) ఈనెల 4న జగిత్యాల జిల్లా కోరుట్లలోని అతడి మామ ఇంటికి వచ్చాడు. ఆదివారం కావడంతో ఎస్సారెస్పీని సందర్శించడానికి మరో ఐదుగురు మిత్రులతో కలిసి వెళ్లాడు.
ప్రాజెక్ట్ దిగువన ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిలోని ఓ బండరాయిపై స్నేహితులతో కలిసి కూర్చొని సరదాగా చేపలు పడుతుండగా.. ఫిరోజ్ కాలుజారి అందులో పడిపోయాడు. స్నేహితులు చూస్తుండగానే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. స్నేహితుడు రోహిత్ గోదావరిలో దిగి చాలాసేపు ఫిరోజ్ కోసం వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గల్లంతైన యువకుడు ఆచూకీ లభించకపోవడంతో కేసునమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నారాయణ తెలిపారు.