బీబీపేట్, జనవరి 23: ఫైనాన్స్ కంపెనీ వేధింపులకు ఓ యువకుడు బలయ్యాడు. చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని తుజాల్పూర్ గ్రామంలో చోటుచేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తుజాల్పూర్ గ్రామానికి చెందిన సుంకరి ప్రవీణ్‌గౌడ్(32) ఇంటి నిర్మాణం కోసం ఓ ఫైనాన్స్ కంపెనీలో రూ. 3 లక్షల రుణం తీసుకున్నాడు. మొదటి నుంచి ఈఎంఐలు సక్రమంగా చెల్లిస్తూ రాగా..చివరి ఈఎంఐ చెల్లించడంలో జాప్యం నెలకొన్నది.
దీంతో ఫైనాన్స్ యాజమాన్యం, సిబ్బంది ప్రవీణ్‌గౌడ్‌ను బయట, ఇంటికి వెళ్లి వేధించసాగారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ప్రవీణ్‌గౌడ్ గ్రామ శివారులోని ఓ చెట్టుకు బుధవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య అర్చన, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబం వీధిన పడింది. ప్రవీణ్‌గౌడ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య సుంకరి అర్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు.