నిజామాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం కేవలం మాటలకే పరిమితమైంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఇప్పటి వరకు నాలుగు నియోజకవర్గాలకు వీటిని మంజూరు చేసినట్లు ప్రకటించింది.కానీ ఇప్పటివరకు భూసేకరణ, నిధులు మంజూరు ప్రక్రియ పూర్తికాలేదు. ఇప్పటికే పాత విద్యాసంవత్సరం పోయి మరో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. అయినప్పటికీ పాలకుల్లో చలనం కరువైంది. కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో మంజూరవగా, నిజామాబాద్ జిల్లాలో బాన్సువాడ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఏ ప్రాంతంలో ఎప్పటి లోపు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తారనే విషయంపై స్పష్టత కొరవడింది. మొదటి విడుతలో 19 నియోజకవర్గాలు, రెండో విడుతలో 20 నియోజకవర్గాల్లో స్కూళ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర వ్యాప్తంగా శంకుస్థాపన చేశారు. ఉమ్మడి జిల్లాలోనూ జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్‌లోనే శంకుస్థాపనలు జరిగాయి. బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండంలోని పీఎస్ఆర్ నగర్(సోంపూర్ శివారు)లో 20 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. మద్నూర్‌లో నెలలు గడుస్తున్నా పునాది రాయి తీసింది లేదు. బాల్కొండ, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి నియోజకవర్గాలకు సంబంధించిన యంగ్ ఇండియా స్కూళ్ల ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమైంది.
యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ మంజూరుపై ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఘనంగా ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి యంగ్ ఇండియా స్కూల్‌ను సాధించినట్లుగా సోషల్ మీడియాలోనూ చెప్పుకున్నారు. తీరా నెలలు గడుస్తున్నా శంకుస్థాపన ముచ్చటే లేకుండా పోయింది. అంక్సాపూర్ లేదంటే అంకాపూర్‌లో ఏర్పాటు చేయాలని యంత్రాంగం యోచిస్తుండగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు.
నిజామాబాద్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ భూముల కొరత వేధిస్తున్నది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైనట్లు చెబుతున్నారు. రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన యంగ్ ఇండియా స్కూల్‌ను డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామం ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం, ఎమ్మెల్యే నిర్ణయించారు. ఇక్కడ 25 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి ప్రతిపాదిత స్థలంలో అటవీ శాఖ భూములు ఉన్నట్లు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఏర్పాటు ప్రక్రియ అటకెక్కింది.
తొమ్మిది ఎకరాలకు అటవీ శాఖ కొర్రీలు పెడుతున్నది. 14 ఎకరాలకు అభ్యంతరాలు లేవు. కానీ 25 ఎకరాలు స్థలం అవసరం ఉంది. బాన్సువాడలో మంజీరా నది పరీవాహక ప్రాంతమైన పోతంగల్ మండలంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో లింగంపేట మండలం మోతె గ్రామంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక్కడ 25 ఎకరాలను బదిలీ చేయబోతున్నారు. జుక్కల్‌లో మద్నూర్‌లో శంకుస్థాపన జరిగినప్పటికీ తట్టెడు మట్టి ఎత్తలేదు.
పనులు కూడా షురూ కాలేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లుగా చెబుతున్నప్పటికీ మాటలకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పరిమితమైనట్లు ప్రజలు భావిస్తున్నారు. వీటి నిర్మాణాలు పూర్తి కావడానికి సుమారు రెండేండ్లు పట్టే అవకాశం ఉన్నది. అడ్మిషన్లు స్వీకరించి తరగతులు ప్రారంభించే నాటికి అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వీలుంది. భారీ వ్యయంతో సుమారు 25 ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం ఇప్పట్లో పూర్తవడం కష్టతరమే. సుమారుగా రెండు నుంచి మూడేండ్ల వరకు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సమీకృత గురుకుల స్కూళ్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు చెప్పుకుంటున్నది. అంతర్జాతీయ ప్రమాణాలతో రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేపడుతున్నామని పేర్కొంటున్నారు. ప్రకటనలకు దీటుగా పనులు మాత్రం జరగడం లేదు. గతేడాది అక్టోబర్ 11న రాష్ట్రవ్యాప్తంగా 19 నియోజకవర్గాల్లో తొలి దశలో శంకుస్థాపనలు చేయడంతో ఈ ప్రక్రియ మొదలైంది. 25 ఎకరాల్లోపు స్థలాన్ని సేకరించి ఒకే చోట ఒకటి నుంచి ఉన్నత విద్య వరకు విద్యను అభ్యసించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో సీటు దక్కించుకున్న విద్యార్థికి రూపాయి ఖర్చు లేకుండానే నాణ్యమైన విద్య అందుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నది.
ఈ కార్యక్రమాన్ని సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు చెబుతుండగా ఉమ్మడి జిల్లాకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు మోక్షం లభించకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రతిష్టాత్మక స్కూల్స్ నిర్మాణాలు చకచక చేపట్టడంలో విఫలమైయ్యారనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న బాల్కొండ, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్‌లో యంగ్ ఇండియా స్కూళ్ల ముచ్చటే కరువైంది. ప్రతిపాదనలకే పరిమితమైంది. పరిపాలన అనుమతులూ రాలేదు. బోధన్‌లో బెల్లాల్లో ఏర్పాటుకు నిశ్చయించినట్లుగా తెలిసినా, అధికారికంగా ప్రకటన చేయలేదు.