Kotagiri | కోటగిరి, జనవరి 27 : వాహనాలు నడిపే ప్రతీ ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, హెల్మెట్ ధరించడం వల్ల రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాన్ని కాపాడుకోవచ్చని కోటగిరి ఎస్సై సునీల్ అన్నారు. అలైవ్-అరైవ్ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లింగాపూర్ గ్రామంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. అంతకు ముందు గన్నారం ఎక్స్ రోడ్ నుండి లింగాపూర్ గ్రామం వరకు బైకులపై హెల్మెట్ ధరించి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎస్సై సునీల్ మాట్లాడుతూ వాహనం నడిపే ప్రతీ ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలను నడపొద్దని సూచించారు. ముఖ్యంగా వాహనాలను అతివేగంగా నడపవద్దని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలువురికి హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు శారద రాజేశ్వరి పటేల్, దేగం హనుమంతు, యువకులు పాల్గొన్నారు.