నిజామాబాద్, ఏప్రిల్ 24, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) పసుపు బోర్డు పేరిట బీజేపీ ఎంపీ అర్వింద్ ప్రకటనలు ఇంద్రజాలాన్ని తలపిస్తున్నాయి. ఉన్నది లేనట్లు… లేనిది ఉన్నట్లుగా చిత్రీకరించడపై రైతులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. అతీగతి లేని పసుపు బోర్డు ప్రక్రియను రాజకీయంగా వాడుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టకుండా.. కేవలం సోషల్ మీడియా ప్రకటనలకే పరిమితమైన అర్వింద్‌కు ప్రస్తుత ఎన్నికలు సవాల్‌గా మారాయి.
పసుపు బోర్డుపై నాడు బాండ్ పేపర్ నాటకమాడిన అర్వింద్.. నేడు ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో బూటకమాడుతున్నాడు. ఐదు రోజుల్లోనే పసుపు బోర్డును తెస్తానని, 2019లో బాండ్ పేపర్ రాసిచ్చి గట్టెక్కాడు. బోర్డు గురించి ప్రశ్నిస్తే వంకర సమాధానాలతో తప్పించుకొని తిరిగాడు. పైగా రైతులపై రాజకీయ ముద్రవేసి తిట్ల దండకం అందుకున్నాడు. పసుపు బోర్డు ఏర్పాటు జరిగిపోయిందంటూ మరోసారి రైతులను వంచనకు గురి చేస్తున్నాడు. అక్టోబర్‌లో నిజామాబాద్, మహబూబ్‌నగర్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీనే స్వయంగా పసుపు బోర్డు ప్రకటన చేయగా, ఇప్పటి వరకు దాని ఊసెత్తకపోవడంపై రైతుల్లో అనుమానాలను రేకెత్తిస్తున్నది.
గత ఎన్నికల్లో గెలిచాక అర్వింద్.. పసుపు బోర్డును అటకెక్కించాడు. పూటకో మాట మాట్లాడుతూ రైతులను గందరగోళంలో పడేశాడు. బోర్డు ఇవ్వబోమంటూ కేంద్రం స్పష్టం చేశాక కొత్త పల్లవిని అందుకున్నాడు. ఎక్స్టెన్షన్ ఆఫీస్‌ను చూపిస్తూ ఇదే పసుపు బోర్డు అన్నట్లు మభ్యపెట్టాడు. ఈ కార్యాలయంతో రైతులకు ఇసుమంతైనా లాభం జరుగలేదు. రెండేండ్ల నుంచి పసుపు పంటకు తెగుళ్లు పట్టి పీడిస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు.
మూడేండ్లుగా పసుపు సాగు విస్తీర్ణం భారీగా తగ్గుముఖం పడుతున్నా.. రైతులకు ప్రోత్సాహం అందించిన దాఖలాలు లేవు. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల ముందు మరోసారి మోదీనే స్వయంగా పసుపు బోర్డు ప్రకటన చేయడంతో అంతా నిజమేనని నమ్మారు. కానీ సీన్ కట్ చేస్తే ఎన్నికల కోడ్..! అంతకుముందే చిత్తశుద్ధితో బోర్డు ప్రక్రియను వేగవంతం చేయకపోవడంపై రైతులు మళ్లీ ఆలోచనలో పడ్డారు. ఎన్నికల తర్వాత పుసుపు బోర్డును అటకెక్కించే అవకాశమూ లేకపోలేదని అంటున్నారు.