భిక్కనూరు, మార్చి 6: మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు అన్నాన్ని పారబోసిన ఘటన మండలంలోని భాగిర్తిపల్లి గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకున్నది. పాఠశాలలో శుక్రవారం విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనంలో పురుగుల అన్నం వడ్డించారు. ఈ విషయమై విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడికి చెప్పగా పట్టించుకోలేదు. దీంతో విద్యార్థులు భోజనం తినలేక పారబోసి, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే పాఠశాలకు తరలివచ్చిన తల్లిదండ్రులు..ఉపాధ్యాయులను ప్రశ్నించారు. తమకేమీ తెలియదని చెప్పడంతో ఎంఈవో దృష్టికి తీసుకెళ్లడానికి యత్నించిగా, ఆయన ఫోన్లో అందుబాటులోకి రాలేదు. దీంతో అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పురుగుల అన్నం వడ్డించే ఏజెన్సీ నిర్వాహకులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ ఏజెన్సీ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కొన్నిరోజులుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఉపాధ్యాయులకు చెబుతున్నా వారు పట్టించుకున్న దాఖలాలు లేవని సమాచారం.